Off The Record: తెలంగాణ బీజేపీకి సునీల్ బన్సల్ వార్నింగ్!
Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేయాలని, లేదంటే పదవులు వదులుకోవాలని ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హెచ్చరించారు.
Off The Record: తెలంగాణ బీజేపీకి సునీల్ బన్సల్ వార్నింగ్!
Off The Record: తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఎన్నికలు వచ్చినప్పుడు హడావుడి చేయడం కాదు.. ముందే క్షేత్రస్థాయిలో పునాదులు గట్టిగా వేసుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పెషల్ టీం తెలంగాణలో మకాం వేసిందట. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్, సహ ఇన్ఛార్జీలు అభయ్ పాటిల్, రేఖా శర్మ, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శులు మధుకర్, దశరథ్ వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు కసరత్తు చేశారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్, నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశావాహుల్లో ఒక్కో స్థానం నుంచి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి జాతీయ నాయకత్వానికి పంపించారట.
ఈ నెల చివరి నాటికి అభ్యర్థుల ప్రకటన ఉండవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఎవరి పేరు ఖరారవుతుందన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఎన్నికల కురుక్షేత్రంలో దిగే అభ్యర్థుల ఎంపికపై కమలం పార్టీ కసరత్తు మొదలైంది.
మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులతో సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ఈ భేటీలో అభయ్ పాటిల్, రేఖా శర్మ, మధుకర్, దశరథ్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్పై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలి..? ప్రజల్లో ఉన్న అనుమానాలను ఎలా తొలగించాలి..? పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి..? అనే అంశాలపై చర్చించారట. నేతలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఇక సర్ ప్రక్రియపై ఇండి కూటమి, సీజేపీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా "లోక్తంత్ర బచావో- భీడ్తంత్ర హటావో" పేరుతో బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నవంబర్ ఒకటో తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్‌లో పాదయాత్ర చేయనున్నారు. ఇదే తరహాలో మరో ఐదు చోట్ల కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకత్వం సూచించింది. కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్‌లోనూ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఎస్ఐఆర్పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అంటే ఎన్నికల ముందు ప్రచారం ఒక్కటే కాదు.. ప్రజలకు వివరించడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం కూడా కీలకమేనని నాయకత్వం భావిస్తోందట. మరి ఈ కార్యాచరణ కాగితాలకే పరిమితం అవుతుందా..? లేక జనంలోకి వెళ్తుందా..? అన్నది చూడాలి.
తెలంగాణ బీజేపీ నేతలకు సునీల్ బన్సల్ ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారట. పని చేయనప్పుడు పదవులు ఎందుకు..? వేరే వాళ్లకు ఇచ్చేయండి.. తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదని.. పార్టీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ తిరిగితే ఇక సహించేది లేదని తేల్చిచెప్పారటా. నియోజకవర్గాల్లోకి వెళ్లాలి.. ప్రజల మధ్య ఉండాలి.. వారి సమస్యలు తెలుసుకోవాలి.. అప్పుడే పార్టీకి ఉపయోగం ఉంటుందంటూ సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారట. పెద్దపెద్ద బహిరంగ సభల్లో ప్రసంగించడం ఒక ఎత్తయితే.. ప్రజల్లోకి వెళ్లి చిన్నచిన్న సమూహాలతో మాట్లాడటం మరో ఎత్తని బన్సల్ చెప్పినట్లు తెలుస్తోంది.
నలుగురితో ఛాయ్ తాగుతూ వారి సమస్యలు తెలుసుకున్నా మంచి ప్రభావం ఉంటుందని సూచించారట. ఇచ్చిన కార్యక్రమాల్లో కనీసం రెండు, మూడు అయినా పక్కాగా చేయకపోతే ఎలా అని ముఖం మీద కొట్టినట్టు నిలదీశారట. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి.. రాష్ట్రంలో రాబోయే ప్రతి ఎన్నిక కూడా కీలకమేనని నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారట.
ఇకపై తాను కూడా తెలంగాణలో ఫుల్ టైం అందుబాటులో ఉంటానని చెప్పేశారట. అంతేకాదు.. పార్టీ కార్యక్రమాలపై ప్రతి నెలా నివేదిక ఇవ్వాలని ఆదేశించారట. దీంతో నేతల పనితీరుపై ఇక క్రమం తప్పకుండా సమీక్షలు జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ హెచ్చరికలు నేతల్లో ఎంతటి మార్పు తీసుకొస్తాయో చూడాలి.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తొమ్మిది జిల్లాల అధ్యక్షులతోనూ సునీల్ బన్సల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేశారట. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని.. ప్రజలకు అండగా నిలబడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ప్రశ్నించాలని నేతలకు దిశానిర్దేశం చేశారట. బీజేపీ ఎన్నికల కమిటీతోనూ బన్సల్ సమావేశమై.. రాబోయే ప్రతి ఎన్నికను కీలకంగా తీసుకుని క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు పార్టీలో నేతల మధ్య ఉన్న విభేదాలు, ఆధిపత్య పోరు కూడా నాయకత్వానికి సవాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను సెమీఫైనల్ పోరుగా భావించాలని పార్టీ నాయకత్వం భావిస్తుందట. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ప్రజల్లో పార్టీపై విశ్వాసం పెంచేలా ఇప్పటి నుంచే పని చేయాలని నేతలకు హితోపదేశం చేశారట బన్సల్. అయితే సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమలవుతాయన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే రాజకీయాల్లో ప్లాన్ వేయడం ఒక ఎత్తు.. ఆ ప్లాన్‌ను జనంలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు.
మొత్తానికి తెలంగాణ బీజేపీలో ఇప్పుడు అసలు సినిమా మొదలైందంటున్నారు రాజకీయ పరిశీలకులు. హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో శ్రేణులు ఫుల్ జోష్ లో కన్పిస్తున్నారు. ఇన్నాళ్లూ పదవుల చుట్టూ తిరిగిన రాజకీయం.. ఇక ప్రజల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సునీల్ బన్సల్ ఇచ్చిన క్లాస్‌తో నేతలంతా గ్రౌండ్లోకి దిగుతారా..? లేక మళ్లీ పాత సీన్ రిపీటవుతుందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.




