Burning Topic: ఎఫ్ - 1 వీసాలపై 70 వేల డాలర్ల ఫీజు భారం!

Burning Topic: భారత ఐటీ దిగ్గజాలకు అమెరికా షాక్. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ సహా 8 సంస్థల పర్మ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ సస్పెండ్. జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Oct 2026 7:40 AM IST
Burning Topic
X

Burning Topic: ఎఫ్ - 1 వీసాలపై 70 వేల డాలర్ల ఫీజు భారం!

Burning Topic: భారతీయుల డాలర్ డ్రీమ్ చెదిరిపోతున్నాయి. అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగాలపై మోజు పెంచుకున్న యువతీ యువకులకు వీసాలు అందని మానిపండులా మారుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి వలసల నియంత్రణ, స్థానికులకే అవకాశాల పేరుతో తీసుకుంటున్న చర్యలు మన పిల్లలకు కంటి మీద నిద్రను కరువు చేస్తున్నాయి. తాజాగా ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థలకు భారీ షాక్‌ తగిలింది. అంతర్జాతీయంగా పేరొందిన ఎనిమిది భారతీయ ఐటీ కంపెనీల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, టాటా, విప్రో, క్యాప్‌జెమినీ, హెచ్‌సీఎల్‌, కాగ్నిజెంట్‌, అడోబ్‌ కంపెనీలు ఉన్నాయి. ఇవి వీసా నిబంధన నిబంధనలను దుర్వినియోగం చేస్తూ అమెరికన్ల ఉపాధి, ఉద్యోగవకాశాలను లాగేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కంపెనీలకు గ్రీన్ కార్డు కోసం స్పాన్సర్ చేసే అవకాశం లేకుండా పోతోంది.

అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హెచ్-1బీ వీసాలపై ఉంటూ.. శాశ్వత నివాస హోదా కోసం కంపెనీల స్పాన్సర్‌షిప్‌లపై ఆధారపడే భారతీయ వృత్తి నిపుణులకు ఇది భారీ ఎదురుదెబ్బ. ప్రస్తుతం హైచ్-1బీ వీసా రద్దు కాకపోయినా.. వారి గ్రీన్ కార్డు అవకాశాలకు ఆటంకం ఏర్పడుతుంది. శాశ్వత నివాస అవకాశాలు లేకపోతే విదేశీ ప్రతిభావంతుల్ని నియమించుకోవడం కంపెనీలకు కష్టతరమవుతుంది. సస్పెండ్ చేసిన ఈ కంపెనీల నుంచి వచ్చే పర్మ్ దరఖాస్తులను స్వీకరించబోమని, అలాగే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వాటి పరిశీలన కూడా తక్షణమే నిలిపివేస్తున్నట్టు అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. హెచ్‌-1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, . అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్‌ సోండర్లింగ్‌ వెల్లడించారు. హెచ్​1బీ వీసాలపై నియమించుకునే విదేశీ ఉద్యోగులను విదేశీ ఒప్పంద పనివాళ్లుగా, ఆ ప్రోగ్రాంను ఉపయోగించుకునే కంపెనీలను 'వీసా మిల్లులు'గా వాన్స్ అభివర్ణించారు.

అమెరికన్లతో భర్తీ చేయలని ఉద్యోగాల కోసం, ప్రతిభావంతులను తీసుకొచ్చేందుకు సంస్థలను అనుమతించడమే హెచ్‌-1బీ వీసా ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం. దురదృష్టవశాత్తు, గత కొన్నేళ్లుగా బహుశా కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రోగ్రాంలో మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని జేడీ వాన్స్ ఆరోపించారు. మైక్రోసాఫ్ట్ గతేడాది 6,000 మంది అమెరికన్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించింది. అదే సమయంలో, ఆ కంపెనీ 6,300 హెచ్‌-1బీ వీసాలు, దాదాపు 3వేల గ్రీన్ కార్డ్‌ల ద్వారా లబ్ది పొందింది. మరో మాటలో చెప్పాలంటే, మైక్రోసాఫ్ట్ తొలగించిన ప్రతి ఉద్యోగి స్థానంలో, ఒకటిన్నర విదేశీ వెట్టి కార్మికులను భర్తీ చేసింది. ఇది చాలా కాలంగా ఈ దేశంలో మనం అనుమతిస్తున్న ఒక అపఖ్యాతి పాలైన వ్యవస్థ. మనం ఇప్పుడు దీనిని ఆపబోతున్నాం. మైక్రోసాఫ్ట్‌కు పర్మ్ ప్రోగ్రామ్‌ను నిలిపివేయాలని మేం నిర్ణయించాం. అంటే వారు ఇకపై హెచ్‌-1బీ వీసాలను తీసుకొని, అమెరికాలో శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేయలేరు అని వివరించారు వాన్స్

యేల్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, కాలెక్ సహా మొత్తం 9 ప్రధాన విశ్వవిద్యాలయాలు రీసెర్చ్ స్కాలర్ల కోసం జే-1 వీసా ప్రోగ్రాం ఉపయోగించుకున్న తీరుపైనా దర్యాప్తునకు జేడీ వాన్స్ ఆదేశించారు. ఈ విశ్వవిద్యాలయాల్లో ఏదో వింతగా జరుగుతోందని, జే-1 వీసాలను అవి మరీ ఎక్కువగా వాడుకుంటున్నాయని చెప్పారు. అమెరికా గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పరిశోధకుల వేతనాలకు గండికొట్టేందుకు వాటిని దుర్వినియోగం చేస్తున్నాయని జేడీ వాన్స్ పేర్కొన్నారు. పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ విధానాన్ని వేగవంతమైన లేబర్ సర్టిఫికేషన్ కోసం 2005లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ యంత్రాంగం తీసుకొచ్చింది. దీని ద్వారా అమెరికా సంస్థలు విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ కోసం స్పాన్సర్ చేయవచ్చు. అయితే, ఏదైనా ఒక ఉద్యోగానికి అర్హులైన అమెరికన్లు అందుబాటులో లేరని, విదేశీ కార్మికులను నియమించుకోవడం వల్ల స్థానిక ఉద్యోగుల వేతనాలపై ప్రతికూల ప్రభావం పడదని అమెరికా కార్మిక శాఖ ధ్రువీకరించాల్సి ఉంటుంది.

కాగా భారత ప్రభుత్వం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆయన అనవసరంగా మాట్లాడారని, నిపుణుల తరలింపుతో ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతోందని స్పష్టంగా చేసింది. నిపుణుల తరలింపు.. భారతీయులకు అవకాశాలు కల్పించడంతో పాటు అమెరికా కంపెనీల సంపదను కూడా పెంచుతోంది. ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగకల్పన వంటి విషయాల్లో కంపెనీలకు అత్యాధునిక ప్రతిభ ఎంతో సహాయకారిగా ఉంది. ఇది ఇరుదేశాలకు ప్రయోజనకరమే. ఈ ప్రక్రియలో భాగమైన ప్రతిఒక్కరూ ఈ వాస్తవాన్ని అంగీకరిస్తారని భావిస్తున్నాం. అమెరికా ఆంక్షలు ఇరు దేశాల ఆకాంక్షలకు, భాగస్వామ్యానికి ఏమాత్రం దోహదపడవు. తరతరాల వలసదారుల శ్రమ, కృషి, ఆవిష్కరణలు అమెరికా అభివృద్ధి, శ్రేయస్సుకు దోహదపడ్డాయి. ఆ దేశ చరిత్రను తీర్చిదిద్దాయి. సామ్రాజ్యవాద భావనలు కలిగి ఉన్న పదజాలాన్ని ఉపయోగించడం తీవ్ర అభ్యంతరకరమని విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది

ఇక అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి, అక్కడే కొంతకాలం ఉద్యోగానుభవం సంపాదించి, ప్రతిభకు తగిన అవకాశాలు అందుకోవాలన్నది వేలాదిమంది భారతీయ విద్యార్థుల కల. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, డాటా సైన్స్‌, ఏఐ, బయోటెక్నాలజీ వంటి ‘స్టెమ్‌’ కోర్సుల కోసం అమెరికా విశ్వవిద్యాలయాల వైపు భారతీయుల ప్రవాహం కొన్నేండ్లుగా సాగుతోంది. కాగా ఉన్నత చదువులు చదువుకుంటూనే ఖర్చుల కోసం ఏదైనా ఉద్యోగం చేసుకోవాలన్నది విదేశీ విద్యార్థుల ఆకాంక్ష. అయితే యూనివర్సిటీ బయట ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి ఉండదు. అయితే విదేశీ విద్యార్థులకు పనులు చేసుకొనే అవకాశం కల్పిస్తూనే, వారి నుంచి రుసుము వసూలు చేయాలని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం భావిస్తోంది. చదువుకుంటూనే పని చేసుకోవచ్చు. కానీ, ప్రభుత్వానికి 70,000 డాలర్ల రుసుమును వారిని చేర్చుకున్న విద్యాసంస్థలే చెల్లించాల్సి ఉంటుంది.

ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ అని పిలిచే కార్యక్రమంలో పాల్గొనే ప్రతి విద్యార్థికి సంబంధిత విద్యా సంస్థలే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా విదేశీ విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నప్పుడు లేదా ఆ తర్వాత తమ ప్రధాన సబ్జెక్టుకు సంబంధించిన ఉద్యోగాల్లో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. అయితే విదేశీ విద్యార్థులకు ఓపీటీ ఫీజు పెద్ద అడ్డంకిగా మారుతోంది. ఈ 70 వేల డాలర్లకు తోడుగా ఆప్షన్‌ పొడిగింపులకు మరో 30 వేల డాలర్లు వెరసి మొత్తం ఫీజు లక్ష డాలర్లకు చేరుకుంటుంది. అంటే మన కరెన్సీలో కొంచెం అటూఇటూగా రూ.కోటి పైనే ఉంటుం ది. కాగితాలపై ఈ భారాన్ని విద్యార్థిపై కాకుండా విశ్వవిద్యాలయంపై మోపుతున్నామని అమెరికా ప్రభుత్వం చెప్తున్నా, అసలు భారం చివరికి విద్యార్థులపైనే పడుతుందని చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి అమెరికా వీసా అందని పండుగా మారుతుంటే డాలర్‌ కల చెదిరిపోతున్నది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్