Burning Topic: డబుల్ గేమ్స్ ఆడుతున్న అమెరికా

Burning Topic: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌ను హెచ్చరించిన అమెరికా, పుతిన్‌తో డీజిల్ ఒప్పందం చేసుకోవడం దాని ద్వంద్వ ప్రమాణాలను ఎత్తిచూపుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Oct 2026 7:30 AM IST
Burning Topic
X

Burning Topic: డబుల్ గేమ్స్ ఆడుతున్న అమెరికా

Burning Topic: అంతర్జాతీయ రాజకీయాలు, వాణిజ్య, భౌగోళిక వ్యూహాలలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. స్వప్రయోజనాలు, కూటముల ప్రయోజనాల కోసం ఒక రకంగానూ, ఇతర దేశాల విషయంలో మరొక రకంగానూ వ్యవహరిస్తుందనే విమర్శలు ఇప్పటికే అమెరికాపై ఉన్నాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామంటూ ఇన్నాళ్లూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు.

ఏకంగా డీజిల్‌ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అనూహ్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయనతో చర్చల తర్వాత కీలక ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. రష్యా డీజిల్‌పై ఆంక్షలను 2027 ఏప్రిల్‌ వరకు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. రష్యాతో కుదిరిన డీజిల్‌ సరఫరా ఒప్పందాన్ని గొప్ప విజయంగా అభివర్ణించారు. ఈ ఒప్పందంతో ప్రపంచ మార్కెట్లోకి భారీగా డీజిల్‌ అందుబాటులోకి రానుంది.

అమెరికాలో డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ కీలక అడుగు వేశారు. ఫిబ్రవరిలో ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి డీజిల్‌ ధరలు రెండింతలయ్యాయి. ప్రస్తుతం గ్యాలన్‌ డీజిల్‌ సగటు ధర 6.28 డాలర్లుగా ఉంది. సెప్టెంబర్‌ చివర్లో ఇది రికార్డు స్థాయిలో 6.53 డాలర్లకు చేరింది. అమెరికాలో నవంబరులో మధ్యంతర ఎన్నికల వేళ ఇంధన ధరల పెరుగుదల ఆందోళనకు గురి చేయడంతో ట్రంప్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకోక తప్పలేదు..

మూడు లక్షల టన్నులకుపైగా డీజిల్‌ను అమెరికాకు, అంతర్జాతీయ విపణికి రష్యా తక్షణమే సరఫరా చేసేలా తమ చర్చల్లో ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. నవంబరులో మరో 5 లక్షల టన్నుల డీజిల్‌ను.. ఆ తర్వాత వెంటనే ఇంకో 10 లక్షల టన్నులను మాస్కో సరఫరా చేస్తుందన్నారు. ఆపై ఆ దేశ డీజిల్‌ రిఫైనరీల పరిస్థితులను బట్టి స్వల్ప కాలంలోనే మరో 30 లక్షల టన్నుల వరకూ అందిస్తుందని తెలిపారు.

ట్రంప్‌ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే రష్యా డీజిల్‌ను మార్కెట్లోకి అనుమతిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ తాత్కాలిక లైసెన్స్‌ జారీ చేసింది. అలాగే, రష్యా ప్రతినిధి కిరిల్‌ దిమిత్రియేవ్‌ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. ఇరు దేశాల ఇంధన రంగ సహకారం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. మరోవైపు దీనిపై ఉక్రెయిన్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్‌ నిర్ణయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఘాటుగా స్పందించారు.

‘పుతిన్‌కు బహుమతులు ఇవ్వడం వల్ల శాంతి రాదు. నాగరిక ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు’ అని వ్యాఖ్యానించారు. రష్యా ఈ డీజిల్‌ ఆదాయాన్ని మరింత దాడులు, మోసపూరిత చర్యలకు వినియోగించే అవకాశం ఉందని ఆరోపించారు. నిజమైన శాంతి సాధించాలంటే ఇరు పక్షాలు పరస్పరం ఉద్రిక్తతలను తగ్గించుకునే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.బలమైన భాగస్వాములు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని అసహనం వ్యక్తం చేశారు.

కాగా రష్యాతో అమెరికా కుదుర్చుకున్న డీజిల్ ఒప్పందం ద్వారా భారత్ విషయంలో అవలంబిస్తున్న తీవ్రమైన ద్వంద్వ విధానం బహిర్గతమైంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే నెపంతో 'లిండ్సే గ్రాహం చట్టం కింద భారత్‌పై 100% వరకు సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే భారతీయ వస్తువులపై 25% అదనపు సుంకాలు విధించింది.

ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యాపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధించినప్పటికీ, భారత్ తన దేశ ఇంధన అవసరాల కోసం రష్యా నుండి ముడి చమురు దిగుమతులను భారీగా కొనసాగిస్తోంది. అయితే భారత్ నిర్ణయం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు నిధులు సమకూర్చడమేనని అమెరికా నీతులు చెప్పింది. అమెరికాలో రాబోయే మధ్యంతర ఎన్నికల్లో తమ రాజకీయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూసుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం నేరుగా పుతిన్‌తో చేతులు కలిపింది. రష్యా చమురు భారత్ కొంటే నైతిక నేరం, అదే అమెరికా కొంటే వ్యాపార చతురత అన్నట్లు వ్యవహరిస్తోంది.

ఓవైపు ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టి.. చమురు సరఫరాలపై ప్రభావం పడటానికి కారణమైన ట్రంప్.. మరోవైపు అమెరికాలో చమురు ధరలను అదుపులో ఉంచడం కోసం ప్రయత్నిస్తున్నారు.రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. 2022 డిసెంబర్ నుంచి 2026 ఆగస్టు మధ్య రష్యా నుంచి 50 % క్రూడాయిల్ చైనా కొనుగోలు చేయగా.. భారత్ 37 % కొనుగోలు చేసింది.

2026 ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో 30.3 % రష్యా సరఫరా చేసింది.. జులై నెలలో భారత చమురు దిగుమతుల్లో 50 % రష్యా నుంచే వచ్చింది. తమ దేశ వినియోగదారులు, రైతులు, ట్రక్కర్ల కోసం ఇంధన ధరలను తగ్గించడానికి రష్యాతో డీజిల్ కొనుగోలు కోసం ఒప్పందం చేసుకున్నామని ట్రంప్ చెబుతున్నారు. మరి భారత్ కూడా 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యం అని చెబుతోంది. అంటే అమెరికన్లే ప్రజలు, వారి కష్టాలే కష్టాలు కానీ.. కోట్లాది మంది భారతీయుల కష్టాలు కష్టాలు కావా? .

ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ నియమాలను పాటించాలని శాసించే అమెరికా, తన సొంత లాభం వచ్చేసరికి ఆ నియమాలను తుంగలో తొక్కేస్తుందని ఈ ఒప్పందం నిరూపించింది. దీన్ని "అమెరికా ఫస్ట్.. హిపోక్రసీ లాస్ట్" అని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. భారత్ మూడో అతిపెద్ద చమురు వినియోగదారు దేశం. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇంధన దిగుమతులపైనే ఆధారపడి ఉంది. భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం చమురు కొంటే దాన్ని ఆంక్షల ఉల్లంఘన' అని ప్రచారం చేసిన వాషింగ్టన్, తన వినియోగదారుల కోసం రష్యా డీజిల్ కొనడాన్ని మాత్రం ఆచరణాత్మకత అనిపిలుచుకుంటోంది.

అమెరికాకు అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత సూత్రాలు లేవు, కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి అనడానికి ఈ రష్యా-అమెరికా డీజిల్ డీల్ స్పష్టమైన ఉదాహరణ. భారత్ వంటి వ్యూహాత్మక భాగస్వామిని చమురు పేరిట బెదిరిస్తూ, అమెరికా మాత్రం రష్యాతో రహస్య వ్యాపారాలు సాగించడం దాని దౌత్యపరమైన దివాళాకోరుతనానికి నిదర్శనం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్