OFF THE RECORD: బీజేపీలో ఎమ్మెల్సీ టికెట్ల పంచాయితీ!
OFF THE RECORD: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి. కాంగ్రెస్, జనసేన అభ్యర్థుల ఖరారు. బీజేపీలో ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్, అధిష్ఠానం నిర్ణయంపై ఆశావాహుల ఎదురుచూపులు.
OFF THE RECORD: బీజేపీలో ఎమ్మెల్సీ టికెట్ల పంచాయితీ!
OFF THE RECORD: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నగారా మోగకముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. అధికార కాంగ్రెస్ ఇప్పటికే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి సిద్ధమైంది. ఇక బీజేపీ మిత్రపక్షమైన జనసేన సైతం నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గడాల శ్రీనివాసరావు పేరును ప్రకటించి ప్రచారం మొదలుపెట్టేసింది. కానీ బీజేపీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కథ మరోలా ఉందట. అందరికంటే ముందుగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిన కమలం పార్టీ.. ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను మళ్లీ రిపీట్ చేస్తామని నేతలు పైకి గాంభీర్యంగా చెబుతున్నా.. అభ్యర్థుల ఖరారు విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదన్న చర్చ సాగుతోందట. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్.. మరియు నల్గొండ-వరంగల్-ఖమ్మం.. ఈ రెండు పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నేతల అభిప్రాయాలు సేకరించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు నివేదిక అందించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక్కో స్థానానికి ఐదుగురు చొప్పున పేర్లు సూచించినట్టు సమాచారం.
త్రీ మెన్ కమిటీ ఇచ్చిన నివేదికతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరో మలుపు తిరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్‌తో పాటు రాష్ట్ర ముఖ్యనేతలు పాల్గొని రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. త్రీ మెన్ కమిటీ అభిప్రాయ సేకరణలో ఒక్కో స్థానానికి ఐదుగురు పేర్లు ఉంటే.. ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వం ముగ్గురి పేర్లతో మరో జాబితాను సిద్ధం చేసి పార్లమెంటరీ బోర్డుకు పంపినట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అక్కడ కూడా రాష్ట్రస్థాయి ఎన్నికల కమిటీ ప్రక్రియ పూర్తయి.. అభ్యర్థుల పేర్లు అధిష్ఠానం పరిశీలనకు చేరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయట. అంటే రాష్ట్రంలో వడపోత పూర్తయిందా..? ఇక ఢిల్లీ ముద్ర పడటమే మిగిలిందా..? లేక చివరి నిమిషంలోనూ పేర్లు మారే అవకాశముందా..? ఇదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
దసరా దాటింది.. దివాళీ ముగిసింది. ప్రకటన ఏదీ అంటూ పార్టీ ఆఫీసులో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయట. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై బీజేపీ నేతలు ముందుగా దసరాలోపే నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ దసరా వెళ్లిపోయింది. ఆ తర్వాత దివాళీ నాటికైనా టికెట్ల ప్రకటన వస్తుందని ఆశావహులు ఎదురుచూశారు. దీపావళి కూడా ముగిసిపోయింది. కానీ అభ్యర్థుల ప్రకటన మాత్రం రాలేదు. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతల్లో అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైందట. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఆశావహుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందన్న గంపెడాశతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారట. ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతుంటే.. మరోవైపు బీజేపీలో మాత్రం ప్రకటన కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఈ జాప్యంపై పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందట. టికెట్ కోసం ఇంతకాలం ఎదురుచూసిన నేతలకు ఇప్పుడు మరో ప్రశ్న ఎదురవుతోందట. అసలు తమ పేరు జాబితాలో ఉందా..? ఉంటే ప్రకటన ఎప్పుడు..? లేదంటే చివరి నిమిషంలో కొత్త పేరు తెరపైకి వస్తుందా..? అన్న భయం ఆశావాహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట.
ఇక మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేరు దాదాపు ఖరారైనట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇదే స్థానం నుంచి యువనేత డోకూర్ పవన్ కుమార్‌రెడ్డి, పార్టీ ఆల్ సెల్స్ కోఆర్డినేటర్ సారంగుల అమర్నాథ్,, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పేర్లు కూడా రేసులో ఉన్నట్టు బలంగా వినిపిస్తోంది. మరోవైపు నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది... ఈ స్థానం నుంచి ఓయూ ఉద్యమ నేత పుల్లారావు యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూటుపల్లి రవికుమార్, అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ పేర్లు ప్రధానంగా చర్చలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతమంది ఆశావహులు ఉండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు టికెట్ల ప్రకటనలో జాప్యానికి పార్టీ సంస్థాగత వ్యవహారాలు కూడా కారణమన్న చర్చ వినిపిస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పార్టీ సంస్థాగత బాధ్యతలు నిర్వహిస్తున్న మధుకర్.. ఇటీవల ఏపీలో ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైందన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మధుకర్ తెలంగాణకు వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపిక ప్రకటనలో కదలిక వస్తుందన్న చర్చ సాగుతోందట.
రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరిన జాబితా.. ఇప్పుడు అధిష్ఠానం దగ్గర ఏ మలుపు తిరుగుతుందన్నదే అసలు సస్పెన్స్. ఇన్నాళ్లూ టికెట్ కోసం ఎదురుచూసిన నేతలకు అధిష్ఠానం ఎప్పుడు గుడ్‌న్యూస్ చెబుతుంది..? తెర వెనుక సాగుతున్న ఈ టికెట్ల కథకు తెర ఎప్పుడు పడుతుందో.. కమలం పెద్దల నిర్ణయం వచ్చేదాకా వేచి చూడాల్సిందే.




