BURNING TOPIC: ట్రంప్‌కు అగ్నిపరీక్ష.. అమెరికా ఎన్నికల్లో ఏం జరగబోతోంది?
BURNING TOPIC: అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ ప్రారంభం. కాంగ్రెస్‌తో పాటు గవర్నర్ పదవులకు తీవ్ర పోటీ. డోనాల్డ్ ట్రంప్ పాలనకు ఈ ఎన్నికలు కీలక పరీక్ష.
BURNING TOPIC: ట్రంప్‌కు అగ్నిపరీక్ష.. అమెరికా ఎన్నికల్లో ఏం జరగబోతోంది?
BURNING TOPIC: అగ్రరాజ్యంలో మధ్యంతర ఎన్నికల తేదీ రానే వచ్చింది.. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 35 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. వీటితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్ర చట్టసభ సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 21 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటేసేందుకు తరలి వచ్చారు. న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా, మైన్, కెంటకీ, వెర్మాంట్, న్యూహ్యాంప్‌షైర్, ఇండియానా, కనెక్టికట్ తదితర రాష్ట్రాల్లో తొలి గంటల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్ సమయం ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు అమెరికన్లకు మాత్రమే కాదు, ప్రపంచమంతా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మధ్యంతరంలో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లు పట్టు నిలపుకుంటారా? డెమోక్రాట్లు ఆధిక్యత సాధిస్తారా అనే చర్చ జరుగుతోంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనకు, కాంగ్రెస్‌పై ఆధిపత్యానికి ఈ ఎన్నికలు కీలక పరీక్షగా మారాయి. ద్రవ్యోల్బణ భయాలు, ఇరాన్‌తో యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల కన్నా, డెమోక్రాట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అత్యధిక సర్వేలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. మెజారిటీ సర్వేలు డెమోక్రాట్లకే మొగ్గుందని తేల్చాయి. ఓటర్లలో డెమోక్రాట్లకు 44శాతం మంది, రిపబ్లికన్లకు 36 శాతం మంది మద్దతిస్తున్నారు. రెండు సభల్లోనూ డెమోక్రాట్లు ఆధిక్యం సాధించే అవకాశముందని సర్వేలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల ఆధిక్యం సాధిస్తే.. ట్రంప్‌నకు మిగిలిన రెండేళ్లు గడ్డుకాలంగా మారుతుంది. అదే రిపబ్లికన్లు ఆధిక్యం సాధిస్తే ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశముంది. రెండు సభల్లో కనీసం ఒకదాంట్లోనైనా ఆధిక్యం సాధిస్తే ట్రంప్ నిర్ణయాలను అడ్డుకోవచ్చని డెమోక్రాట్లు భావిస్తున్నారు.
మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిచి రిపబ్లికన్లు ఓడిపోయినా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి వచ్చిన ముప్పేమీ లేదు. అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభలు జాతీయ చట్టాలను చేస్తాయి. ప్రభుత్వ వ్యయాలకు ఆమోదం తెలుపుతాయి. అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలను సమీక్షిస్తాయి. రిపబ్లికన్ల ఆధిపత్యమున్న సెనెట్ ఆమోదించిన బిల్లును డెమోక్రాట్ల ఆధిపత్యమున్న ప్రతినిధుల సభ అడ్డుకోవచ్చు. అలాగే రిపబ్లికన్ల ఆధిపత్యమున్న సభ ఆమోదించిన బిల్లును డెమోక్రాట్లు ఆధిపత్యముండే సెనెట్ అడ్డుకోవచ్చు. ఒకవేళ డెమొక్రాట్లు కాంగ్రెస్‌ను కైవసం చేసుకుంటే, తాను "మిస్టర్ వీటో"గా మారి వారు పంపే ప్రతి బిల్లును తిరస్కరిస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వారు అలసిపోయి తనతో చర్చలకు వచ్చేలా చేస్తానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
డెమోక్రాట్లు కమ్యూనిస్టులు, తీవ్రవాదులు అంటూ తన చివరి ఎన్నికల ర్యాలీలో విరుచుకుపడ్డారు. దేశాన్ని రక్షించుకోవడానికి రిపబ్లికన్లకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు ట్రంప్.
అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్‌కు ముందే దాదాపు ఐదు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కీలక సెనేట్ పోటీలు జరుగుతున్న రాష్ట్రాల్లో గత మధ్యంతర ఎన్నికలతో పోలిస్తే ముందస్తు ఓటింగ్ పెరిగింది. ఈసారి ఎన్నికల్లో భారీగా ఓటర్లు పాల్గొనే అవకాశం ఉందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. కాగా సరిగ్గా పోలింగ్‌కు ముందు అమెరికా సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి షాక్ ఇచ్చింది. కాలిఫోర్నియాలోని 20 వేల మెయిల్-ఇన్ బ్యాలెట్లను పక్కన పెట్టాలంటూ చేసిన అత్యవసర విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఈ బ్యాలెట్లు పౌరసత్వం లేనివారికి జారీ అయ్యాయని న్యాయశాఖ ఆరోపించింది. అయితే దిగువ కోర్టులు ఇప్పటికే ఈ వాదనను తిరస్కరించాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఎలాంటి భిన్నాభిప్రాయం నమోదు కాకుండానే ప్రభుత్వ విజ్ఞప్తిని కొట్టివేసింది. అమెరికా చరిత్రలోనే ప్రస్తుతం జరుగుతున్న మధ్యంతర ఎన్నికలు ఖరీదైనవిగా నిలుస్తున్నాయి. రాజకీయ ప్రకటనలకే 11.6 బిలియన్ డాలర్లను పార్టీలు ఖర్చు చేశాయి.
కాగా అమెరికా ఓటర్లకు ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య రంగం, వలసలు, విదేశాంగ విధానం ప్రధాన సమస్యలుగా మారాయి. ఓటర్లలో 84 శాతం మంది ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగం, అద్దెలు, కిరాణా సరుకులు, పెట్రోల్ ధరలు తమకు ముఖ్యమైన అంశమని 68 శాతం మంది తెలిపారు. వలసలు ప్రధాన సమస్యగా 59 శాతం మంది పేర్కొనగా.. విదేశాంగ విధానానికి 57 శాతం మంది ప్రాధాన్యమిచ్చారు. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అక్కడి ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా భారతీయ వ్యాపారాలు, ఉద్యోగులు, వలసదారులపై ఈ ప్రభావం ఉండవచ్చు.డెమోక్రాట్లు విజయం సాధిస్తే వీసాలు, ఇతర వలస అంశాల్లో భారతీయులకు కొంత ఉపశమనం లభించే అవకాశముంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ డెమోక్రాట్లు సమర్థించకపోవచ్చు. దీంతో ఆయన విధానాల అమలుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతివారు భారీగా బరిలోకి దిగారు. గవర్నర్ నుంచి సెనేటర్దాకా, కౌన్సిల్ సభ్యుల నుంచి మేయర్లదాకా పలుచోట్ల పోటీపడుతున్నారు. ఒహాయో గవర్నర్ బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున వివేక్ రామస్వామి ఉన్నారు. ఆయన డెమోక్రటిక్ పార్టీకి చెందిన అమీ ఆక్టోతో పోటీపడుతున్నారు. రామస్వామి గెలిస్తే.. బాబీ జిందాల్ , నిక్కీ హేలీ తర్వాత మూడో భారత సంతతి గవర్నర్‌గా నిలుస్తారు.
అమెరికా కాంగ్రెస్ సిటింగ్ సభ్యులు రో ఖన్నా, అమీ బెరా, ప్రమీలా జయపాల్, సుహాస్ సుబ్రమణ్యం డెమోక్రాట్ పార్టీ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు.
రో ఖన్నాపై భారత సంతతికి చెందిన రితేశ్ ఠాండన్ పోటీ చేస్తున్నారు. జయపాల్.. గుజరాత్లో జన్మించిన నీరవ్ సేథ్తో పోటీపడుతున్నారు.
అరుణా మిల్లర్.. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తిరిగి ఎన్నికయ్యేందుకు పోటీ పడుతున్నారు. లాస్ ఏంజెలెస్ మేయర్ పదవికి నిత్యా రామన్ పోటీపడుతున్నారు. ఫ్లోరిడాలో పియా దాండియా.. ఆరిజోనా నుంచి అమీష్ షా తలపడుతున్నారు.




