Burning Topic: రెచ్చిపోతున్న హౌథీలు.. సౌదీ కోసం పాకిస్తాన్ టర్కీ సిద్ధం!
Burning Topic: యెమెన్‌లో అంతర్యుద్ధం మరింత ఉధృతమైంది. కీలక ప్రాంతాలను హౌతీలు స్వాధీనం చేసుకోగా, సౌదీ సంకీర్ణ దళాలు భారీ సైనిక చర్యను ప్రారంభించాయి.
Burning Topic: రెచ్చిపోతున్న హౌథీలు.. సౌదీ కోసం పాకిస్తాన్ టర్కీ సిద్ధం!
Burning Topic: పశ్చిమాసియాలోని యెమెన్‌లో అంతర్యుద్ధం రోజు రోజుకూ ఉద్ధృతమవుతోంది. 2014 నాటి పరిస్థితులు మరోసారి తప్పడం లేదు. సౌదీ అరేబియా. హౌతీ తిరుగుబాటుదారుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జులైలో ముగిసిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు యెమెన్‌లో ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్నారు. గత నెలలో మోఖా రేవు పట్టణం, ఎర్ర సముద్రంలోని పలు ద్వీపాలు, బాబ్ ఎల్ మండెబ్ జలసంధిని హౌతీ రెబెల్స్ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా దేశంలోని మూడో అతిపెద్ద నగరమైన తైజ్లోకి చొచ్చుకెళ్లేందుకు చూస్తున్నారు. తైజ్ శివార్లలోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కీలకమైన తుర్బా పట్టణాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. హౌతీలపై స్థానిక ప్రభుత్వం భారీ సైనిక చర్యను ప్రకటించడానికి కొద్దిసేపటి ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది.
మరోవైపు, హౌతీల నియంత్రణలో ఉన్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ‘డాన్ ఆఫ్ యెమెన్’ పేరిట యెమెన్ అధ్యక్ష నాయకత్వ మండలి-పీఎల్సీ భారీ సైనిక చర్యను చేపట్దింది. ఈ క్రమంలో బాబ్ ఎల్ మండెబ్ జలసంధిపై తాము పైచేయి సాధించామని తెలిపింది. తీరప్రాంత పట్టణం ధుబాబ్, దాని సమీపంలోని విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. యెమెన్ ప్రభుత్వం సైనిక చర్య గురించి ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. హౌతీలను నిర్మూలించే వరకు యెమెన్ ప్రభుత్వ బలగాలకు పూర్తి కార్యాచరణ మద్దతు ఇస్తామని ప్రకటించింది. సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు సౌదీ అరేబియాకు ఉందని అన్నారు.
ఇటీవల హౌతీలు సౌదీ రాజధాని రియాద్‌లోని ప్రఖ్యాత అరామ్కో చమురు కేంద్రంపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల వల్ల అరామ్కో చమురు కేంద్రంలో మంటలు చెలరేగాయి. మరోవైపు, హౌతీల దాడులకు యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు దీటుగా బదులు ఇచ్చాయి. హౌతీల బలగాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లు, శతఘ్నులు, క్షిపణులతో దాడులు చేశాయి. ఈ ఆపరేషన్‌లో సుమారు 260 మంది హౌతీ ఫైటర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. 44 సైనిక వాహనాలను ధ్వంసం చేశాయి. ఇదిలా ఉండగా సనా, సాదా, తైజ్, హజ్జా, అమ్రాన్, ఇబ్ తదితర ప్రాంతాల్లోని పౌరులపై సౌదీ దాడులు చేసిందని, దీంతో అనేక మంది మరణించారని హూతీల అధికార ప్రతినిధి ప్రకటించారు. పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సౌదీ మొత్తం 1,350 సార్లు వైమానిక దాడులకు పాల్పడినట్లు తెలిపారు.
హౌతీల విజృంభణతో సౌదీ అరేబియా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా నిలిచిచేందకు పాకిస్థాన్, టర్కీ సిద్ధమయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో మక్కా రక్షణ కూటమికి చెందిన వ్యూహాత్మక రాజకీయ, రక్షణ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. సౌదీ ఎదుర్కొంటున్న భద్రతా ముప్పులు, ఇటీవలి దాడులపై ఇందులో చర్చించారు. పాకిస్థాన్ తరఫున ఉప ప్రధాని ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కీలక నిర్ణయాలను వెల్లడించారు. కూటమి కింద చేసుకున్న సామూహిక రక్షణ హామీలను వెంటనే అమలు చేయాలని నిర్ణయించారు. సైనిక బలగాలు, ఇతర రక్షణ సామర్థ్యాలను సౌదీకి వేగంగా తరలించే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఎంతమంది సైనికులను పంపుతారు, ఎప్పటి నుంచి మోహరింపు మొదలవుతుంది అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
దాదాపు రెండు దశాబ్దాలుగా యెమెన్ తీవ్ర అంతర్యుద్ధంతో రగులుతోంది. 2011లో 'అరబ్ స్ప్రింగ్' ఉద్యమంతో తిరుగుబాటు మొదలైంది. ఆధునిక యెమెన్ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ నేతగా అలీ అబ్దుల్లా సలేహ్ గుర్తింపు పొందారు. 1978 నుంచి 1990 వరకు ఉత్తర యెమెన్ అధ్యక్షుడిగా.. ఆ తర్వాత 2012లో రాజీనామా చేసే వరకు ఉమ్మడి యెమెన్ మొదటి అధ్యక్షుడిగా సేవలందించారు. ఉత్తర, దక్షిణ యెమెన్లను విలీనం చేసి 'రిపబ్లిక్ ఆఫ్ యెమెన్' ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించారు. సనా రాజధానిగా, అడెన్ ఆర్థిక రాజధానిగా ఏర్పడిన యెమెన్ రిపబ్లిక్కు మొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1994లో జరిగిన అంతర్యుద్ధంలో దక్షిణ ప్రాంత వేర్పాటువాదుల ప్రయత్నాన్ని తిప్పికొట్టి, సనా కేంద్రంగా తన కేంద్రీకృత అధికారాన్ని బలపరుచుకున్నారు.అయితే సలేహ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తగా 2012 లో ఉపాధ్యక్షుడు అబ్దుల్ మన్సూర్ హాదీకి అధికారాన్ని బదిలీ చేసి పదవి నుంచి తప్పుకున్నారు.
యెమెన్ ఏర్పడిన రాజకీయ అస్థిరతను ఆసరాగా చేసుకుని ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు పుంజుకున్నారు. కాగా 2014–2015 మధ్య అనూహ్యంగా హౌతీలతో అలీ అబ్దుల్లా సలేహ్‌తో వ్యూహాత్మక పొత్తు కుదిరింది. అయితే హౌతీలు సనా నగరాన్ని స్వాధీనం చేసుకొని అబ్దుల్ మన్సూర్ హాదీని అధికారంలోంచి దింపేశారు. దీంతో ఆయన సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకున్నారు. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి.. యెమెన్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి, దక్షిణ సరిహద్దులో ఇరాన్ ప్రభావాన్ని నిరోధించడానికి 2015 మార్చిలో వైమానిక, భూతల దాడులను ప్రారంభించింది. దీంతో ఆగ్రహించిన హౌతీలు.. 2017లో సనాలోని సలేహ్ ఇంటిని చుట్టుముట్టి హతమార్చాయి. కాగా హౌతీలు, యెమెన్ ప్రభుత్వం మధ్య ప్రత్యక్ష పోరాటంతో పాటు వ్యాధులు, ఆకలి కారణంగా 3,77,000 మందికి పైగా మరణించారు. మరో 45 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులుగా మిగిలిపోయారు.




