Off The Record: మంత్రి జూపల్లి భవిష్యత్తు ఏమిటి ?

Off The Record: తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు, పాలమూరు జిల్లా రాజకీయ సమీకరణాల మధ్య మంత్రి జూపల్లి కృష్ణారావు భవిష్యత్తుపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Nov 2026 7:19 AM IST
Off The Record
X

Off The Record: మంత్రి జూపల్లి భవిష్యత్తు ఏమిటి ?

Off The Record: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు రాజకీయ ప్రస్థానం తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక మలుపు తిరిగింది. 2011లో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలకు చలించిపోయిన ఆయన.. మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

అనంతరం కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేపట్టి.. 2012 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు.

అలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు మంత్రిగా కొనసాగారు. అయితే 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన రాజకీయ ప్రయాణంలో కొంత మార్పు కనిపించింది. పార్టీలోనే కొనసాగినా పెద్దగా చురుగ్గా కనిపించలేదు. చివరకు 2023 ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.

వీరిద్దరి చేరికతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఎన్నికల్లో జూపల్లి విజయం సాధించి మరోసారి మంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు అదే మంత్రి పదవిపై చర్చ మొదలైంది.

ఈ చర్చకు ప్రధాన కారణం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా కొనసాగుతుండటమేనట. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నారు. ఒకే ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు ఉండటంతో మంత్రివర్గ మార్పులు జరిగితే ఒకరికి అవకాశం తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఇక్కడ రెండు మంత్రి పదవులు సరిపోతాయని, ఉత్తర తెలంగాణకు మరో మంత్రి పదవి ఇవ్వాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సమీకరణాల్లో జూపల్లి పేరు ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత ప్రాధాన్యత తెచ్చాయి.

ఇక్కడే మరో రాజకీయ అంశం తెరపైకి వస్తోంది. ఉత్తర తెలంగాణలో బలపడేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోందనే చర్చ ఉంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను తమవైపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందా..? ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతుందా..? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో జూపల్లి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి రాజకీయంగా కలిసి వస్తుందనే సెంటిమెంట్ కూడా కొందరు నాయకుల్లో ఉందనే ప్రచారం ఉంది. 2023లో పొంగులేటితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆ పార్టీకి వచ్చిన ఊపును కూడా ఈ సెంటిమెంట్‌తో ముడిపెడుతున్నారు. దీంతో జూపల్లిని ఇతర పార్టీలు తమవైపు ఆహ్వానిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఇక రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు కొండా సురేఖ అంశం కూడా చర్చకు వచ్చింది. గతంలో కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పడం, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పరిణామంతో పాటు మంత్రివర్గ మార్పుల ప్రచారం, పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ పరిణామాలన్నింటి మధ్య జూపల్లి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మొత్తానికి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన జూపల్లి.. ఇప్పుడు మరోసారి మంత్రి పదవిపై జరుగుతున్న చర్చల మధ్య ఉన్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ తన రాజకీయ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తారా..? ఒకవేళ మంత్రి పదవిలో మార్పులు జరిగితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..?

ఇతర పార్టీల నుంచి వస్తున్న ఆహ్వానాలకు స్పందిస్తారా..? అనేది వేచి చూడాలి. గతంలో పార్టీ మారిన అనుభవం ఉన్న జూపల్లి.. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటారా..? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్