Burning Topic: గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో ట్రంప్ కీలక ఒప్పందం!
Burning Topic: గ్రీన్‌లాండ్ భద్రతపై డెన్మార్క్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. 'ఇన్ఫినిట్ లైఫ్' డీల్ ఖరారు.
Burning Topic: గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో ట్రంప్ కీలక ఒప్పందం!
Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. గ్రీన్‌లాండ్‌కు సంబంధించి డెన్మార్క్‌తో చారిత్రిక కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్‌లాండ్ భద్రత, ఇతర అవసరాలపై అమెరికాకు శాశ్వత నియంత్రణ కల్పించేలా సైనిక స్థావరాలు, గగనతల వినియోగం, మిలిటరీ యాక్సెస్ హక్కులు లభించనున్నాయి. ఇందు కోసం డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రతినిధులతో కలిసి పనిచేశామన్నారు. ఈ ఒప్పందాన్ని 'ఇన్ఫినిట్ లైఫ్' ఒప్పందంగా ట్రంప్ అభివర్ణించారు. ఇందు కోసం అమెరికా ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తాజా ఒప్పందం ప్రకారం.. అమెరికా లిఖితపూర్వక అనుమతి లేకుండా గ్రీన్‌లాండ్‌లో మరో ఇతర దేశం సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం, పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదన్నారు. త్వరలో గ్రీన్‌లాండ్ ప్రజల సహకారంతో అనువైన ప్రాంతంలో భారీ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
తాజగా కుదిరిన ఒప్పందం ప్రకారం గ్రీన్‌లాండ్ ద్వీపం డెన్మార్క్ చేతుల్లోనే ఉంటుంది. కానీ అక్కడ అమెరికా సైన్యాన్ని మరింతగా మోహరించేందుకు అవకాశం లభించిందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీనితో అమెరికాకు ఉన్న అనేక ఆందోళనలకు పూర్తిగా పరిష్కారం లభించింది. ఖనిజ సంపద అధికంగా ఉన్న గ్రీన్‌లాండ్ భూభాగంలో, యూఎస్ సైన్యాన్ని మోహరింపును వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు. అమెరికా అధ్యక్షుని ప్రకటనను డెన్మార్క్కూడా ధ్రువీకరించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఈ ఒప్పందంపై మూడు దేశాల ప్రభుత్వాలు సంతకం చేశారు. ఈ ఒప్పందం గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌ల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను నిర్ధరిస్తుందని, ఇరుదేశాల స్వీయ నిర్ణయాధికారాన్ని గౌరవిస్తుందని డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్ తెలిపారు. ఈ డీల్ అమెరికా, డెన్మార్క్, గ్రీన్‌లాండ్ మూడింటికీ ప్రయోజనకరం అన్నారు గ్రీన్ ల్యాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్.
రష్యా, చైనా దేశాల నుంచి ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టడానికి అమెరికాకు గ్రీన్‌లాండ్ చాలా అవసరం అని ట్రంప్ మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు. ఆ ప్రాంతంలో రష్యా, చైనా సైనిక దళాలు మాటువేసి ఉన్నాయని పదేపదే ఆరోపణలు చేశారు. అందుకే గ్రీన్‌లాండ్‌లో తమ సైనిక బలగాలను మోహరించేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు. తాజా ఒప్పందంతో. డెన్మార్క్ ఎదుర్కొంటున్న సార్వభౌమత్వ సంక్షోభానికి ముగింపు పలికినట్లు అయ్యింది. గ్రీన్‌లాండ్‌కు భవిష్యత్తులో పూర్తి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటికీ, ఈ ఒప్పందం ఎటువంటి మార్పు లేకుండా శాశ్వతంగా అమల్లోనే ఉంటుందని అమెరికా అధికారులు తెలిపారు. ఇకపై గ్రీన్‌లాండ్‌లో నాటోయేతర స్థావరాలపై నిషేధం ఉంటుంది. అమెరికా ప్రత్యర్థులు పెట్టుబడులు పెట్టకుండా పరిమితిలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చైనా, రష్యాలు గ్రీన్‌లాండ్‌లో తమ స్థావరాలు ఏర్పాటుచేయకుండా నిరోధిస్తుంది" అని చెబుతున్నారు.
గ్రీన్‌లాండ్.. ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం. జనాభా కేవలం 57 వేలు. దాదాపు 80 శాతం భూమి మంచుతోనే ఉంటుంది. భౌగోళికంగా అమెరికాకు దగ్గరగా ఉన్నా.. ఇది డెన్మార్క్ దేశంలో భాగం. 1979లో జరిగిన రెఫరెండంలో ఈ ద్వీపానికి స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. విదేశీ వ్యవహారాలు, రక్షణ అంశాలను మాత్రమే డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది. భౌగోళికంగా ఈ ద్వీపం కీలక ప్రాంతంలో ఉంది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఎప్పటి నుంచో గ్రీన్‌లాండ్ మీద కన్నేశారు. అధ్యక్షుడిగా తన తొలి పదవీ కాలంలోనే ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని తన మనసులో మాటను బయట పెట్టుకున్నారు. గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదని అప్పట్లో ట్రంప్ ప్రతిపాదనను డెన్మార్క్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అమెరికా ఆలోచనను రష్యాతో పాటు నాటో కూటమిలోని అమెరికా మిత్ర దేశాలు కేూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ ద్వీపం విషయంలో ట్రంప్ దూకుడు మరింత పెరిగింది.
రష్యా, బ్రిటన్, అమెరికా, ఐరోపా యూనియన్‌కు మధ్యలో ఉంది. అందుకే గ్రీన్‌లాండ్ తమకు చాలా కీలకమని అగ్రరాజ్యం చెబుతోంది. భద్రతా పరంగా ఇది తమకు వ్యూహాత్మక ప్రాంతమని ట్రంప్ చెబుతున్నారు. అయితే 1950ల్లోనే డెన్మార్క్, అమెరికాల మధ్య సైనికపరమైన ఒప్పందం కుదిరింది. ఫలితంగా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అగ్రరాజ్యం.. గ్రీన్‌లాండ్‌లో అనేక సైనిక స్థావరాలను నిర్మించింది. తర్వాత వాటిలో చాలా స్థావరాలను మూసివేసింది. అమెరికా కేవలం రక్షణ అవసరాల కోసమే గ్రీన్‌లాండ్ కావాలని కోరుతున్నా కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. గ్రీన్‌లాండ్‌లో బంగారం, నికెల్, కోబాల్ట్ నిక్షేపాలు కూడా భారీస్థాయిలో ఉన్నాయి. వాటిపై అమెరికాలోని చాలా మైనింగ్ సంస్థలు కన్నేసి పావులు కదుపుతున్నాయి.. కాగా గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని గతంలోనూ అమెరికా ప్రయత్నించింది. 1946లో 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఇస్తామని డెన్మార్క్‌కు ఆశచూపింది. దాన్ని ఆ దేశం తిరస్కరించింది.
మరోవైపు గ్రీన్‌లాండ్‌లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! ఆర్కిటిక్ ప్రాంతంలో భూతాపం ప్రభావం రెట్టింపుగా ఉండటంతో మంచు వేగంగా కరుగుతోంది. 1979 నుంచి గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలలో ట్రిలియన్ల కొద్దీ మంచు కరిగి సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. సముద్ర మట్టం ప్రతి సెంటీమీటర్ పెరిగినా కోట్లాది మంది ప్రజలు వరద ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయింది. అపారమైన మంచు నిల్వలకు గ్రీన్‌లాండ్ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. ఆర్కిటిక్‌పై పట్టు కోసం అగ్రరాజ్యాలు చేస్తున్న ప్రయత్నాలు ఆక్కడ విపరీతమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. 2040 నాటికి వేసవిలో ఈ ప్రాంతంలో మంచు ఆనవాలే ఉండకపోవచ్చని ఒక అధ్యయనం ఇప్పటికే హెచ్చరించింది.




