BIG STORY: సోనియా ఆత్మకథలో సంచలనాలు!

BIG STORY: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్' విడుదలైంది. 2004లో ప్రధాని పదవిని తిరస్కరించడం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలను ఆమె ఈ పుస్తకంలో వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Nov 2026 10:41 AM IST
BIG STORY
X

BIG STORY: సోనియా ఆత్మకథలో సంచలనాలు!

BIG STORY: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మ కథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన అనేక విశేషాలను ఆమె పొందుపరచారు. ఈ సందర్భంగా 2004లో ప్రధాని పదవి చేపట్టకపోవడం వెనుక ఉన్న అనేక ఆసక్తికరమైన అంశాలను ఆమె వివరించారు.

సోనియా గాంధీ వెల్లడించిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఘనవిజయం సాధించింది. దీంతో దేశ ప్రధానిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపడతారని అప్పట్లో అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆమె ప్రధాని పదవిని తిరస్కరించారు. అంతేకాదు, ప్రధాని పదవికి మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారు.

అయితే ప్రధాని పదవిని తాను వద్దనుకోవడం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదన్నారు సోనియా. 2004 లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందే తాను ప్రధాని పదవి చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు సోనియా తెలియచేశారు.

అంతేకాదు ఈ విషయాన్ని చర్చల సందర్భంగా రాహుల్, ప్రియాంకకు కూడా వెల్లడించినట్లు వెల్లడించారు. యూపీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రధాని అవుతారా? అని పిల్లలు అడిగినప్పుడు, 'కచ్చితంగా కాదు' అని సమాధానమిచ్చినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.

అప్పటికే తన కుటుంబం ఎన్నో విషాదాలను ఎదుర్కొందని సోనియా పేర్కొన్నారు. తాను ప్రధాని పదవి చేపడితే తనకు కూడా ప్రాణహాని ఉంటుందని పిల్లలు రాహుల్, ప్రియాంక ఆందోళన చెందేవారని ఆమె వివరించారు. అయితే ఎన్నికల సమయంలోనే తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తే పార్టీలో నాయకత్వంపై అనవసరపు చర్చలు మొదలవుతాయని భావించి మౌనంగా ఉన్నట్లు తెలిపారు.

కాగా ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించిన తర్వాత కూటమి నేతలు సోనియా నివాసానికి వచ్చి ఆమెనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు ఆత్మకథలో వివరించారు. వారి ఒత్తిడి మధ్య ఒక దశలో అస్పష్టంగా అంగీకరించినట్లు తెలిపారు. అయితే చివరకు ప్రధాని పదవి చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు సోనియా గాంధీ వెల్లడించారు.

మరోవైపు తన ఇటలీ మూలాలను బీజేపీ, దాని మిత్రపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటాయని ఆమె భావించారు. తాను ప్రధాని అయితే విదేశీ మూలాల అంశాన్ని తెరపైకి తెచ్చి దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించే అవకాశం ఉందని సోనియా ఆందోళన చెందారు.

తాను ప్రేమించే దేశానికి అలాంటి పరిస్థితి రావడం ఇష్టం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒక రోజు రాత్రంతా తీవ్రంగా ఆలోచించినట్లు సోనియా తెలిపారు. చివరకు తన అంతరాత్మ చెప్పిన మాటను అనుసరించి ప్రధాని పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు సోనియా వెల్లడించారు. మరుసటి రోజు ఉదయం రాహుల్ గదికి వెళ్లి తన నిర్ణయాన్ని చెప్పగా, ఇది సరైన నిర్ణయమని అభినందించినట్లు వివరించారు.

ప్రధాని పదవి చేపట్టకూడదన్న తన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రకటించినప్పుడు కూడా తీవ్ర పరిణామాలు ఎదురయ్యాయని సోనియా గుర్తుచేసుకున్నారు. సోనియా ప్రధాని కావాలని కోరుతూ ఎంపీలు పోడియం చుట్టూ చేరి నినాదాలు చేసినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.

దీంతో ఒక దశలో ఊపిరాడక స్పృహ తప్పినంత పనైందన్నారు. అధికారం తన లక్ష్యం కాదని, దేశ లౌకిక పునాదులను కాపాడటమే తన ప్రధాన ఉద్దేశమని పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. చివరకు తన నిర్ణయాన్ని అంగీకరించేలా వారిని ఒప్పించినట్లు సోనియా వివరించారు.

అయితే ప్రధాని పదవిని తిరస్కరించిన తర్వాత ఆ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే ప్రశ్న ఎదురైందని సోనియా తెలిపారు. కాంగ్రెస్‌లో పలువురు సీనియర్ నేతలు ఆ పదవికి అర్హులైనప్పటికీ మన్మోహన్ సింగ్ తనకు సరైన వ్యక్తిగా కనిపించారని ఆమె వివరించారు.

మన్మోహన్ సింగ్‌కు పాలనాపరమైన అంశాలపై లోతైన అవగాహన ఉందన్నారు.అంతేకాదు మన్మోహన్ వ్యక్తిత్వం, నిజాయతీపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. గతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.

అంతేకాకుండా మన్మోహన్ సింగ్ కాంగ్రెస్‌లోని ఏ వర్గానికీ అనుబంధంగా లేరని సోనియా తెలిపారు. యూపీఏ ప్రభుత్వానికి వామపక్ష పార్టీల మద్దతు ఉన్న నేపథ్యంలో ఆర్థిక విధానాల కొనసాగింపుపై ఎలాంటి సందేహాలు రాకుండా ఉండేందుకు ప్రధాని పదవికి మన్మోహన్ సరైన వ్యక్తిగా భావించినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా తన ఆత్మకథలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావన తీసుకువచ్చారు సోనియా గాంధీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తనకు వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదన్నారు ఆమె. అధికారిక కార్యక్రమాల్లో ఎదురుపడినప్పుడు పలకరింపులు తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ ఉండదన్నారు. ఎదురెదురుగా వచ్చినప్పుడు మోడీ నమస్కారం చేసినా, కళ్లలోకి చూడకుండా పక్కకు చూస్తారని తెలిపారు.

పార్లమెంట్‌లో ప్రసంగించే సమయంలోనూ మోడీ కొన్నిసార్లు బహిరంగ సభల్లో ఉపయోగించే కఠినమైన భాషనే వాడుతున్నారని సోనియా విమర్శించారు. ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించడంతో పాటు, తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై బీజేపీ వైఖరిని కూడా ఆమె ప్రస్తావించారు. 'కాంగ్రెస్‌ రహిత భారత్‌' అనే బీజేపీ నినాదం వెనక కాంగ్రెస్ సిద్ధాంతాలపై వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే,ఆత్మకథలో ఎమర్జెన్సీని సమర్థించే ప్రయత్నం చేశారని సోనియా పై బీజేపీ మండిపడింది. సదరు పుస్తకానికి బిలాంగింగ్ అని కాకుండా వైట్‌వాషింగ్ అని పేరు పెట్టి ఉండాల్సిందని బీజేపీ జాతీయ అధికారప్రతినిధి కేశవన్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా సోనియాకు కొన్ని ప్రశ్నలు సంధించారు.

బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో తాను ఏడ్చానని చెప్పుకున్న సోనియా, సిక్కుల ఊచకోత సందర్భంగా గురుద్వారాలపై దాడులు జరిగినప్పుడు, వేల మందిని హత్య చేసినప్పుడు ఒక్క కన్నీటి చుక్కైనా కార్చారా అని కేశవన్ ప్రశ్నించారు. బట్లా హౌస్ ఉగ్రవాదుల కోసం ఏడ్చిన ఆమె అమర జవాన్ల కోసం ఏనాడైనా కన్నీరు పెట్టారా అని మరో ప్రశ్న వేశారు.

ముంబయి ఉగ్రదాడుల్లో అమాయకులు బలైనప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆ తర్వాత పాకిస్తాన్ పై అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రతీకారం తీర్చుకోలేదో పుస్తకం జవాబు చెబుతుందా అని దుయ్యబట్టారు. 55ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ తీరని గాయాలు చేసిందని కేశవన్ ఘాటు ఆరోపణలు చేశారు. కాగా కాంగ్రెస్ తప్పిదాలను ప్రధాని నరేంద్ర మోడీ సరిదిద్దుతున్నారని కేశవన్‌ పేర్కొన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్