Off The Record: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం బీఆర్ఎస్ రివర్స్ స్కెచ్!
Off The Record: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి. ఫారమ్-18 ద్వారా ఓటర్ల నమోదు, ఖమ్మం-వరంగల్-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ రేసులో ప్రధాన నేతలు.
Off The Record: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం బీఆర్ఎస్ రివర్స్ స్కెచ్!
Off The Record: గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీల బలాబలాలను అంచనా వేసే వేదికగా నిలిచాయి. విద్యావంతులు, ఉద్యోగులు, యువతలో ఏ పార్టీకి ఆదరణ ఉందో ఈ ఎన్నికల ద్వారా స్పష్టత వస్తుంది. అందుకే ఈసారి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం అభ్యర్థులను ప్రకటించడం కాకుండా.. ముందుగా ఓటర్ల నమోదుపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించింది.
తెలంగాణ భవన్ నుంచి జిల్లాల వరకు ప్రత్యేక కార్యాచరణ అమలవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశాలు నిర్వహిస్తూ.. పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారట. పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామం, ప్రతి మండలంలో పట్టభద్రులను గుర్తించి ఫారం-18 ద్వారా ఓటర్ నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
ఇప్పటికే ఆరు జిల్లాల నాయకులతో సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్.. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక ఇంచార్జ్‌లను కూడా నియమించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు ఈ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలను సాధారణ ఎన్నికల మాదిరిగానే సీరియస్‌గా తీసుకుంటోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈసారి రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ప్రతి ఓటరూ కీలకమని భావిస్తున్న బీఆర్ఎస్.. ముందుగా ఓటర్ జాబితాలో ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అభ్యర్థుల కంటే ముందు ఓటర్లే ముఖ్యమనే వ్యూహంతో పార్టీ ముందుకు వెళ్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కూడా పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇద్దరి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రాకేష్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. గతంలో ఎన్నికల బరిలో నిలవడం వల్ల పట్టభద్రుల్లో ఆయనకు గుర్తింపు ఉండటం, విస్తృత స్థాయిలో పరిచయాలు కలిగి ఉండటం ఆయనకు అనుకూలాంశాలుగా చెబుతున్నారు.
అదే సమయంలో మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరికి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ దక్కే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతోంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం విషయంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఈ స్థానానికి పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగేందర్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా.. మరోవైపు కాసాని వీరేష్ కూడా బలమైన పోటీదారుగా కనిపిస్తున్నారు.
కాసాని వీరేష్ గత కొంతకాలంగా పార్టీ ముఖ్య నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. టికెట్ తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఆయన చురుకుగా పాల్గొంటున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పట్టభద్రులతో నేరుగా సమావేశాలు నిర్వహిస్తూ తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు సమాచారం.
మరోవైపు నాగేందర్ గౌడ్ కూడా పోటీలో తక్కువేమీ కాదనే సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం పార్టీ గోషామహల్ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. ఆ బాధ్యతలతోపాటు వికారాబాద్, పరిగి, రంగారెడ్డి ప్రాంతాల్లో పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అవకాశం తనకే వస్తుందనే నమ్మకాన్ని ఆయన తన అనుచరులతో వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇంత పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కేవలం రాజకీయ నేపథ్యం మాత్రమే కాకుండా.. సామాజిక సమీకరణాలు, ఆర్థిక వనరులు, పట్టభద్రుల్లో గుర్తింపు, ప్రత్యర్థులను ఎదుర్కొనే సామర్థ్యం, ఎన్నికల నిర్వహణ నైపుణ్యం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటోందట.
ఇదే సమయంలో నవంబర్ 6తో ఓటర్ల నమోదు ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో.. ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓటర్ల నమోదు పూర్తయ్యాక క్షేత్రస్థాయి నివేదికలను సమీక్షించి.. గెలిచే అవకాశాలు ఉన్న వారినే బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అలాగే కేటీఆర్, హరీష్ రావు కూడా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకుని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థుల ప్రకటన కంటే ముందే ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టడం వెనుక కూడా వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలం కన్నా ఓటరు జాబితా బలం ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే ముందుగా ఓటర్లను నమోదు చేసుకోవడం ద్వారా ఎన్నికల బరిలో ఆధిక్యం సాధించాలని గులాబీ పార్టీ లెక్కలు వేస్తోందట.
ఇక కాంగ్రెస్ ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించడంతో బీఆర్ఎస్పై సహజంగానే ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో తొందరపడకుండా.. గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ కేవలం ఎన్నికలుగా కాకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓటర్ల నమోదు పూర్తయ్యాక అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశాలు కనిపిస్తుండటంతో.. గులాబీ జెండా ఎవరి చేతిలో ఎగరబోతోందన్న ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది. మరి బీఆర్ఎస్ అధిష్టానం చివరకు ఎవరిని ఎంపిక చేస్తుంది..? ఓటర్ల నమోదులో వేసిన వ్యూహం ఫలిస్తుందా..? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.




