BIG STORY: డిసెంబర్ 16న ఢాకాకు హసీనా అట్టుడుకుతున్న బంగ్లా!
BIG STORY: డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు వెళ్లాలని షేక్ హసీనా నిర్ణయం? బంగ్లా మంత్రి తీవ్ర హెచ్చరికలు, తారిక్ రెహమాన్ భేటీలతో ఢాకాలో వేడెక్కిన రాజకీయ పరిణామాలివే.
BIG STORY: డిసెంబర్ 16న ఢాకాకు హసీనా అట్టుడుకుతున్న బంగ్లా!
BIG STORY: షేక్ హసీనా..పరిచయం అక్కర్లేని పేరు. బంగ్లాదేశ్ కు చాలా కాలం పాటు ప్రధాని హోదాలో ఆమె సేవలు అందించారు. అయితే విద్యార్థుల తిరుగుబాటు నేపథ్యంలో 2024లో ఆమె శరణార్థిగా భారత్ వచ్చారు. అప్పటినుంచి భారత్ లో ఆమె ఆశ్రయం పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో తిరిగి బంగ్లాదేశ్ కు వెళ్లాలని షేక్ హసీనా నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఇందుకు తేదీని కూడా ఆమె ఖరారు చేసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 16న బంగ్లాదేశ్ కు వెళ్లాలని షేక్ హసీనా డిసైడ్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఢాకా వెళ్లేందుకు ఆ దేశ జాతీయ విమానయాన సంస్థ బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో తన ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని షేక్ హసీనా కోరినట్లు రాజకీయ వర్గాల సమాచారం. అలాగే అందుకు అవసరమైన ప్రయాణ పత్రాలను సమకూర్చాలని రెహమాన్ ప్రభుత్వాన్ని కోరినట్లు హసీనా తెలియచేశారు.
కాగా 1971 విమోచన యుద్ధంలో పాకిస్థాన్‌పై దేశం సాధించిన విజయం సందర్భంగా ప్రతి ఏడాది డిసెంబర్ 16న బంగ్లాదేశ్ లో విక్టరీ డే నిర్వహిస్తారు. అదే రోజును తిరిగి స్వదేశానికి వెళ్లడానికి హసీనా ఎంపిక చేసుకోవడం విశేషం. హసీనా తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ రాజకీయాలకు సంబంధించి ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, స్వదేశమైన బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లడానికి మాజీ ప్రధాని షేక్ హసీనా కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని ఆమె బంగ్లాదేశ్ సర్కార్‌ను కోరారు. మరోవైపు ఆమెను స్వదేశానికి పంపాలంటే ఆ దేశం తమ సైనిక విమానాన్ని పంపాలని అలాగే ఇరు దేశాల భూ సరిహద్దు మార్గంలో పొరుగు దేశ సైన్యం హసీనాను మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలని భారత్ షరతులు విధించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఒక ఉగ్రవాదిగా చేతులకు సంకెళ్లతోనే హసీనా బంగ్లాదేశ్ లో అడుగుపెట్టాల్సి ఉంటుందని ఆదేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ వ్యాఖ్యానించారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్ ప్రజలకు తెలిసిన ఒకే ఒక్క ఉగ్రవాదం హసీనా ప్రోత్సహించిన ‘అవామీ ఉగ్రవాదం అని ఆయన ఆరోపించారు. అంతేకాదు హసీనాను పరారీలో ఉన్న ఒక దోషి అని, పరారీలో ఉన్న ఉగ్రవాది అని కబీర్ అభివర్ణించారు. అయితే హసీనా రాకపై బంగ్లా ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.
ఇదిలా ఉంటే, హసీనాను పదవి నుంచి తొలగించడానికి దారితీసిన 2024 జులై-ఆగస్టు నిరసనల నుంచి ఉద్భవించిన విద్యార్థుల నేతృత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ నాయకులతో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చర్చలు జరిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నాటు బాంబుల పేలుళ్లు, దహనాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో హసీనా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న రాజకీయ బృందాలతో రెహమాన్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
నేషనల్ సిటిజన్ పార్టీ కన్వీనర్ నహీద్ ఇస్లాం నేతృత్వంలోని నలుగురు సభ్యుల ప్రతినిధి బృందం రెహమాన్‌తో సమావేశమైంది. మొత్తంమీద బంగ్లాదేశ్ రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు.




