Burning Topic: యుద్ధం సెగకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం

Burning Topic: పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు చర్చించాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Oct 2026 10:05 AM IST
Burning Topic
X

Burning Topic: యుద్ధం సెగకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం 

Burning Topic: ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం మిగతా దేశాలపై పడటం సహజం. ముఖ్యంగా ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్యం నిలిచిపోవడం, చమురు క్షేత్రాలపై దాడుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. హర్ముజ్ ద్వారా వాణిజ్య రవాణా 95% పైగా నిలిచిపోవడంతో, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు కేవలం వారం రోజుల్లోనే 50% పైగా పెరిగి బ్యారెల్‌కు 116 నుండి 120 డాలర్ల మార్కుకు చేరాయి.

ఖతార్‌లోని అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ పాక్షికంగా దెబ్బతినడంతో యూరోప్ దేశాలలో గ్యాస్ ధరలు దాదాపు 50% పైగా పెరిగాయి. పశ్చిమాసియా వైమానిక మార్గాలు, సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 1,000% పైగా పెరిగాయి. ఫిబ్రవరి 2026 నుండి ఇప్పటివరకు 52,000 కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.. ఇవన్నీ కూడా అంతర్జాతీయ మర్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.

ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం ఎనిమిదో నెలలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. చమురు సరఫరాకు అంతరాయం, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, దేశాలపై పేరుకుపోతున్న అప్పులు.. ఇవన్నీ కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. చమురు, రవాణా ఖర్చులు పెరగడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం 5.2% కి, ధనిక దేశాల్లో 2.9% కి పెరిగింది.

ప్రపంచ దేశాల షేర్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. పెట్టుబడిదారులు తమ ఈక్విటీలను ఉపసంహరించుకుని అమెరికన్ డాలర్ వైపు మొగ్గు చూపుతుండటంతో ఇతర దేశాల కరెన్సీల విలువ బలహీనపడుతోంది.ఈ పరిణామాల మధ్య థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో అక్టోబర్‌ 12 నుంచి 18 వరకు జరగనున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలు కీలకంగా మారాయి.

పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా దేశాలపై పెరుగుతున్న భారీ ప్రజా అప్పుల భారం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉపాధి అవకాశాలు, అలాగే ప్రైవేట్ పెట్టుబడుల సమీకరణ వంటి కీలక అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సదస్సులో ప్రపంచంలోని 191 దేశాల నుండి సుమారు 15,000 మంది ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు, ఆర్థిక నిపుణులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

థాయ్‌లాండ్ ఈ ప్రతిష్టాత్మక వార్షిక సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండవసారి. గతంలో 1991లో బ్యాంకాక్‌లో ఈ సమావేశాలు జరిగాయి. నియమావళి ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి వాషింగ్టన్ వెలుపల ఒక సభ్య దేశంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది సదస్సును "థాయ్‌లాండ్స్ న్యూ హారిజన్స్: ఎంపవరింగ్ పీపుల్ అండ్ బిల్డింగ్ రెసిలియన్స్ అనే ప్రధాన నినాదంతో నిర్వహిస్తున్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేధిస్తున్న ప్రధాన సమస్య పెరుగుతున్న రుణభారం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయికి వివిధ దేశాల ప్రభుత్వ రుణాలు చేరాయని ఐఎంఎఫ్‌ అంచనా వేస్తోంది. 2030కు ముందే ప్రపంచ ప్రభుత్వ రుణాలు మొత్తం స్థూల దేశీయోత్పత్తి లో 100 శాతాన్ని మించవచ్చని హెచ్చరిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ రుణభారం అధికంగానే ఉన్నా, అభివృద్ధి చెందుతున్న, అల్పాదాయ దేశాలకు పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయి.

మరోవైపు, కొత్త రుణాలు తీసుకోవాలన్నా, పాత అప్పులను తిరిగి చెల్లించాలన్నా అధిక వడ్డీలు భరించాల్సి వస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వ ఆదాయంలో సగటున 10 శాతానికి మించి వడ్డీ చెల్లింపులకే ఖర్చవుతోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతుల కోసం వెచ్చించాల్సిన నిధులపై ఒత్తిడి పెరుగుతోంది.

ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు ఐఎంఎఫ్‌ రుణాలు కీలకంగా ఉంటాయి. రుణాలు మంజూరు చేసేందుకు విధించే షరతులు మరింత కఠినంగా మారవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ సంఖ్యలోనే సంస్కరణలను సూచించినా, ఐఎంఎఫ్‌ విధించే షరతులు ప్రభుత్వ వ్యయాల కోత, పన్నుల పెంపు వంటి చర్యలకు దారితీయవచ్చని రుణాలపై పరిశోధన చేస్తున్న నిపుణులు చెబుతున్నారు.

ఇంధన ధరల పెరుగుదలతోపాటు ఎరువుల ధరలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల వ్యయం పెరిగితే ఆహార ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ ఏడాది బలమైన ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంధన ధరలు, ఎరువుల ధరలు, రుణభారం, వాతావరణ సంబంధిత ముప్పులు ఒకేసారి ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు.

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ మీద పడుతోంది. మన దేశానికి అవసరమైన ముడిచమురులో ఎక్కువ భాగం దిగుమతులపైనే ఆధారపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు భారమవుతుంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు కూడా పెరగవచ్చు. యుద్ధం మరి కొంత కాలం కొనసాగి ఇంధన సరఫరాకు అంతరాయం కొనసాగితే భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ప్రతికూలంగా మారితే వ్యవసాయ ఉత్పత్తిపై అదనపు ఒత్తిడి ఏర్పడవచ్చు. అప్పుడు ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న యుద్ధం, అప్పులు, ద్రవ్యోల్బణం.. చివరకు సామాన్యుడి కుటుంబ బడ్జెట్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తాయన్నది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

బ్యాంకాక్‌‌లో జరుగుతున్న ఐఎంఎఫ్‌-ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. యుద్ధం కారణంగా ఏర్పడుతున్న సమస్యల కారణంగా అధిక వడ్డీ రేట్లు, రుణ చెల్లింపులు ప్రభుత్వాల ఆర్థిక స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయి.

పేద దేశాలకు అవసరమైన ఆర్థిక సాయం అందించడం, అప్పుల భారాన్ని తగ్గించడం, ధరల పెరుగుదలను నియంత్రించడం అంతర్జాతీయ సంస్థలకు కీలక పరీక్షగా మారాయి. ఈ నేపథ్యంలో బ్యాంకాక్‌ సమావేశాలు కేవలం ఆర్థిక చర్చలకే పరిమితం కావని చెబుతున్నారు. యుద్ధాలు, ఇంధన సంక్షోభాలు, వాతావరణ మార్పులు పరస్పరం ప్రభావితం చేస్తున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఎలా స్థిరంగా ఉంచాలన్న దానిపై దేశాలు దృష్టి సారించనున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్