Off The Record: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు

Off The Record: తెలంగాణలో సంస్థాగత బలోపేతానికి బీజేపీ అడుగులు వేస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల బాధ్యతలను నేత దశరథ్‌కు అధిష్ఠానం అప్పగించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Oct 2026 11:17 AM IST
Off The Record
X

Off The Record: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు 

Off The Record: తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కేవలం కొన్ని జిల్లాలపై పట్టు ఉంటే సరిపోదని, రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో పార్టీ బలంగా ఉండాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అంతర్గత సర్వేల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఆశించినంత బలంగా లేదని తేలిందట. ఈ మూడు జిల్లాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలపడాల్సిన అవసరం ఉందని హైకమాండ్ గుర్తించిందట. ఉత్తర, దక్షిణ తెలంగాణను కలుపుతూ కీలకమైన ఈ ప్రాంతాల్లో పట్టు సాధిస్తేనే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయని బీజేపీ అంచనా వేస్తోందట.

ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే బాధ్యతను బీజేపీ సంస్థాగత సంయుక్త కార్యదర్శి దశరథ్‌కు పార్టీ అధిష్టానం అప్పగించింది. కేవలం పార్టీ కార్యాలయాలకే పరిమితం కాకుండా, వరంగల్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుని ఆయన ఈ మూడు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారుట. స్థానిక నేతలను సమన్వయం చేయడం, అసంతృప్తులను బుజ్జగించడం, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించే బాధ్యతను ఆయనకు కట్టబెట్టారట. వరంగల్ కేంద్రంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పార్టీ పటిష్టతకు నిరంతరం సమీక్షలు నిర్వహించనున్నారట.

తెలంగాణలో కమలం వికసించేందుకు ఉవ్విళ్లూరుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ అంటే ఒక నగరం మాత్రమే కాదు. ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కీలక కేంద్రం. అందుకే మూడు ఉమ్మడి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే వ్యూహాంతో ఉందట బీజేపీ అధిష్టానం. ఇక 1984 లోక్‌సభ ఎన్నికల్లో హన్మకొండ నుంచి బీజేపీ నేత చందుపట్ల జంగారెడ్డి విజయం సాధించడం పార్టీ చరిత్రలో కీలక ఘట్టం. దేశవ్యాప్తంగా బీజేపీకి వచ్చిన రెండు లోక్‌సభ స్థానాల్లో అది ఒకటి. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ సుమారు 3.61 లక్షల ఓట్లు సాధించడం పార్టీకి ఉన్న అవకాశాలను సూచిస్తోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ 2016లో ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ.. 2021లో పది కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంది. అంటే.. ఎదిగే అవకాశం ఉంది.. కానీ ఆ అవకాశాన్ని విజయంగా మార్చుకోవడమే లక్ష్యం.

ఇక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే తయారీ యూనిట్, మామునూరు విమానాశ్రయ ప్రతిపాదన.. స్మార్ట్ సిటీ పనులు.. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు.. ఇవన్నీ బీజేపీ ప్రచారంలో ప్రస్తావించగల అంశాలు. కానీ ప్రజలు అడిగే ప్రశ్న ఒక్కటే.. ప్రాజెక్టుల పేర్లు చెప్పడం కాదు.. వాటివల్ల మాకొచ్చిన ప్రయోజనం ఏంటి..? తాగునీటి సమస్య తీరిందా..? రహదారులు బాగుపడ్డాయా..? నిరుద్యోగులకు ఉపాధి దొరికిందా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కేవలం అభివృద్ధి మంత్రం చెప్పాడం సరికాదు. వరంగల్ కార్పొరేషన్‌లో గెలవాలంటే ప్రతి డివిజన్‌లో బలమైన అభ్యర్థులు.. ప్రతి బూత్‌లో పనిచేసే కార్యకర్తలు.. ప్రతి కాలనీలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట.

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితి చూస్తే.. గతం కంటే ఓట్లు పెరిగిప్పటికీ.. అవి సీట్లుగా మారుతాయా..? ఖమ్మం రాజకీయాలు అంటేనే ఒక ప్రత్యేక లెక్క. ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన పునాది.. బీఆర్ఎస్‌కు రాజకీయ నెట్‌వర్క్.. వామపక్షాలకు చారిత్రక గుర్తింపు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రభావంతో టీడీపీ, జనసేన సానుభూతిపరుల రాజకీయ అభిరుచులూ చర్చకు వస్తుంటాయి. ఈ రాజకీయ చదరంగంలో బీజేపీ తనకంటూ ఒక స్థానం ఎలా సంపాదించుకుంటుంది..? ఇక్కడే అసలు ట్విస్ట్. 2019లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీజేపీకి సుమారు 20 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

2024 ఎన్నికల్లో ఆ సంఖ్య 1.18 లక్షలకు పైగా పెరిగింది. ఓట్లలో పెరుగుదల కనిపిస్తోంది. కానీ ఆ పెరుగుదల గెలుపు దాకా తీసుకెళ్తుందా..? ఓట్లు పెరిగాయని సంబరపడాలా..? సీట్లు రాలేదని ఆలోచించాలా..? బీజేపీ ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇదే. ఖమ్మంలో రాజకీయ బలం పెంచుకోవాలంటే ఇతర పార్టీల ఓటర్ల మద్దతుపై అంచనాలు వేసుకోవడం మాత్రమే సరిపోదు. స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడాలి. రైతులు, యువత, మహిళలు, చిన్న వ్యాపారులతో సంబంధాలు పెంచుకోవాలి. గ్రామస్థాయి నాయకత్వాన్ని నిర్మించుకోవాలి. ఖమ్మంలో ఓట్లను సీట్లుగా మార్చాలంటే.. బీజేపీకి కీలకమైన అగ్ని పరీక్షగా మారిందట.

నల్గొండ అంటే కాంగ్రెస్ కంచుకోట. ఇక్కడ కమలానికి అగ్నిపరీక్షే. ఇక్కడి రాజకీయాలు అంత ఈజీ కాదు. కాంగ్రెస్‌కు సంప్రదాయ బలం.. బీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయి నెట్‌వర్క్.. కొన్ని ప్రాంతాల్లో వామపక్షాలకు ప్రభావం. నల్గొండ, భువనగిరి.. ఎంపీ స్థానాలతోపాటు 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలిపించుకుంది. ఈ ఫలితం ఆ పార్టీకి ఉన్న రాజకీయ బలాన్ని సూచిస్తోంది. సూర్యపేటలో బీఆర్ఎస్ జెండా ఎగిరే‌సింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఏం చేయాలి..? ముందుగా.. పార్టీలో అంతర్గత విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి.

నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు బదులుగా ప్రజా సమస్యలపై పోరాటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, ఫ్లోరైడ్ సమస్య వీటిపై నిరంతరం స్పందించాలి. బూత్ కమిటీల నుంచి గ్రామస్థాయి నాయకత్వం వరకు పార్టీ వ్యవస్థను బలోపేతం చేయాలి. యువత, మహిళలు, బీసీ, ఎస్సీ వర్గాలకు అవకాశాలు కల్పించాలి. పట్టణాల్లో ఉన్న రాజకీయ ఆదరణను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి.

ఇక వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధత కూడా పార్టీకి మరో పరీక్షగా మారే అవకాశం ఉంది. ఓటరు నమోదు నుంచి ప్రచారం వరకు.. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ అవసరం. ఇక కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడితే సరిపోదు. మన సొంత బలాన్ని పెంచుకుని గెలవడమే అసలైన వ్యూహం. మూడు జిల్లాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందట.

అందులోభాగంగానే సంస్థాగత సహ ఇన్‌ఛార్జి దశరథ్‌కు స్పెషల్ టాస్క్ అప్పగించిందట. మొదటగా.. ఏ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది..? ఎక్కడ బలహీనంగా ఉంది..? గత ఎన్నికల్లో ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు వచ్చాయి..? ఎక్కడ కొత్త నాయకత్వాన్ని నిర్మించాలి..? అనే అంశాలపై స్పష్టమైన ప్రణాళిక అవసరం. రెండోది.. నాయకుల మధ్య సమన్వయం, మూడోది- ఇతర పార్టీల నుంచి చేరికలతోపాటు పాత కార్యకర్తలకు ప్రాధాన్యత.

నాలుగోది.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం. ఐదోది.. స్థానిక సమస్యలపై నిరంతర పోరాటం. ఇవన్నీ కాగితాల మీద కాకుండా.. గ్రామాల్లో అమలైతేనే పార్టీకి రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది. అలాగే అధిష్టానం ఆదేశాలు ఇవ్వగలదు.. నేతలు వ్యూహాలు రచించగలరు.. కానీ ఓటు తెచ్చేది మాత్రం ప్రజల్లో పనిచేసే కార్యకర్తే.

వరంగల్‌లో పునాది, ఖమ్మంలో విస్తరణ, నల్గొండలో బలపరీక్ష. ఈ మూడు టాస్క్‌లు విజయవంతంగా పూర్తి చేస్తే ఈ మూడు జిల్లాల్లో కమలం విరబూస్తుందా..? ఇక సహ ఇన్‌ఛార్జి దశరథ్ వ్యూహం.. కమలానికి కొత్త దారి చూపిస్తుందా..? లేక కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ చదరంగంలో బీజేపీకి మరోసారి ఎదురుచూపులే మిగులుతాయా..? అన్నది చూడాలి మరి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్