Vijayawada: విజయవాడలో ఘనంగా రెండు పుస్తకాల ఆవిష్కరణ!

Vijayawada: విజయవాడలో వాణిశ్రీ 'స్వేచ్ఛాలాపన', డాక్టర్ శ్రీనివాస్ 'తుదిరెప్ప' పుస్తకాలను ఆవిష్కరించిన అడ్మిన్ డిసీపీ కేజీవీ సరిత. పూర్తి వివరాలు ఇక్కడ.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 29 Sept 2026 8:06 AM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడలో ఘనంగా రెండు పుస్తకాల ఆవిష్కరణ!

Vijayawada: విజయవాడ వ్యాస్ కాంప్లెక్స్ నందు ఎ.ఆర్.ఎ.డి.సి.పి. ఎన్.వి.రమణ సతీమణి వాణిశ్రీ నైనాల రచించిన 'స్వేచ్ఛాలాపన' మరియు డాక్టర్ శ్రీనివాస్ రచించిన 'తుదిరెప్ప' పుస్తకాలను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ముఖ్య అతిదిగా హాజరై 'స్వేచ్ఛాలాపన' మరియు 'తుదిరెప్ప'పుస్తకాలను ఆవిష్కరించి, తొలి ప్రతులను రచయితల తల్లిదండ్రులకు అందించారు.

ఈ సందర్బంగా డి.సి.పి. మాట్లాడుతూ...... సమాజంలో సాహిత్యం మరియు కవిత్వం మనుషుల అంతర్మథనాన్ని, భావాలను అక్షర రూపంలోకి మార్చి ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతాయని తెలిపారు. పోలీస్ విధుల వంటి నిరంతర ఒత్తిడితో కూడిన బాధ్యతల్లో ఉన్నప్పటికీ, సాహిత్యం పట్ల ఆసక్తి మరియు కొత్త విషయాలు తెలుసుకోవాలనే తృష్ణ మనిషిని నిరంతరం ప్రశాంతంగా, క్రియాశీలకంగా ఉంచుతాయని తెలిపారు.

ఈ క్రమంలో స్వేచ్ఛాలాపన'లోని 'గెలుపు దళం' కవితను ప్రస్తావిస్తూ... సమాజంలో ఎదురయ్యే విమర్శలకు కుంగిపోకుండా, వాటినే విజయ సోపానాలుగా మార్చుకుని ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఒక మహిళగా కుటుంబ బాధ్యతలు, ఉద్యోగరంగాన్ని సమన్వయం చేసుకుంటూనే, స్వతంత్ర ఆలోచనలను, సృజనాత్మకతను ఎలా ఆస్వాదించవచ్చో రచయిత్రి వాణిశ్రీ ఈ పుస్తకంలో అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు.

అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ రాసిన 'తుదిరెప్ప'లోని 'విజయపు నవ్వు' అంశంపై మాట్లాడుతూ... మనిషికి తన లక్ష్యంపై సంపూర్ణ దృష్టి ఉంటే దారిలో వచ్చే ఎలాంటి అడ్డంకులైనా చిన్నవిగా మారిపోతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎ.ఆర్.ఎ.డి.సి.పి. ఎన్.వి.రమణ , నల్లాన్ చక్రవర్తుల చక్రవర్తి డాక్టర్ G.V. పూర్ణచందు , గుమ్మా సాంబశివరావు డాక్టర్ సుంకర గోపాల్ , గుత్తికొండ సుబ్బారావు , పాలపర్తి శ్యామలనంద ప్రసాద్ , పూసపాటి కృష్ణసూర్యకుమార్ , చుండూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.