Off The Record: రజినీపై జగన్ కీలక బాధ్యతలు!

Off The Record: విజయసాయి నిష్క్రమణ, మిథున్ రెడ్డి కేసులతో ఢిల్లీలో వైసీపీకి లాబీయింగ్ శూన్యం ఏర్పడింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Oct 2026 8:09 AM IST
Off The Record
X

Off The Record: రజినీపై జగన్ కీలక బాధ్యతలు!

Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఢిల్లీ పెద్దల వద్ద వైసీపీకి అత్యంత శక్తివంతమైన ప్రతినిధులుగా ఇద్దరు నేతలు కనిపించేవారు. ఒకరు అప్పటి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, మరొకరు లోక్‌సభలో పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన మిథున్ రెడ్డి. ఢిల్లీ వీధుల్లో వైసీపీ లాబీయింగ్, కమ్యూనికేషన్, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు.. అన్నీ వీరిద్దరి చుట్టూనే తిరిగేవి. కానీ కాలం మారింది.. రాజకీయ సమీకరణాలూ మారాయి.

విజయసాయిరెడ్డి 2025లో ఊహించని విధంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, వైసీపీకి దూరమయ్యారు. తాను ఏ ఇతర పార్టీలో చేరడం లేదని స్పష్టం చేసిన ఆయన, 2026లో కొత్త రాజకీయ పార్టీ స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు, లోక్‌సభలో పార్టీకి ప్రధాన ఫేస్‌గా ఉన్న మిథున్ రెడ్డి చుట్టూ లిక్కర్ స్కామ్ విచారణలు, అరెస్ట్‌లు, బెయిల్ వంటి న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టాయి. ఫలితంగా ఆయన కూడా ఢిల్లీ రాజకీయ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిణామాలతో ఇప్పుడు ఢిల్లీ పీఠంపై వైసీపీకి నమ్మకమైన, సమర్థవంతమైన రాజకీయ లాబీయిస్ట్ ఎవరు..? అన్న ప్రశ్న ఆ పార్టీ అధినేత జగన్‌‌కు ఎదురవుతోంది. దీంతోపాటు ఢిల్లీ వేదికగా మరో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. జగన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారా..? అన్న చర్చ కూడా రీసౌండ్ చేస్తోంది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. శాసనసభతోపాటు పార్లమెంటులోనూ సంఖ్యాబలం తగ్గడంతో కేంద్ర స్థాయిలో పటిష్టమైన లాబీయింగ్ అవసరమైందన్న వాదన బలంగానే ఉంది.

ఇలాంటి సమయంలో అధికారంలో ఉన్న లేదా విపక్షంలో ఉన్న ఏ ఒక్క పార్టీకో పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన పార్టీలతో కమ్యూనికేషన్ ఛానెల్స్ ఓపెన్‌గా ఉంచుకోవడం జగన్‌కు రాజకీయ అవసరంగా మారిందని రాజకీయ విశ్లేషకుల టాక్. ఇది కేవలం భవిష్యత్తు కోసం వేసుకుంటున్న రాజకీయ లెక్క మాత్రమే తప్ప, కాంగ్రెస్-వైసీపీ పొత్తుకు సంకేతం కాదని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరిగ్గా ఈ శూన్యంలోకే ఒక పేరు బలంగా వినబడుతోంది. అదే వైసీపీ సీనియర్ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి విడదల రజిని.

వైసీపీలో ప్రస్తుతం మీడియా ముందు గట్టిగా నిలబడి, ప్రత్యర్థుల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగల కొద్దిమంది నేతల్లో విడదల రజిని ఒకరు. ఆమెలో ప్రధానంగా మూడు బలమైన అంశాలు కలసివస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. వాటిలో మొదటిది మంచి వాక్చాతుర్యం, రెండు రాజకీయ దూకుడు, మూడోది మీడియా విజిబిలిటీ అంటే ఎల్లప్పుడూ వార్తల్లో ఉండే ఆకర్షణ. అదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. రజిని ముందుండి పోరాడుతున్నారనే భావన కేడర్‌లో బలపడింది.

అయితే, జగన్ ఇప్పటివరకు ఆమెకు "ఢిల్లీ కోఆర్డినేటర్" అనో లేదా "జాతీయ వ్యవహారాల అధికారిక ప్రతినిధి" అనో బాధ్యతలు అప్పగిస్తూ అధికారిక ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. కానీ, విజయసాయిరెడ్డి వదిలేసిన స్థానంలో.. పార్టీ తరఫున జాతీయ స్థాయిలో మాట్లాడే సామర్థ్యం ఉన్న మహిళా నేతగా రజినికి ప్రాధాన్యం పెరుగుతోందనేది రాజకీయ పరిశీలకుల్లో వినిపిస్తున్న టాక్.

ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన ఉద్రిక్త పరిణామాలు.. విడదల రజినీ రాజకీయ గ్రాఫ్‌ను ఒక్కసారిగా మార్చేశాయి. పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నంలో జరిగిన తోపులాటలో రజిని కిందపడిపోయిన ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన కేవలం తెలుగు మీడియాకే పరిమితం కాలేదు. జాతీయ మీడియా నెట్‌వర్క్‌లు, హిందీ, ఇంగ్లీష్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలా ఈ ఘటన వైసీపీకి రాజకీయంగా రెండు రకాలుగా కలసివచ్చిందంటున్నారు.

ఒక మాజీ మహిళా మంత్రి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని చెప్పడం ద్వారా వైసీపీ సానుభూతిని పొందడం. అలాగే కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని జాతీయ వేదికపై ప్రచారం చేయడం. ఈ ఒక్క సంఘటనతో రజిని పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇది ఆమె పొలిటికల్ మైలేజీకి పెద్ద ఎత్తున తోడ్పడిందనడంలో సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అయితే ఇక్కడ మరో ప్రశ్న అందరి మదిని తొలుస్తోంది. అదే రజిని ఛరిస్మా.. జగన్ అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవుతుందా? అని. అయితే.. మీడియా అటెన్షన్ తెచ్చుకోవడం, వివాదాస్పద అంశాలపై స్పందించడం వరకు అంతా బాగానే ఉంది. కానీ.. విడదల రజని పొలిటికల్ గ్రాఫ్ కూడా అంత గొప్పగా లేదని చెప్పొచ్చు. 2024 ఎన్నికల ముంగిట అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. చిలకలూరిపేటను వదిలిని ఆమె.. గుంటూరు పశ్చిమ బరిలోకి దిగారు.

కూటమి సునామీలో.. రజినీ ఛరిస్మా చిలకలూరిపేటలోనూ పని చేయలేదు. గుంటూరు పశ్చిమలోనూ ఫలించలేదు. ఓటమి తెచ్చిన షాక్‌ నుంచి ఆమె ఇంకా కోలుకోలేకపోతున్నారన్న టాక్ లేకపోలేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూటమి తరఫున అన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంట గెలవని ఆమె.. ఢిల్లీలో ఎలా నెగ్గుకురాగలదన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది.

అయినా.. రాష్ట్ర స్థాయి ప్రజాదరణను, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే వ్యూహాత్మక రాజకీయ ప్రభావంగా మార్చడం సాధారణ విషయం కాదన్న అభిప్రాయం లేకపోలేదు. కానీ.. ప్రస్తుతం పునర్వ్యవస్థీకరణ దశలో ఉన్న వైసీపీకి.. విడదల రజినీ వంటి దూకుడు స్వభావం గల నాయకురాలిని ఢిల్లీ ఫేస్‌గా మార్చడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయం కూడా వినిపడుతోంది. ఈ వ్యూహం.. జగన్‌కు అనుకున్న పొలిటికల్ మైలేజీ తెస్తుందా..? చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్