Burning Topic: రష్యా జీవాయుధాలు తయారు చేస్తోందా!
Burning Topic: రష్యాలో యాంటీ-ప్లేగ్ ల్యాబ్ పరిశోధకురాలు న్యుమోనియాతో మృతి చెందడం కలకలం రేపింది. దాదాపు 200 మందిని క్వారంటైన్‌లో ఉంచడంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Burning Topic: రష్యా జీవాయుధాలు తయారు చేస్తోందా!
Burning Topic: రష్యాలో ఓ అనుమానాస్పద అంటువ్యాధి కేసు కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 29న షెలెఖోవ్‌లోని ఆసుపత్రిలో 28 ఏళ్ల యువతి తీవ్రమైన న్యుమోనియా లక్షణాలతో చేరారు. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఆ తర్వాత రెండు రోజులకే మరణించారు. కాగా ఈ యువతి పేరు డారియా షిపిలోవా. ఆమె సైబీరియాలోని ఇర్కుట్స్క్ దగ్గర ఉన్న యాంటీ–ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే మహిళా పరిశోధకురాలు. ఆమె ప్రమాదకర బ్యాక్టీరియాకు గురై ఉండొచ్చన్న అనుమానాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. డారియా షిపిలోవాతో ఈ మధ్య కాలంతో కాంటాక్ట్‌లో ఉన్న దాదాపు 200 మందిని డాక్టర్ల పర్యవేక్షణలో క్వారంటైన్‌లో ఉంచారు. ఈ ఘటన బయటకు రావడంతో అసలు డారియాకు ఏం జరిగింది? ల్యాబ్‌లో ప్రమాదం జరిగిందా? ఏదైనా ప్రమాదకర వ్యాధికారక క్రిమికి ఆమె గురయ్యారా? అనే ఆందోళలు మొదలయ్యాయి.
డారియా షిపిలోవా తన మరణానికి కొద్ది సేపటి క్రితం చెప్పిన వివరాల ప్రకారం.. యాంటీ–ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో నమూనాలను పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ లైవ్ బ్యాక్టీరియా ఉన్న టెస్ట్‌ట్యూబ్ పగిలింది. ఆ తర్వాతే ఆమె అనారోగ్యానికి గురైనట్లు చెబుతున్నారు. డారియా మరణానికి ప్లేగ్ కారణమై ఉండొచ్చన్న అనుమానాలు అప్పటి నుంచే మొదలయ్యాయి. దీంతో డారియాతో సన్నిహితంగా ఉన్న 197 మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. వీరిలో 100 మందికిపైగా ఆసుపత్రుల్లోనే ఉన్నట్లు సమాచారం. ఇర్కుట్స్క్‌లో నాలుగు ఆసుపత్రుల్లో క్వారంటైన్ విధించినట్లు రష్యన్ మీడియా చెబుతోంది. రోగులను సందర్శించడంపైనా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసినట్లు సమాచారం. అయితే రష్యా ప్రజారోగ్య సంస్థ మాత్రం ఆ పరిశోధనా కేంద్రంలో అలాంటి ప్రమాదమేమీ జరగలేదని పేర్కొంది.
యాంటీ–ప్లేగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉన్న ఇర్కుట్స్క్ ప్రాంతం మంగోలియాకు సమీపంలో ఉంటుంది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు రష్యా చీఫ్ శానిటరీ డాక్టర్ అన్నా పోపోవా ఇర్కుట్స్క్ వెళ్లారు. పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారామె. ఈ ప్రాంతంలో బహిరంగ కార్యక్రమాలకు రద్దు చేశారు. ల్యాబొరేటరీకి సమీపంలో ఉన్న ఓ అల్యూమినియం కర్మాగారం ఉద్యోగులు మాస్కులు ధరించాలని ఆదేశించారు. మరోవైపు డారియా షిపిలోవా క్షేత్ర స్థాయి పరిశీల కోసం బురియాటియా ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి వెళ్లినప్పటి నుంచీ ఆమె అనారోగ్యానికి గురయ్యారని చెబుతున్నారు. అయితే బురియాటియా ప్రాంత గవర్నర్ అలెక్సీ సిడెనోవ్ ఈ వాదనను ఖండించారు. డారియా బురియాటియాను సందర్శించినట్లు ఆధారాలు లేవని, ఆ ప్రాంతంలో ప్లేగ్ వ్యాప్తి లేదని ఆయన తెలిపారు. దీంతో ఇన్ఫెక్షన్‌కు మూలం బురియాటియాకు సంబంధం లేని పరిస్థితుల్లో ఉండొచ్చని పేర్కొన్నారు.
కాగా డారియా షిపిలోవా మృతికి నిజంగా ప్లేగు కారణమా? అనే ప్రశ్న వినిపిస్తోంది. బుర్యాతియా గవర్నర్ అలెక్సీ సిడెనోవ్.. ఆమె ‘బహుశా ప్లేగుతో మృతి చెంది ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అదే సమయంలో బుర్యాతియాలో ఎలాంటి ప్లేగు వ్యాప్తి లేదని కూడా స్పష్టం చేశారు.. ప్లేగ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను యెర్సినియా పెస్టిస్ అంటారు. సాధారణంగా ఈ వ్యాధి మూడు ప్రధాన రూపాల్లో కనిపిస్తుంది. అవి బుబోనిక్, సెప్టిసిమిక్, న్యుమోనిక్ ప్లేగ్. వీటిలో న్యుమోనిక్ ప్లేగ్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇతర ప్లేగ్ రూపాలతో పోలిస్తే ఇది వేగంగా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. సోకిన వ్యక్తి నుంచి శ్వాసకోశ బిందువుల ద్వారా మరొకరికి వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. మధ్యయుగ కాలంలో యూరప్‌లో కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్న ‘బ్లాక్ డెత్’కు కూడా యెర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియానే కారణమైంది.
రష్యా ప్రభుత్వం ప్లేగ్ వ్యాప్తిని అధికారికంగా ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి సమస్య లేదని చెబుతూనే అధికారుల భరోసా కలిగించే ప్రకటనలకు, ఘటనపై వెలువడుతున్న ఆందోళనకర కథనాలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటికైతే.. రష్యాలో ప్లేగు వ్యాప్తి జరిగిందని నిర్ధారణ లేదు. అయితే ప్రమాదకర అంటువ్యాధులపై పరిశోధనలు జరిగే కేంద్రంలోనే పరిశోధకురాలు తీవ్ర న్యూమోనియాతో మృతి చెందడం, వందల మందిని పర్యవేక్షణలో ఉంచడం ఆందోళనకు కారణమవుతోంది. మంగోలియా సరిహద్దుకు సమీపంలో ఉన్న సైబీరియాలోని ఇర్కుట్స్క్‌లో సోవియెట్ యూనియన్ కాలంలో యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్మించారు. అంటువ్యాధి కారకాలను అధ్యయనం చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు. తూర్పు ఆసియా, సైబీరియా ప్రాంతాల్లోని జంతువుల నుంచి వేరు చేసిన ప్లేగు, ఆంథ్రాక్స్ వంటి వ్యాధి కారకాలను, వాటి ప్రమాదకర వేరియంట్లను ఇక్కడ నిల్వ చేశారు.
యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సోవియెట్ యూనియన్ కాలం నుంచే ఇక్కడ జీవాయుధ కార్యక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలున్నాయి. అప్పట్లో సోవియెట్ ఆర్మీ బయోవెపన్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌కు ఈ ల్యాబ్ నమూనాలను అందించినట్లు గతంలో పలు అధ్యయనాలు వెలువడ్డాయి.సోనియెట్ కాలంలో ఇలాంటివి దాదాపు 80 ల్యాబ్‌లను నిర్మించారు. ఇవన్నీ వేలాదిగా వ్యాధి కారకాలు, వాటి వేరియంట్లను సేకరించి భద్రపర్చాయి. అయితే, 1991లో సోవియెట్ యూనియన్ కూలిపోయిన తర్వాత.. ఈ ల్యాబ్‌లకు నిధుల కొరత ఏర్పడింది. మరమ్మతులు కూడా చేయించలేని స్థితికి దిగజారగా, అమెరికా మద్దతున్న కొన్ని సంస్థలు ముందుకొచ్చి బాగుచేయించాయి. తాజాగా రష్యాకు ఈ పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉంటామని,అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఈ జీవాయుధాల అంశం తెరపైకి వచ్చింది. అమెరికా మద్దతుతో కీవ్ బయోవెపన్స్ లాబొరేటరీలను నిర్వహిస్తోందని అప్పట్లో రష్యా ఆరోపించింది. అయితే దీన్ని అమెరికా ఖండించింది. రష్యా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని, వాస్తవానికి ఆ దేశమే జీవాయుధాలపై ప్రయోగాలు చేపట్టిందని ఆరోపించింది. ఇందుకు సంబంధించి 2025 ఏప్రిల్‌లో అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక కూడా విడుదల చేసింది. తాజాగా సైబీరియా ల్యాబ్ నుంచి ప్లేగు బ్యాక్టీరియా లీకైన నేపథ్యంలో అమెరికా సీఐఏ మాజీ డైరెక్టర్ మైక్ పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్నేళ్ల కిందట చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో కొవిడ్-19 వైరస్ లీకై ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు రష్యా నుంచి ప్లేగు బ్యాక్టీరియా లీక్‌ను కూడా చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాలి’’ అని ఆయన పేర్కొనడం గమనార్హం.




