Vijayawada: వైద్య విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ‘ఈజ్-ఏపీ’ భరోసా!

Vijayawada: వైద్య విద్యార్థుల్లో ఒత్తిడిని తొలిదశలోనే గుర్తించేందుకు ‘ఈజ్-ఏపీ’ కార్యక్రమం. 36 వైద్య కళాశాలల్లో శిక్షణ చేపట్టిన డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 5 Oct 2026 5:56 PM IST
Vijayawada
X

Vijayawada: వైద్య విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ‘ఈజ్-ఏపీ’ భరోసా!

Vijayawada: వైద్య విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలను తొలిదశలోనే గుర్తించి, అవి తీవ్రమైన మానసిక సమస్యలుగా మారకముందే అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఈజ్-ఏపీ’ (ఎమోషనల్ అసెస్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తెలిపింది.

విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, సహాయం కోరడంపై ఉన్న సంకోచాన్ని తగ్గించడం, తోటి విద్యార్థుల్లో మానసిక ఇబ్బందులను గుర్తించే నైపుణ్యాలను పెంపొందించడం, అవసరమైన వారిని నిపుణుల వద్దకు పంపించే వ్యవస్థను బలోపేతం చేయడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయి సుధీర్, ఈజ్-ఏపీ మెడికల్ డైరెక్టర్, చైల్డ్ అండ్ అడోలెసెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అపర్ణ వుప్పల కార్యక్రమం అమలు, ఫలితాలను వివరించారు. విశ్వవిద్యాలయం పరిశోధన-అభివృద్ధి విభాగం డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రభ పాల్గొన్నారు.

విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుదల ఆందోళనకరం

ఈజ్-ఏపీ నివేదికలో పొందుపరిచిన ఎన్‌సీఆర్‌బీ-2024 గణాంకాల ప్రకారం దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 2013లో 8,423 నుంచి 2024లో 14,488కు పెరిగింది. ఇది 72 శాతానికి పైగా పెరుగుదల. 2024లో విద్యార్థుల ఆత్మహత్యలు దేశంలోని మొత్తం ఆత్మహత్య మరణాల్లో సుమారు 8.5 శాతంగా నమోదైనట్లు నివేదిక పేర్కొంది. సమస్య తీవ్రమైన తర్వాత మాత్రమే స్పందించకుండా, విద్యార్థుల్లో ఒత్తిడి, భావోద్వేగ ఇబ్బందులను ప్రారంభ దశలోనే గుర్తించి సహాయం అందించాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు.

2023లో ప్రారంభమైన ‘ఈజ్-ఏపీ’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో 2023 జనవరి 6న ఈజ్-ఏపీ కార్యక్రమం ప్రారంభమైంది. క్యూపీఆర్ ఇన్‌స్టిట్యూట్ ఇండియా (QPRI), సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ (SPIF) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఆరోగ్యశాఖ, డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, వైద్య విద్యాశాఖ తదితర విభాగాలు భాగస్వాములుగా ఉన్నాయి.

విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య అవగాహన, సహాయం కోరే ధోరణి, పీర్ సపోర్ట్ నైపుణ్యాలను పెంచడంతో పాటు మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలు, స్టిగ్మాను తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. ఎన్‌ఎంసీ, యూజీసీ, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాల స్ఫూర్తికి అనుగుణంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

2025 బ్యాచ్‌కు 36 వైద్య కళాశాలల్లో శిక్షణ

2025 ఎంబీబీఎస్ బ్యాచ్‌కు ఈజ్-ఏపీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2025 నవంబరు నుంచి 2026 జనవరి మధ్య శిక్షణను పూర్తిచేశారు. అనంతరం 19 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2026 మార్చి-ఏప్రిల్ నెలల్లో శిక్షణ నిర్వహించారు. అందుబాటులో ఉన్న 2025 బ్యాచ్ నివేదిక ప్రకారం ఈ దశలో 17 ప్రభుత్వ, 19 ప్రైవేటు కలిపి 36 వైద్య కళాశాలల్లో కార్యక్రమం అమలైంది.

3,645 మంది విద్యార్థులకు చేరువ - 99 శాతం హాజరు

19 ప్రైవేటు వైద్య కళాశాలలకు చెందిన 3,645 మంది ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులను కార్యక్రమంలో నమోదు చేశారు. వారిలో 3,633 మంది పీర్ మెంటార్ ట్రైనింగ్‌కు హాజరై 99 శాతం హాజరు సాధించారు. 3,645 మందిని క్యూపీఆర్ గేట్‌కీపర్ శిక్షణకు నమోదు చేయగా, నివేదిక రూపొందించిన సమయానికి 3,059 మంది సర్టిఫికేషన్ పూర్తిచేశారు. ఇది 84 శాతం పూర్తిస్థాయి రేటు.

పీర్ మెంటార్ శిక్షణలో ఏమేం నేర్పిస్తారు?

పీర్ మెంటార్ శిక్షణను ఒక్కో కళాశాలలో 4 నుంచి 6 గంటల ప్రత్యక్ష కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఒత్తిడి, మానసిక సంక్షోభానికి సంబంధించిన హెచ్చరిక సంకేతాలను గుర్తించడం, ఒత్తిడి నిర్వహణ, సమయ నిర్వహణ, నిద్ర అలవాట్లు, శ్రద్ధగా వినడం, సహానుభూతితో స్పందించడం, తోటి విద్యార్థికి అండగా నిలవడం, అవసరమైనప్పుడు సరైన నిపుణుల వద్దకు పంపించడం, సహాయం కోరడంపై ఉన్న స్టిగ్మాను తగ్గించడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆయా కళాశాలల ఈజ్ సైకియాట్రీ కోఆర్డినేటర్, అకడమిక్ కోఆర్డినేటర్ కూడా శిక్షణలో భాగస్వాములవుతున్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.