Burning Topic: చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్‌కు చైనా రష్యా రెడీ!

Burning Topic: చంద్రుడిపై శాశ్వత నివాసాలు, అణు రియాక్టర్ల ఏర్పాటు కోసం అమెరికా, చైనా, రష్యాల మధ్య పెరుగుతున్న పోటీ, ఆధిపత్య పోరు సవాళ్లపై కథనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Oct 2026 7:30 AM IST
Burning Topic
X

Burning Topic: చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్‌కు చైనా రష్యా రెడీ!

Burning Topic: ఆకాశంలోని చందమామను చేరుకోవడం అనేది ఒకనాటి కల.. మానవుడు భూమిని దాటి మరో గ్రహంపై అడుగు పెట్టాలనే కల ఇప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ కథ కాదు, నిజం కాబోతున్న వాస్తవం. కేవలం వెన్నెల వెలుగుల కోసం, కవుల ఊహల కోసం మాత్రమే పరిమితమైన చందమామ.

ఇప్పుడు ప్రపంచ దేశాల భవిష్యత్తు వ్యూహాత్మక స్థావరంగా మారుతోంది. 20వ శతాబ్దంలో కేవలం చంద్రుడిని తాకడానికి పోటీ పడిన దేశాలు, ఇప్పుడు అక్కడ శాశ్వత మానవ నివాసాలను ఏర్పాటు చేయడానికి సరికొత్త అంతరిక్ష యుద్ధానికి తెరలేపాయి.

1960ల నాటి అంతరిక్ష పోటీ కేవలం చంద్రునిపై జెండా పాతడమే లక్ష్యంగా సాగితే, నేటి ఆ పోటీ అక్కడ నివాసాలు ఏర్పరచుకుని సామ్రాజ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా సాగుతోంది.

అమెరికాకు చెందిన నాసా, రష్యాకు చెందిన రోస్కాస్మోస్, చైనాకు చెందిన సీఎన్‌ఎస్‌ఏ, భారత్‌కు చెందిన ఇస్రో ఇప్పటికే పరిశోధనలు చేపట్టాయి. అమెరికాకు చెందిన నాసా తన ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ద్వారా చంద్రుని దక్షిణ ధృవంపై మానవులు నివసించడానికి వీలుగా ఒక శాశ్వత కేంద్రాన్ని నిర్మించ తలపెట్టింది.

చంద్రుడిపై 'ఆర్టెమిస్ బేస్ క్యాంప్' నిర్మించి, అక్కడ వ్యోమగాములు దాదాపు రెండు నెలల పాటు నివసిస్తూ పరిశోధనలు సాగించేలా చేయడం దీని లక్ష్యం. మరోవైపు చైనా, రష్యాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ అనే భారీ ప్రాజెక్టును ప్రకటించాయి.

చంద్రుని ఉపరితలంపై లేదా దాని కక్ష్యలో దీర్ఘకాలం పాటు స్వయంప్రతిపత్తితో పనిచేసేలా ఒక సమగ్ర శాస్త్రీయ పరిశోధనా స్థావరాన్ని నిర్మించడం దీని లక్ష్యం.

ఈ పోటీలో భారత్ కూడా దూసుకుపోతోంది. 'స్పేస్ విజన్ 2047' రోడ్‌మ్యాప్ కింద చంద్రునిపై స్థావరం ఏర్పాటుకు అడుగులు వేస్తోంది. కాగా 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామిని పంపడం, ఆపై 2050 నాటికి చంద్రుడి కక్ష్యలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇస్రో ప్రణాళికను సిద్దం చేసింది

చంద్రునిపై మొదలైన ఈ పరిశోధనలతో అంతరిక్ష రంగంలో ఇప్పుడు సరికొత్త పోటీ మొదలైంది. సహజంగానే అమెరికా ఈ విషయంలో ముందుంది. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలంటే నిరంతర విద్యుత్‌ అవసరం.

సౌర విద్యుత్‌ ఒక ప్రధాన మార్గమైనప్పటికీ.. చంద్రుడిపై దాదాపు రెండు వారాలకు పైగా రాత్రి కొనసాగుతుంది. దీంతో కేవలం సౌరశక్తిపైనే ఆధారపడటం కష్టమవుతుంది.

దీన్ని దృష్టిలో పెట్టుకొని 2030 డిసెంబర్ నాటికి చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో ఎలాంటి నిర్వహణ అవసరం లేకుండా పనిచేయగల అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది.

అణు విద్యుత్ కేంద్రాలు సూర్యకాంతి అవసరం లేకుండా ఎక్కువ కాలం విద్యుత్‌ను అందిస్తాయి ఇందు కోసం లూనార్ రియాక్టర్ -1 పేరుతో సుమారు 20 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ.. దాదాపు ఐదేళ్లపాటు మానవ జోక్యం లేకుండా పనిచేసేలా రూపొందించనున్నారు.

ఇక్కడే దేశాల మధ్య అసలు పోటీ మొదలైంది. రష్యా కూడా చైనాతో కలిసి సెలీనా పేరుతో చంద్రుడిపై అణు రియాక్టర్‌ను అభివృద్ధి చేయాలని చూస్తోంది. 2036 నాటికి దీనిని సిద్ధం చేయాలని రష్యా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

చైనా నేతృత్వంలోని చంద్ర స్థావరాలకు విద్యుత్‌ అందించడమే దీని ఉద్దేశం. ఈ రియాక్టర్‌ 10 కిలోవాట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ పదేళ్లపాటు స్వయంచాలకంగా పనిచేసేలా రూపొందించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

చంద్రుడిపై పరిశోధనలు, వనరుల అన్వేషణతో పాటు మరింత దూరంలోని అంతరిక్ష మిషన్లకు అక్కడి నుంచి మద్దతు అందించేందుకు అణు విద్యుత్‌ కీలకంగా మారుతుందని అమెరికా, చైనా, రష్యా భావిస్తున్నాయి.

దీంతో చంద్రుడిపై అణు రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు ఈ మూడు దేశాల మధ్య పోటీ మొదలైంది. భవిష్యత్‌ అంతరిక్ష ఆధిపత్యంలో ఈ అణు రేసు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

అటు అమెరికా.. ఇటూ చైనా, రష్యాలు ఒకదానికొకటి పోటీపడుతూ, చంద్రునిపై అణు రియాక్టర్లను నిర్మించడానికి ప్రయత్నిస్తుండడంపై శాస్త్రవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

భూమిపై రియాక్టర్లల నుంచి రేడియేషన్ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన భద్రతా నిర్మాణాలు భూమిపై ఏర్పాటు చేయవచ్చు. కానీ చంద్రునిపై దీన్ని నియంత్రించడం కష్టమంటున్నారు.

రియాక్టర్‌ నుంచి వెలువడే రేడియేషన్‌ వ్యోమగాములు, పరికరాలకు ముప్పుగా మారే అవకాశం ఉంది. చంద్రుడి దుమ్ము, తీవ్రమైన ఉష్ణోగ్రతలు రియాక్టర్‌ పరికరాల పనితీరును దెబ్బతీయొచ్చు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే భూమి నుంచి నిపుణులు వెళ్లి మరమ్మతులు చేయడం కూడా అత్యంత క్లిష్టం.

అమెరికా, రష్యాలు తమ రియాక్టర్లను పూర్తి నిష్క్రియాత్మక స్థితిలో చంద్రుడిపైకి పంపాలని ఆలోచిస్తున్నాయి. దీని వల్ల ప్రయాణ సమయంలో ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రమాదాలు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని నిపుణులు అంటున్నారు.

కాగా చంద్రుని మీద అణు రియాక్టర్ల కోసం దేశాల మధ్య పోటీ మరో సమస్యను తీసుకొస్తోంది. 1967లో అమెరికా, సోవియట్‌ యూనియన్‌ సహా పలు దేశాల మధ్య కుదిరిన అంతరిక్ష ఒప్పందం ప్రకారం ఏ దేశం కూడా చంద్రుడు, ఇతర గ్రహాలు, అంతరిక్ష ప్రాంతాలను సొంత భూభాగాలుగా ప్రకటించుకోకూడదు.

అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించాలి, అక్కడ అణ్వాయుధాలు లేదా ఇతర సామూహిక విధ్వంసక ఆయుధాలను మోహరించకూడదు.

చంద్రుడి సహజ వనరులపై దేశాలు సార్వభౌమ హక్కులు ప్రకటించకుండా ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత స్థావరాలు, అణు రియాక్టర్లు ఏర్పడితే..

వాటి చుట్టూ భద్రతా ప్రాంతాలను ఏర్పాటు చేయడం, ఇతర దేశాల ప్రవేశాన్ని పరిమితం చేయడం వంటి అంశాలపై కొత్త న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పుడు అంతరిక్ష చట్ట నిపుణుల్లో సరికొత్త చర్చ మొదలైంది.

చైనా, రష్యాలు నిర్మించే అణు రియాక్టర్​ చంద్రుడిపై ఒక నియంత్రిత మండలాన్ని ఏర్పాటుచేసి, తమ వ్యోమగాములు, రోవర్లు ప్రయాణించే ప్రదేశాలను పరిమితం చేస్తాయనే భయందోళనలు అమెరికాకు ఉన్నాయి.

అందుకే తన ప్రణాళికలను వేగవంతం చేసింది. భద్రతా కారణాలు గురించి చెబుతున్నప్పటికీ, చంద్రుడిపై అణురియాక్టర్లను ఏర్పాటు చేయడం, అంతరిక్ష ఒప్పందానికి విరుద్ధమని అంటున్నారు న్యాయ నిపుణులు .

అయితే ప్రస్తుతం అగ్రరాజ్యాల ఆలోచనలు అన్నీ ప్రతిపాదనల వరకే ఉన్నాయి. ఇంకా అవి తాము ప్రతిపాదించిన రియాక్టర్లను చంద్రుడిపై ఏర్పాటు చేసి, వాటిని నిర్వహించగలమని నిరూపించాల్సి ఉంది.

చంద్రునిపై పరికరాలను వేడిగా ఉంచడానికి, వాహనాలకు ఛార్జింగ్ చేయడానికి సౌరశక్తి, రేడియోఐసోటోప్​ వ్యవస్థలను ఉపయోగించాలని అమెరికా, చైనాలు యోచిస్తున్నాయి. అయితే పెద్ద, శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేయాలంటే మాత్రం కచ్చితంగా మరింత ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్