BURNING TOPIC: ట్రంప్ ఎన్నికల వేళ.. ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి!

BURNING TOPIC: ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా మెరుపు దాడులు. డోనాల్డ్ ట్రంప్, నెతన్యాహు చర్చలు, హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతలపై ప్రత్యేక కథనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Nov 2026 8:06 AM IST
BURNING TOPIC
X

BURNING TOPIC: ట్రంప్ ఎన్నికల వేళ.. ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి!

BURNING TOPIC: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమాసియాలో మరోసారి యుద్ధంలోకి వెళ్లే అవకాశం ఉందని కొద్ది రోజులుగా సంకేతాలు రావడం తెలిసింది. రిపబ్లికన్ పార్టీ ఓడిపోతే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై భారీ వైమానిక దాడికి ఆదేశించే అవకాశాలు ఉన్నాయని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు మారకముందే ఇరాన్ చర్చల బాట పట్టకపోతే ఆ దేశంపై భారీ సైనిక చర్యకు డొనాల్డ్ ట్రంప్ వెనుకాడక పోవచ్చని అమెరికా అధికారులు చెబుతూ వచ్చారు. వైట్‌హౌస్‌లో అగ్రశ్రేణి సైనిక కమాండర్లతో అధ్యక్షుడు రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలోని మిత్రదేశాలను కూడా ట్రంప్ యంత్రాంగం అప్రమత్తం చేసినట్లు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ నేరుగా ఫోన్‌లో మాట్లాడి, తాజా పరిస్థితులు, సాధ్యమయ్యే దాడుల ప్రణాళికలను వివరించారని కూడా వార్తలు బయటకు వచ్చాయి.

అయితే మధ్యంతర ఎన్నికల పోలింగ్‌కు ముందే జరిగిన రహస్య ఆపరేషన్ కలకలం రేపుతోంది ఇరాన్‌లోని ఖేష్మ్ ఐలాండ్‌ పేలుళ్లతో దద్దరిల్లింది. హర్ముజ్ జలసంధిలో ఉన్న ఈ ద్వీపంపై దాడుల నేపథ్యంలో వరుసగా ఐదు చోట్ల బాంబుల వర్షం కురిసిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. ఖేష్మ్‌తో పాటు హర్మూజ్ జలసంధి సమీపంలోని బందర్ లెంగే నగరంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఖేష్మ్ ద్వీపం మీదుగా రెండు విమానాలు ఎగురుతుండటాన్ని స్థానికులు చూసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. హర్మూజ్ సమీపంలో ఎంక్యూ-9 సహా మరో రెండు డ్రోన్లను ఐఆర్‌జీసీ కూల్చేసింది. దీంతో కొన్ని వారాల విరామం తర్వాత మళ్లీ పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం కనిపించింది. హర్మూజ్ జలసంధిలో రాకపోకలు సాగిస్తున్న నౌకలపై ఇరాన్ దాడులు చేస్తు్న్న నేపథ్యంలో ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది.

ఇరాన్ మీద మరోసారి దాడులు చేపట్టాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోరుతున్నట్లు చెబుతున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత సైనిక చర్యలు చేపట్టాలని డొనాల్డ్ ట్రంప్‌‌కు ఆయన సూచించారని సమాచారం. ఇరాన్‌తో చర్చలు, సైనిక చర్యల పునఃప్రారంభంపై వీరిద్దరూ ఫోన్‌లో చర్చించుకున్నారు. అయితే, ప్రస్తుతానికి దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇవ్వాలని ట్రంప్ భావించారు. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసే ఆలోచన ఉందా అని మీడియా ప్రశ్నించగా ట్రంప్ ‘లేదు’ అని సమాధానమిచ్చారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్‌తో చర్చల ద్వారా ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్‌తో యుద్ధం మేము చేసి గెలిచామన్నారు ట్రంప్. దీన్ని యుద్ధం అంటారో లేదో నాకు తెలియదని, ఎందుకంటే మేము నెలల తరబడి ఎలాంటి పోరాటం చేయలేదని చెప్పారు.

అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ తర్వాత ఇరాన్‌పై దాడులు జరిగే అవకాశం ఉందని.. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు దాడుల ప్లాన్‌పై బ్రీఫింగ్ చేశారంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయన్న కథనాలతో చమురు మంటలు చల్లారాయి. ఆరు నెలల గరిష్ఠాల నుంచి బ్రెంట్ క్రూడ్ దిగొచ్చింది. ‘‘చమురు ధరలు రాకెట్ వేగంతో పడిపోతున్నాయి. బ్యారెల్‌కు దాదాపు 10 డాలర్ల మేర తగ్గాయి. ఇది ఒక రికార్డు. ఇరాన్‌తో యుద్ధం ఉండకపోవచ్చని భావించడమే అందుకు కారణం. ఇరాన్ కూడా వీలైనంత త్వరగా ఒక పరిష్కారాన్ని కోరుకుంటోంది. అది జరగొచ్చు కూడా’’ అని ట్రంప్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కూడా చర్చల పురోగతి పట్ల ఆశాభావం వ్యక్తంచేశారు. మళ్లీ ఇంతలోనే రహస్య దాడులు జరగడం గమనార్హం. దీంతో నేడు చమురు ఫ్యూచర్ల ధరలు మళ్లీ పెరిగాయి.

అంతకు ముందు అమెరికా తమ డిమాండ్లకు అంగీకరిస్తే రెండు రోజుల్లోనే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తెలిపింది. ఈ మేరకు మధ్యవర్తుల ద్వారా అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ వెల్లడించారు. అయితే తదుపరి చర్చలన్నీ అమెరికా నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని అన్ని రంగాల్లో ముగించాలని, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని, చమురు రంగంపై ఆంక్షలను ఎత్తివేయాలని, అమెరికా నావికాదళ దిగ్బంధనాన్ని తొలగించడం వంటి డిమాండ్లను ఇరాన్.. అమెరికా ముందుంచింది. అలాగే హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఇరాన్, ఒమన్ అంగీకరించిన కొత్త మార్గాన్ని అమెరికా గుర్తించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కోరారు. మళ్లీ ఇంతలోనే రహస్య దాడులు జరగడం గమనార్హం.

మరోవైపు యుద్ధం ముగింపు కోసం అమెరికాతో చర్చలు జరిపే బాధ్యతను అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌కు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ అప్పగించారు. అందుకోసం కొన్ని అధికారాలను ఆయనకు కట్టబెట్టారు. ఇప్పటికే తాము చర్చలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం. ఈ ప్రక్రియలో భాగంగా సుప్రీం లీడర్‌ కొన్ని అధికారాలను ప్రభుత్వానికి అప్పగించారు’’ అని ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నాకు పెజెష్కియాన్‌ వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా తమపై ఏ స్థాయి దాడికి పాల్పడినా అందుకు దీటైన సమాధానం ఇవ్వాలని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ తన సేనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఖమేనీ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇరాన్‌ అణు సామర్థ్యాన్ని చాలా వరకు ధ్వంసం చేశామని, ఇంకా మరో రెండు టార్గెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇరాన్-అమెరికా ఇప్పటికే భారీ మానవ, సైనిక మరియు ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నాయి. ఇరాన్ తమ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు అనేక మంది నాయకులకు కోల్పోయింది. కీలక సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, వంతెనలు భారీగా దెబ్బతిన్నాయి. వేలాది మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. యుద్ధ ప్రభావంతో సుమారు 35 లక్షల ప్రజలు కొత్తగా పేదరికంలోకి నెట్టబడ్డారు. హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇరాన్ ఇంధన ఎగుమతులు నిలిచిపోయాయి. దేశంలో నిధుల కొరత ఎంత తీవ్రంగా ఉందంటే, సైన్యానికి జీతాలు, పెన్షన్లు చెల్లించడం కూడా కష్టతరంగా మారింది. యుద్ధంలో అమెరికా కూడా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. 81 యుద్ధ విమానాలు, 45 ఎంక్యూ రీపర్డ్రోన్లను కోల్పోయింది.అమెరికా ఈ యుద్ధం కోసం నిమిషానికి దాదాపు 7 లక్షల డాలర్లు ఖర్చు చేస్తోంది. ప్రత్యక్ష సైనిక వ్యయం ఇప్పటికే 38 నుండి 42 బిలియన్ డాలర్లకు చేరింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్