Off The Record: లోకేష్ కి అడ్డంగా దొరికిన బై రెడ్డి, రోజా.. బయటపడ్డ 40 కోట్ల స్కాం

Off The Record: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 'ఆడుదాం ఆంధ్ర' క్రీడల నిర్వహణలో భారీ అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 April 2026 6:38 AM IST
Off The Record
X

Off The Record: లోకేష్ కి అడ్డంగా దొరికిన బై రెడ్డి, రోజా.. బయటపడ్డ 40 కోట్ల స్కాం

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల ముసుగులో కాసుల వేట సాగిందా..? ఆడుదాం ఆంధ్రా పేరుతో అప్పటి పాలకులు కోట్ల రూపాయల ప్రజా ధనంతో ఆడుకున్నారా అంటే.. అవుననే అంటోంది ఏపీ విజిలెన్స్ సంచలన నివేదిక. క్రీడా పరికరాల కొనుగోలు నుంచి భోజనాల బిల్లుల వరకు.. ప్రతిచోటా అందినకాడికి దండుకున్నారని, పక్కా ఆధారాలతో సహా రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది. గత వైసీపీ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ అవినీతి చోటు చేసుకుందని విపక్షాలు అప్పట్లోనే గొంతు చించుకున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు వాస్తవాలను బట్టబయలు చేశారు. ఈ నివేదికతో మాజీ మంత్రి రోజా, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డితో సహా కొందరు అప్పటి ఐఏఎస్ అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది.

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై విజిలెన్స్ శాఖ ఏకంగా 3 వేల పేజీల రిపోర్టును ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 600కి పైగా ప్రాంతాల్లో, వందలాది మందిని విచారించిన అధికారులు.. అక్రమాల చిట్టాను బయటకు తీశారు. ప్రధానంగా మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి పాత్రపై పూర్తి ఆధారాలు సమర్పించినట్లు ప్రచారం సాగుతోంది. వీరితో పాటు అప్పటి శాప్ ఇన్ఛార్జి ఎండీ హర్షవర్ధన్, అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వాణీమోహన్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిటీ సిఫారసు చేసింది. రోజా, బైరెడ్డిలపై ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు టాక్. ఆడుదాం ఆంధ్రా పేరిట మొత్తం 100 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టినట్లు అధికారులు నిర్ధారించడం ఇప్పుడు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ప్రతి స్థాయిలోనూ అసలు కేటాయింపుల కంటే రెండింతలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించారు అనేది విజిలెన్స్ అభియోగం. కొన్ని జిల్లాల్లో గ్రామస్థాయిలో జరిగిన ఆటల కోసం కూడా కోట్లల్లో ఖర్చు చేసినట్లు బిల్లులు సృష్టించినట్టు దర్యాప్తు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. టెండర్ల ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కడం మొదలుకొని.. ఆటగాళ్లకు నాసిరకం పరికరాల సరఫరా, వసతి, భోజనాల నిధుల్లోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపిస్తోంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ అక్రమాలకు పాల్పడ్డారని రిపోర్టు తేల్చింది. ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి‌ కూడా ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారు. క్రీడలను ప్రోత్సహించే పేరుతో పేద క్రీడాకారుల పొట్ట కొట్టారని, వారి భవిష్యత్తుతో ఆడుకున్నారని మండిపడుతున్నారు. ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి విచారణను సీఐడీ లేదా ఏసీబీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సెక్రటేరియట్ వర్గాల సమాచారం.

అరెస్ట్ సంగతి ఏమో కానీ.. అటాకింగ్ మాత్రం ఆపనంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఒకవైపు ఆడుదాం ఆంధ్రా స్కామ్ లో విజిలెన్స్ ఉచ్చు బిగుస్తోందని.. ఏ క్షణమైనా అరెస్ట్ తప్పదన్న ప్రచారం జరుగుతున్నా, ఫైర్ బ్రాండ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన చుట్టూ ఉచ్చు బిగుస్తున్న కొద్దీ, కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడిని మరింత తీవ్రం చేస్తున్నారు రోజా. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజలను మోసం చేస్తున్నారని, ఎన్నికల హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారని రోజా మండిపడుతున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నగరి ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ఐదేళ్లు నగరి ప్రజల రక్తం తాగిన ఘనత రోజాదే అని, అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు. నువ్వు చేసిన అవినీతి పుట్ట పగిలింది.. నీ పాపాల చిట్టా పాలకుల చేతికి చేరింది.. జైలుకు వెళ్లడం ఖాయం, బట్టలు సర్దుకో అంటూ గాలి భానుప్రకాష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మొత్తానికి అటు దర్యాప్తు సంస్థల రిపోర్టులు, ఇటు అధికార పార్టీ నేతల కౌంటర్లతో రోజా వర్సెస్ కూటమి వార్ పీక్స్ కు చేరుకుంటోంది. మరి అరెస్ట్ వార్తలను సైతం లెక్కచేయకుండా సై అంటున్న రోజాను.. ప్రభుత్వం ఏ కేసులో, ఎప్పుడు బుక్ చేస్తుందన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే బిగ్ సస్పెన్స్.

ఇక ఈ ఎపిసోడ్ లో అందరి దృష్టి మాజీ మంత్రి రోజాపైనే ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. అసభ్య పదజాలంతో దూషించిన సందర్భాలు కోకొల్లలు. అయితే అధికారం కోల్పోయాక కొన్నాళ్లు సైలెంట్ అయిన రోజా... ఈ మధ్య మళ్లీ కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు. సరిగ్గా ఈ టైమ్ లోనే ఆడుదాం ఆంధ్రా నివేదిక రావడంతో.. రోజా అరెస్ట్ తథ్యం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే విచారణలో ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చంద్రబాబు, లోకేశ్ చెబుతున్నా.. రోజా లాంటి ఫైర్ బ్రాండ్ అరెస్ట్ అయితే టీడీపీ శ్రేణులకు పండుగేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి విజిలెన్స్ ఇచ్చిన ఈ అస్త్రాన్ని ప్రభుత్వం ఎప్పుడు, ఎలా ప్రయోగిస్తుందో వేచి చూడాలి.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story