OFF THE RECORD: టీటీడీ కొత్త చైర్మన్ పదవిపై రాజకీయ ఉత్కంఠ.. మళ్లీ ఆయనకేనా ?
OFF THE RECORD: తిరుమల టీటీడీ నూతన పాలకమండలి, చైర్మన్ ఎంపికపై ముమ్మర కసరత్తు. రేసులో కళా వెంకట్రావు, జ్యోతుల నెహ్రూ, బీఆర్ నాయుడు పేర్లు. కూటమిలో పెరుగుతున్న ఉత్కంఠ.
OFF THE RECORD: టీటీడీ కొత్త చైర్మన్ పదవిపై రాజకీయ ఉత్కంఠ.. మళ్లీ ఆయనకేనా ?
OFF THE RECORD: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవి.. రాజకీయ నేతలకు ఓ ప్రతిష్టాత్మక హోదా. స్వామివారి సేవలో భాగస్వామ్యం కావడంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే పదవి కావడంతో ఈ పీఠం కోసం ఎప్పుడూ పోటీ తీవ్రంగానే ఉంటుంది. 2024 నవంబర్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బీఆర్ నాయుడుకు చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. 24 మంది సభ్యులతో పాలకమండలిని ఏర్పాటు చేసింది. అయితే రెండేళ్ల పదవీకాలం ముగియడంతో ఇప్పుడు కొత్త బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కొత్త పాలకమండలి నియామకంపై తక్షణ నిర్ణయానికి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలన కొనసాగించేందుకు స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అధ్యక్షతన అధికారులతో కూడిన కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త పాలకమండలి ఏర్పాటుపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఇక కొత్త చైర్మన్ రేసులో టీడీపీ నుంచి రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి, గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావు పేరు బలంగా చర్చకు వస్తోంది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయనకు అవకాశం దక్కకపోవడంతో.. టీటీడీ చైర్మన్ పదవితో పార్టీ అధిష్టానం సముచిత ప్రాధాన్యత కల్పిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు జగ్గంపేట ఎమ్మెల్యే, ప్రస్తుత టీటీడీ పాలకమండలి సభ్యుడుగా ఉన్న జ్యోతుల నెహ్రూ పేరు కూడా తెరపైకి వచ్చింది. గతంలో పాలకమండలిలో పనిచేసిన అనుభవం.. సీనియర్ నేతగా ఉన్న గుర్తింపు.. ఈ అంశాలు ఆయనకు కలిసొస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరికి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే రేసు ఇక్కడితో ముగిసిపోలేదు. ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడుకు మరో అవకాశం కల్పిస్తారనే ప్రచారం కూడా కొనసాగుతోంది. మరోవైపు పారిశ్రామిక రంగానికి చెందిన సి.ఎం.రవిశంకర్, శ్రీనివాస రామానుజం పేర్లు కూడా చర్చలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చైర్మన్ ఎంపికపై రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. మరోవైపు సినీ పరిశ్రమలోని ఇద్దరు, ముగ్గురు ప్రముఖుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు అంత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారు, జనసేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున కూడా ఇద్దరు సినీ రాజకీయ ప్రముఖుల పేర్ల ఈసారి టీటీడీ ఛైర్మెన్ రేసులో ఉన్నారని టాక్ నడుస్తోంది.
ఈసారి టీటీడీ పాలకమండలి ఏర్పాటు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉండటంతో పాటు.. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా బోర్డులో అవకాశం కల్పించాల్సి ఉంటుంది. దీంతో ఎవరికి చైర్మన్ పదవి.. ఎవరికి బోర్డు సభ్యత్వం అన్న అంశంపై కూటమి పార్టీల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మరోవైపు మంత్రి పదవులు దక్కని సీనియర్ నేతలను బుజ్జగించాల్సిన బాధ్యత కూడా అధిష్టానంపై ఉంది. ఒకరికి అవకాశం కల్పిస్తే.. మిగిలిన ఆశావహులను ఎలా సముదాయించాలన్నది కీలకంగా మారనుంది. జనసేన, బీజేపీ నేతల ఆశలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
మొత్తానికి టీటీడీ చైర్మన్ పీఠం కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతుండగా.. తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లోనే ఉందన్న చర్చ సాగుతోంది. కళా వెంకట్రావుకు అవకాశం దక్కుతుందా..? జ్యోతుల నెహ్రూకు పట్టం కడతారా..? బీఆర్ నాయుడునే కొనసాగిస్తారా..? లేక అనూహ్యంగా మరో పేరును తెరపైకి తీసుకొస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే. ఎన్నికల కోడ్ ముగిసి కొత్త పాలకమండలి ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే వరకు టీటీడీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగనుంది.




