Burning Topic: ఎన్నికల తర్వాత మళ్ళీ ఇరాన్ అమెరికా యుద్ధం!
Burning Topic: పశ్చిమాసియాలో శాంతి చర్చలు వేగవంతం! హర్మూజ్ జలసంధి తెరవడానికి ఇరాన్ ప్రతిపాదన. డోనాల్డ్ ట్రంప్, మొజ్తబా ఖమేనీ హెచ్చరికలతో ఉద్రిక్తతలు.
Burning Topic: ఎన్నికల తర్వాత మళ్ళీ ఇరాన్ అమెరికా యుద్ధం!
Burning Topic: పశ్చిమాసియాలో అనిశ్చితికి తెర పడుతుందా? అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గు ముఖం పడతాయా? ప్రస్తుతం ప్రపంచ ముందున్న ప్రధానమైన ప్రశ్నలు ఇవే. ప్రస్తుతం గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన శాంతి చర్చలు ముమ్మరమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన ఆకస్మిక దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధం ప్రస్తుతం కీలక మలుపు తిరిగింది. తాజా పరిణామాల ప్రకారం ఖతార్, పాకిస్థాన్ వంటి మధ్యవర్తిత్వ దేశాల ద్వారా ఇరుపక్షాల మధ్య ప్రాథమిక శాంతి ఒప్పంద నివేదిక సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.ఖతార్ రాజధాని దోహాలో ఇరాన్ ప్రతినిధుల బృందం మధ్యవర్తులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ పంపిన ప్రతిపాదనల లేఖను ఇరాన్ పరిశీలించింది. అమెరికా తన వైఖరిని, స్వరాన్ని మార్చుకుందని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ మోహ్సేన్ రెజాయ్ సానుకూలంగా స్పందించారు.
తాజా సమాచారం ప్రకారంఅమెరికా తమ షరతులను అమలు చేస్తే రెండు రోజుల్లోగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలనే ప్రతిపాదనపై మధ్యవర్తులతో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ తెలిపింది. ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని తిరిగి తెరవడానికి ప్రతిపాదించిన అమలు కాలాన్ని ఐదు రోజుల నుంచి రెండు రోజులకు తగ్గించడానికి ఖతార్‌తో చర్చలు ఫలిస్తున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి వెల్లడించారు. మొదట ఈ గడువును ఐదు రోజులుగా ప్రతిపాదించగా, చర్చల అనంతరం దానిని రెండు రోజులకు తగ్గించే ప్రతిపాదనకు ఇరాన్ అంగీకరించింది. తమ నిబంధనల ప్రకారం జలసంధిని తిరిగి తెరవడం ద్వారానే అమెరికాతో పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలపై చర్చలు జరపడానికి మార్గం సుగమం అవుతుందని అరాగ్చీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక బలగాలను తగ్గించడం, చమురు మినహాయింపులను పునరుద్ధరించడం, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం వంటి డిమాండ్లు ఉన్నాయని తెలిపారు.
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం ద్వారానే అమెరికాతో పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలపై చర్చలు జరపడానికి మార్గం సుగమం అవుతుందని ఇరాన్ స్పష్టంగా చెబుతోంది. ఇరాన్ విధించిన డిమాండ్లలో.. తన రేవులు, చమురు రవాణా నౌకలపై అమెరికా విధించిన సుదీర్ఘ నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే రద్దు చేయాలని కూడా ఉంది.ఇరాన్‌పై నేరుగా జరుగుతున్న సైనిక దాడులతో పాటు అన్ని రకాల యుద్ధ రంగాలలో తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతోంది. లెబనాన్, పాలస్తీనా, యెమెన్, ఇరాక్ దేశాల్లోని తమ మిత్ర పక్షాలు హెజ్బుల్లా, హౌతీలు వంటి గ్రూపులపై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యలను నిలిపివేయాలని స్పష్టంగా డిమాండ్ చేస్తోంది. అయితే ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆంక్షల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరించడంతో ఇరు పక్షాల మధ్య చర్చల్లో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది.
కాగా అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో మిగిలి ఉన్న అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికాకు కేవలం పది నిమిషాల సమయం సరిపోతుందని అన్నారు. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా వరకు దెబ్బతీశామని, ఒకటి రెండు కీలక కేంద్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. అదే సమయంలో ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని చూస్తోందని వెల్లడించారు. ముఖ్యంగా భూగర్భంలో నిర్మించిన పికాక్స్ మౌంటెన్ వంటి కీలక కేంద్రాలను ప్రస్తావించారు. అయితే ఇరాన్‌తో చర్చలకు అవకాశం ఉందనే సంకేతాలను కూడా ట్రంప్ ఇచ్చారు. టెహ్రాన్ ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని చెప్పారు. కానీ ఆ దేశాన్ని పూర్తిగా నమ్మలేమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆ దేశ నౌకాదళం, వైమానిక దళం, గగనతల రక్షణ వ్యవస్థలను దెబ్బతీశామని పేర్కొన్నారు. సైనికుల పరికరాల తయారీ సామర్థ్యాన్ని కూడా చాలా వరకు తగ్గించామని అన్నారు.
మరోవైపు అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్ మీద భారీ ఎత్తున దాడులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ సైనిక చర్యకు ట్రంప్ వెనుకాడక పోవచ్చని ఆ దేశ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికాలు తమపై ఏ విధంగా, ఏ స్థాయి దాడికి పాల్పడినా అందుకు దీటైన సమాధానం ఇవ్వాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన సేనలకు పిలుపునిచ్చారని ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. ఈసారి తమ తక్షణ ప్రతిదాడికి భౌగోళిక సరిహద్దులేవీ ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ఒక రహస్య స్థావరంలో జరిగిన సైనిక సమావేశంలో ఆయన ఈ మాటలన్నట్టు వార్తా సంస్థ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన అన్ని రకాల ఆస్తులను దాడుల పరిధిలోకి తెచ్చేలా లక్ష్యాల జాబితాను అప్డేట్ చేయాలని ఆయన ఖమేనీ ఆదేశించారు. శత్రువు తిరిగి సైనిక, ఉగ్ర దాడులను ప్రారంభించిన పక్షంలో ముగించే విషయం ఇక ఇరాన్ చేతుల్లోనే ఉంటుందని ఖమేనీ వ్యాఖ్యానించారు.




