Vijayawada: నూతన నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం విస్తృత సమావేశం!

Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మార్పు కోసం కమ్యూనిస్టులు, పౌర సమాజం ఏకం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు పిలుపునిచ్చారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 27 Sept 2026 3:44 PM IST
Vijayawada
X

Vijayawada: నూతన నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం విస్తృత సమావేశం!

Vijayawada: విజయవాడ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ పాత నగరంగా మారుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి. నగరాభివృద్ధికి ప్రత్యామ్నాయ విధానాల కోసం కమ్యూనిస్టులు, అభ్యుదయ శక్తులు,పౌర సమాజం ఏకం కావాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబురావు అజిత్ సింగ్‌నగర్, 78వ డివిజన్( నూతన) సీపీఎం విస్తృత సమావేశం సింగ్ నగర్.. మాకినేని బసవపున్నయ్య భవన్‌లో సీపీఎం సెంట్రల్ సిటీ కమిటీ సభ్యులు ఎస్.కె. నిజాముద్దీన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబురావు పాల్గొని ప్రసంగించారు.

రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో నగర, రాష్ట్ర పట్టణాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలపై మోయలేని పన్నుల భారాలు మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తమ ఓటు ద్వారా నిరసన వ్యక్తం చేయాలని కోరారు.

నిత్యావసర వస్తువులతో పాటు పాల ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు గళం విప్పాలని అన్నారు. స్థానిక సంస్థల అధికారాలను క్రమంగా బలహీనపరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల కమిషన్‌ను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ప్రజల ఓటు హక్కు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు మద్దతు ఇస్తున్న రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ వైఖరిని పునరాలోచించుకోవాలని కోరారు.

విజయవాడ నగరంలో పాలక పార్టీలు నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని, అవసరమైన నిధులు కేటాయించకుండా ప్రజలపై వివిధ రకాల భారాలు మోపుతున్నాయని బాబురావు విమర్శించారు. నగరంలో ఉన్న విలువైన స్థలాలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించకుండా, జి.ఓ. 673 ద్వారా వాటిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థను... ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలు, పార్టీలు నగర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లలేకపోయాయని ఆయన అన్నారు.

ఇందుకు భిన్నంగా విజయవాడ నగరంలో సీపీఎం, వామపక్షాలు పదేళ్లపాటు ఆదర్శవంతమైన పాలన అందించాయని తెలిపారు. ప్రజలపై పన్నుల భారాలు మోపకుండా నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేశామని, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించి ప్రజల గొంతుకగా నిలిచామని అన్నారు.

సీపీఎం కార్పొరేటర్లు గతంలో.. ప్రజలకు సేవలందించిన చరిత్రను ఆయన గుర్తు చేశారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియం నిర్మాణం, నామమాత్ర ధరలకు ఇళ్ల పట్టాల అందజేత, కృష్ణానది నీటిని ప్రజలకు అందించడం వంటి అనేక ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో సీపీఎం,వామపక్షాల ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషించారని తెలిపారు.

సింగ్‌నగర్‌తో పాటు విజయవాడ నగర అభివృద్ధిని కోరుకునే అభ్యుదయ, లౌకిక శక్తులు, వామపక్షాలు రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ, మేయర్ స్థానంలోనూ ఉమ్మడి కృషి చేయాలని బాబురావు పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజా సమస్యలపై పోరాడే శక్తులు ముందుకు రావాలని కోరారు.

విజయవాడ నగరాన్ని అమరావతితో సమాంతరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పట్టణాల్లో రూ.11 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించినప్పటికీ, విజయవాడ నగరానికి కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదని విమర్శించారు.

నగరంలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు.

నగరపాలక సంస్థ ఎన్నికలకు ముందే ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద నిర్మించిన జి+3 ఇళ్లను అద్దెదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

బుడమేరు వరదల నేపథ్యంలో ముంపు నివారణ చర్యలు చేపట్టి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ అవి మాటలకే పరిమితమయ్యాయని బాబురావు అన్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ నగర ప్రజలు ముంపు భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆస్తిపన్ను పెంచబోమని, పన్నుల విధానాన్ని సమీక్షిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ, ప్రతి ఏడాది ఆస్తిపన్ను పెంచుతున్నారని విమర్శించారు. ఇప్పటికే గత ఆరేళ్లలో ఆస్తిపన్ను 130 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. ఇప్పుడు మరోసారి పరోక్షంగా చెత్త పన్ను విధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు వాటిని గాలికి వదిలేసి, ధనార్జనే ప్రధాన లక్ష్యంగా పదవులను ఉపయోగించుకుంటున్నారని బాబురావు విమర్శించారు. తమకు ఉన్న పదవులు చాలవన్నట్లుగా కుటుంబ సభ్యులకు కూడా పదవులు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

ప్రజా సమస్యలపై నికరంగా పనిచేస్తున్న సీపీఎం, వామపక్షాలకు ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. డబ్బు, కులం, మతం ఆధారంగా కాకుండా ప్రజా సమస్యల కోసం నిజాయితీగా పనిచేసే వారిని ఆదరించాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో సీపీఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రమణారావు, నగర నాయకులు ఎం. సోమేశ్వరరావు, డివిజన్ నాయకులు వి. సాంబశివరావు, ఎస్.కె. దేవికుమారి, ఎస్. విజయలక్ష్మి, వి. చంద్రమణి, ఎం. లింగరాజు, ఆర్. వెంకటేశ్వరరావు, స్థానిక పెద్దలు పి. శేషయ్య, జె. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.