Burning Topic: ఇరాన్‌పై వెనక్కి తగ్గని ట్రంప్!

Burning Topic: అమెరికా-ఇరాన్ ఒప్పందం విఫలం. ఐరాసలో అమెరికా తీర్మానాన్ని వీటో చేసిన రష్యా, చైనా. యూఎన్ సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్న ఇరాన్ అధ్యక్షుడు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Sept 2026 6:55 AM IST
Burning Topic
X

Burning Topic: ఇరాన్‌పై వెనక్కి తగ్గని ట్రంప్!

Burning Topic: పశ్చిమాసియా పరిణామాలు రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి కొనసాగుతున్న ఘర్షణల కారణంగా గల్ఫ్ దేశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న చోట్ల ఇరాన్ దాడులు జరగడం, మరోవైపు చమురు, సహజ వాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలగడం ఇక్కడి దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందం పూర్తిగా విఫలమై, చర్చలు నిలిచిపోయిన దశలో ఉంది. జూన్‌ నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఒక ముసాయిదాపై సంతకాలు చేశారు. అయితే అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించలేదని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ మళ్లీ హార్ముజ్ జలసంధిలోని వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో ఈ కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ముక్కలైంది.

ఇరాన్‌తో మంచి ఒప్పందం కుదిరితేనే ముందుకు వెళ్తామని, లేదంటే ఎలాంటి డీల్ ఉండబోదని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల అధినేతలతో జరగబోయే కీలక భేటీకి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అంచనాలకు తగ్గట్టుగా ఉంటేనే ఇరాన్‌తో ఏవైనా ఒప్పందాలుంటాయని, లేదంటే ఎలాంటి చర్చలకూ తావులేదని తేల్చి చెప్పారు. అమెరికాతో ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటోందని ట్రంప్ చెప్పారు. కానీ, తమతో ఒప్పందానికి ఇరాన్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎలాంటి ఒప్పందానికైనా తాము అంగీకరిస్తామని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్నారు.

ఇక పశ్చిమాసియా యుద్ధం వేళ అమెరికాకు రష్యా, చైనాలు షాక్ ఇస్తూ ఇరాన్‌కు అండగా నిలిచాయి. ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ గడువును మరో ఏడాది పాటు పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనను రష్యా, చైనాలు వీటో చేశాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా వీటో అధికారాలు ఉన్న ఈ రెండు దేశాలు ఓటింగ్‌లో అమెరికా తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. యూఎన్‌లో అమెరికా తీర్మానంపై ఓటింగ్‌ జరగ్గా, ఈ ప్రతిపాదన 11-2 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాగా, రష్యా, చైనాల వీటో అధికారాన్ని వాడుకోగా, సోమాలియా, పాకిస్థాన్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. గత ఆర్నెల్లుగా భీకరంగా యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ను ఆర్థికంగా ఏకాకిగా చేసేందుకు అమెరికా విస్తృతంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

మరోవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు ఉన్నా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికాలో పర్యటించేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే వారం న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యే ఈ ఉన్నత స్థాయి అంతర్జాతీయ వేదికపై ఇరాన్ గళాన్ని వినిపించేందుకు ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో పాటు కీలక మంత్రులు, దౌత్యవేత్తలతో కూడిన ప్రతినిధి బృందం హాజరుకానుంది. ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ పర్యటన జరగనుండటం అంతర్జాతీయ సమాజం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. వీరికి అవసరమైన వీసాలను ఇవ్వడానికి అమెరికా సిద్దమైంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం తమ దేశంలో ఉన్నందున అంతర్జాతీయ చట్టాలు, దౌత్య ఒప్పందాలకు లోబడే ఈ అనుమతులు ఇచ్చినట్లు యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

ఇక ఇరాన్ మీద ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన రెండు వైమానిక దాడుల్లో అమెరికా యుద్ధ నేరానికి పాల్పడి ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ నియమించిన అంతర్జాతీయ నిజనిర్ధరణ బృందం తెలిపింది. ఆ దాడుల్లో 178 మంది పౌరులు చనిపోయినట్లు పేర్కొంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించింది. ఆ ఆరోపణల్లో ప్రధానంగా దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో జరిగిన దాడి ఉంది. అక్కడి షజరెహ్ తయ్యెబెహ్ పాఠశాలను అమెరికాకు చెందిన కనీసం ఒక క్షిపణి తాకినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ ఘటనలో 168 మంది చనిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అప్పట్లో తెలిపింది. ఆ దాడికి సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయి అధికారిక లెక్కలు బయటకు రాలేదు. అమెరికా కూడాదాడికి బాధ్యతను నేరుగా అంగీకరించలేదు. ఈ ఘటనపై అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాత అమెరికా విచక్షణారహిత దాడికి పాల్పడిందని భావించడానికి కారణాలు ఉన్నాయని నిజనిర్ధరణ బృందం తెలిపింది.

అదే రోజు దక్షిణ ఇరాన్‌లోని లామెర్డ్ నగరంలో మరో దాడి జరిగింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్, దాని చుట్టుపక్కల నివాస ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు పేర్కొంది. ఆ దాడిలో కచ్చిత లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ఉపయోగించినప్పటికీ, అవి పెద్ద సంఖ్యలో టంగ్‌స్టన్ లోహపు ముక్కలను చుట్టుపక్కల ప్రాంతంలోకి విసిరినట్లు నిపుణులు తెలిపారు. ఆ ఘటనలో 22 మంది పౌరులు, పురుషులు, మహిళలు మరణించినట్లు వెల్లడించారు. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ లామెర్డ్ దాడికి తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. దీంతో ఈ ఘటనపై బాధ్యత ఎవరిపై ఉందన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వానికి చెందిన భద్రతా బలగాలు భారీ స్థాయిలో హత్యలకు పాల్పడినట్లు పరిశీలనలో తేలింది. ఒకవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు ఇరాన్‌లో ప్రభుత్వ భద్రతా బలగాల చర్యలు, ఈ రెండింటి మధ్య సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని నిజనిర్ధరణ బృందం పేర్కొంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్