Burning Topic: మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్‌కు కష్టకాలం!

Burning Topic: అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ట్రంప్-ఒబామా మధ్య తీవ్రస్థాయి విమర్శలు, కాంగ్రెస్ ఆధిపత్యం కోసం రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీల హోరాహోరీ పోరు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Oct 2026 7:08 AM IST
Burning Topic
X

Burning Topic: మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్‌కు కష్టకాలం!

Burning Topic: అమెరికా భవిష్యత్తును శాసించే కీలక ఘట్టానికి తెర లేచింది. నవంబర్ 3న జరిగే మధ్యంతర ఎన్నికల కోసం ఇప్పటికే ఓటింగ్ మొదలైంది. అమెరికా అధ్యక్ష పదవికి ప్రతి నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరిగితే, ప్రతి రెండేళ్లకోసారి మధ్యంతర ఎన్నికలు పలకరిస్తుంటాయి. అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని 100 స్థానాల్లో 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

అలాగే వివిధ రాష్ట్రాల్లోని 36 గవర్నర్ స్థానాలకు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి పోలింగ్ పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటుకోడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ, పట్టు సాధించడానికి విపక్ష డెమోక్రాట్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. దేశ భవిష్యత్తును, రాజకీయ దిశను నిర్దేశించే కీలక ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలు తమ సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి.

ఈ ఎన్నికల్లో పబ్లికన్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల తరపున మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రంగంలోకి దిగి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం అమెరికా రాజకీయాలను రసవత్తరంగా మార్చింది. డెమొక్రాటిక్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఒబామా దేశవ్యాప్తంగా ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. కీలక స్వింగ్ స్టేట్స్‌లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ట్రంప్ పరిపాలనా విధానాలపై, ముఖ్యంగా వైట్‌హౌస్ వ్యవహార శైలిపై ఒబామా తన ప్రసంగాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్రంప్ రెండో విడత పాలనను "రెండేళ్ల గందరగోళం, క్రూరత్వం, అవినీతి, అసమర్థత" గా ఒబామా అభివర్ణించారు. ఆధునిక కాలంలో ఇంతటి అసమర్థ పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి, ఇంధన ధరల పెరుగుదలకు ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని ఒబామా విమర్శించారు. ముఖ్యంగా ఎవరూ కోరుకోని విధంగా ఇరాన్‌పై అనవసర యుద్ధానికి దిగడం వల్లే ప్రజలపై ఆర్థిక భారం పడిందని మండిపడ్డారు.

మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన దూకుడు శైలితో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. తన ఓటు బ్యాంకునే కాకుండా, స్వతంత్ర ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రత, సరిహద్దు నియంత్రణ వంటి సాంప్రదాయ రిపబ్లికన్ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ట్రంప్ ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ఆరోపణలను ట్రంప్ అంతే వేగంగా తిప్పికొడుతున్నారు.

తన ప్రచార సభల్లో లౌక్యంగా, ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఒబామా అమెరికా చరిత్రలోనే ఒక "అత్యంత ఘోరమైన, అసమర్థుడైన ప్రెసిడెంట్ అని కొట్టిపారేశారు. ఒబామా హయాంలో ఇరాన్‌తో చేసుకున్న అణు ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, అది అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసిందని ఆరోపించారు. ఒబామా ప్రసంగించిన సభలకు జనాలు రాలేదని, ఆయన ఒట్టి "ఖాళీ కుర్చీల" ముందే మాట్లాడారంటూ ట్రంప్ ప్రచార సభల్లో ఎగతాళి చేశారు.

కాదా మధ్యంతర ఎన్నికలు రిపబ్లికన్లకు పెద్ద షాకే ఇవ్వబోతున్నాట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్దం సుదీర్ఘం కొనసాగడం అమెరికా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.ఇరాన్‌ మీద చేపట్టిన యుద్ధం కారణంగా ఇంధన సరఫరాకు ఆటంకం కలిగి, అమెరికాలో ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఈ యుద్ధ వాతావరణాన్ని మెజారిటీ అమెరికన్లు వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. నిత్యావసర వస్తువులు, గ్యాసోలిన్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం సామాన్య ఓటర్లను ఇబ్బందుల్లోకి నెట్టింది.

ధరలను తగ్గిస్తానన్న హామీ పూర్తిస్థాయిలో నెరవేరకపోవడం ప్రతికూలంగా మారింది. విదేశీ వస్తువులపై విధించిన కఠినమైన సుంకాలు అమెరికాలోని మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారాన్ని మోపాయనే విమర్శ ఉంది. ట్రంప్ మొదటి విడత పాలనలో ఆయనను నియంత్రించడానికి, సలహాలు ఇవ్వడానికి అనుభవజ్ఞులైన అధికారులు ఉండేవారని, కానీ ఇప్పుడు ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ లోని రెండు సభలైన ప్రతినిధుల సభ, సెనెట్ రెండింటిలోనూ రిపబ్లికన్ పార్టీకే స్పష్టమైన ఆధిక్యత ఉంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండటంతో పాటు, అటు ప్రతినిధుల సభ, ఇటు సెనెట్ రెండూ రిపబ్లికన్ల ఆధీనంలోనే ఉండటంతో అమెరికాలో ప్రస్తుతం "ఏకీకృత ప్రభుత్వం"నడుస్తోంది. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల చేతిలో ఉన్న కాంగ్రెస్ నియంత్రణను డెమొక్రాట్లు చేజిక్కించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

అమెరికా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, సాధారణంగా వైట్‌హౌస్‌లో ఏ పార్టీకి చెందిన ప్రెసిడెంట్ అధికారంలో ఉంటారో, ఆ పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోవడం లేదా సీట్లు కోల్పోవడం సర్వసాధారణం. ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు కావడంతో, సహజంగానే ఓటర్లలో ఉండే వ్యతిరేకత డెమొక్రాట్లకు కలిసిరానుంది. ఇదే జరిగితే అధ్యక్షుని ఏకపక్ష నిర్ణయాలకు డెమోక్రాట్లు బ్రేకులు వేసే అవకాశం కనిపిస్తోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్