Vijayawada: ఏపీలో బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్ సందడి: ఏసీఏ ఏర్పాట్లు పూర్తి
Vijayawada: రాష్ట్రంలోని విశాఖ, విజయనగరం, మూలపాడు, అనంతపురం వేదికలుగా బీసీసీఐ రంజీ, వినూ మన్కడ్, సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి: ఏసీఏ సెక్రటరీ సతీష్ బాబు.
Vijayawada: ఏపీలో బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్ సందడి: ఏసీఏ ఏర్పాట్లు పూర్తి
Vijayawada: విజయవాడ( ఏ సి ఏ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం) ఆంధ్రప్రదేశ్‌లో బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్ సందడి నెలకొననుంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం, మూలపాడు, అనంతపురం వేదికలుగా ప్రతిష్టాత్మకమైన వినూ మన్కడ్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సెక్రటరీ సానా సతీష్ బాబు తెలిపారు.
వినూ మన్కడ్ ట్రోఫీ – ఎలైట్ గ్రూప్ ‘ఈ’
ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు విశాఖపట్నం, విజయనగరం వేదికలుగా అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఈ’ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ పోటీల్లో గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, చండీగఢ్ జట్లు తలపడనున్నాయి. యువ క్రికెటర్ల ప్రతిభను చాటుకునేందుకు ఈ టోర్నమెంట్ కీలక వేదికగా నిలవనుంది.
మూలపాడులో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా మూలపాడు క్రికెట్ స్టేడియం రెండు కీలక మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 11 నుంచి 14 వరకు ఆంధ్ర–కర్ణాటక, 18 నుంచి 21 వరకు ఆంధ్ర–హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.
అనంతపురంలో సీకే నాయుడు ట్రోఫీ
అండర్-23 సీకే నాయుడు ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఆంధ్ర vs జార్ఖండ్ మ్యాచ్ అనంతపురంలోని ఆర్‌డీటీ స్టేడియం వేదికగా జరగనుంది.
బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి స్టేడియంలు, పిచ్‌లు, మౌలిక వసతులు, ఆటగాళ్లకు అవసరమైన సౌకర్యాలు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సానా సతీష్ బాబు తెలిపారు. మ్యాచ్‌లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు, బీసీసీఐ డొమెస్టిక్ మ్యాచ్‌లకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను వేదికలుగా తీర్చిదిద్దేందుకు ఏసీఏ నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.




