Off The Record: తెలంగాణలో శివసేన బీజేపీ పొత్తు ఖాయమేనా ?

Off The Record: తెలంగాణలో రాజకీయ విస్తరణపై శివసేన (షిండే వర్గం) దృష్టి పెట్టింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్న ఆ పార్టీ రాజకీయ పరిణామాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Oct 2026 11:22 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణలో శివసేన బీజేపీ పొత్తు ఖాయమేనా ?

Off The Record: తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఖైరతాబాద్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అలాగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఒకదాని తర్వాత ఒకటి జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించగా.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును తీవ్రం చేశాయి.

ఇదే సమయంలో అనూహ్యంగా మరో పార్టీ తెరపైకి వచ్చింది. "మేము కూడా ఎన్నికల బరిలో సిద్ధంగా ఉన్నాము" అంటున్న ఆ పార్టీ మరెవరో కాదు.. మహారాష్ట్రకు చెందిన ప్రాంతీయ పార్టీ, శివసేన.

జాతీయ స్థాయిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో భాగమైన ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన.. ఇప్పుడు తెలంగాణలోనూ తన రాజకీయ ప్రభావాన్ని చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2023 శాసనసభ ఎన్నికల్లోనూ శివసేన బీజేపీకి మద్దతు తెలిపింది. ముఖ్యంగా నగరంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ విజయం సాధించడంలో శివసేన ఓటు బ్యాంక్ కూడా కొంతవరకు కలిసి వచ్చిందనే టాక్ అప్పట్లో గట్టిగానే వినిపించింది.

అయితే ఈసారి సీన్ పూర్తిగా మారుతోంది. గతంలో లాగా కేవలం మద్దతు తెలపడానికే పరిమితం కాకుండా, ఈసారి ఎన్నికల్లో కొన్ని కీలక స్థానాల్లో నేరుగా పోటీ చేయాలని శివసేన డిసైడ్ అయిందట. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానంపై శివసేన కన్ను పడింది. ఈ స్థానం నుంచి శివసేన రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ పోటీ చేయాలని గట్టిగా భావిస్తున్నారట.

కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పటికే ఈ ఎమ్మెల్సీ స్థానంపై బీజేపీ తరఫున రాష్ట్ర నాయకులు ఆసక్తి చూపుతున్నారట. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తమ మిత్రపక్షమైన శివసేన అభ్యర్థిని అంగీకరిస్తుందా..? ఒకవేళ బీజేపీ గనుక అభ్యర్థిని నిలబెడితే, తాము ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతామనే ఆలోచనలో కూడా శివసేన ఉందంట. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ఓటర్లు గణనీయంగా ఉండటమే ఈ ధైర్యానికి కారణమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నిక గనుక అనివార్యమైతే.. ఆ స్థానానికి మాత్రం బీజేపీకి పూర్తి మద్దతు తెలిపేందుకు శివసేన సిద్ధమైందట. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్ లేదా ఇతర స్థానిక ఎన్నికల్లో మాత్రం కనీసం 20 శాతం సీట్లు తమకు కేటాయించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోందట.

దీనికోసం ఏక్‌నాథ్ షిండేను నేరుగా రంగంలోకి దింపి, బీజేపీ పెద్దలతో మాట్లాడించి.. మరాఠీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పక్కాగా సీట్లు సాధించాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నారట. ముఖ్యంగా పాతబస్తీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరాఠీ కుటుంబాలు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డాయి.

సుల్తాన్ బజార్, బడీ చౌడీ, కాచిగూడ, గౌలిగూడ, రామ్‌కోటి, లాల్ దర్వాజా, హరిబౌలి లాంటి ప్రాంతాల్లో మరాఠీ ప్రజల ప్రాబల్యం ఎక్కువే. అందుకే ఈ ప్రాంతాల నుంచి తమ పార్టీ అభ్యర్ధులను బరిలో దించాలని శివసేన టీమ్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేసిందట. కేవలం ఎన్నికల సమయమే కాకుండా, ఇప్పట్నుంచే కార్యకర్తలను యాక్టివేట్ చేయడం.. గ్రౌండ్ లెవెల్‌లో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలను కూడా ఆ పార్టీ ముమ్మరం చేసిందట.

మొత్తానికి చూస్తే కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, తెలంగాణలో మాత్రం తమకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు తెచ్చుకోవాలని శివసేన గట్టి పట్టుదలతో ఉందని చెబుతున్నారు రాజకీయ నిపుణులు. మరి బీజేపీతో చర్చలు జరిపి శివసేన కోరుకున్నట్లుగా టికెట్లు సాధించగలదా..? లేదా ఈ పొత్తుల పంచాయతీ ఎటు దారి తీస్తుంది..? శివసేన వేస్తున్న ఈ అడుగులు ఆ పార్టీకి బలానిస్తాయా లేక ఇబ్బందిగా మారుతాయా అనేది వేచి చూడాల్సిందే..!


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్