Off The Record: బీఆర్ఎస్ లైట్ పాలిటిక్స్!

Off The Record: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై సీఎం రేవంత్ విచారణ ఆదేశాలు. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేతలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Sept 2026 7:15 AM IST
Off The Record
X

Off The Record: బీఆర్ఎస్ లైట్ పాలిటిక్స్!

Off The Record: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతిపక్ష నేతగా ఫామ్ హౌస్‌కి పరిమితమవుతున్నారని అటాకింగ్ ప్రారంభించిన అధికార పార్టీ తర్వాత ఫామ్ హౌస్ ముట్టడికి పిలుపునిచ్చింది. దాంతో దళితులు ఫామ్ హౌజ్ దగ్గరికి వెళ్లడంతో అక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేశారని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి సంబంధించిన భూములు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ పరిసర ప్రాంతాల్లోని భూములు, ధరణిలో జరిగినట్లు ప్రభుత్వం చెబుతున్న అవకతవకలను ప్రస్తావించారు. ఫామ్‌హౌస్‌ చుట్టూ సుమారు 700 ఎకరాల వ్యవహారంపై విచారణకు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు పొలిటికల్‌గా హాట్‌టాపికైంది. అంతేకాదు అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయన్నది సీఎం చేసిన ప్రధాన ఆరోపణ. అయితే ఆ భూములు ఎవరివి..? ఎప్పుడు ఎవరి పేర్లపైకి వెళ్లాయి..? రికార్డుల్లో ఏం ఉంది..? ధరణిలో ఏమైనా మార్పులు జరిగాయా..? అన్నది అధికారిక విచారణలో తేలాల్సిన అంశాలు. కానీ ఇంతటి పెద్ద ఆరోపణలు వచ్చినా బీఆర్ఎస్‌ మాత్రం పెద్దగా ఆందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు. ఆరోపణలు వేరు.. విచారణలు చేయడం వేరు, ఆ ఆరోపణలను నిరూపించడం వేరన్న ధీమాతో గులాబీ పార్టీ ఉందట.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్, ఫోన్‌ట్యాపింగ్‌‌పై సిట్ విచారణ, ఈ-కార్‌ రేస్‌‌పై ఏసీబీ విచారణ, విద్యుత్‌ కమిషన్‌.. ఇలా గతంలో ఎదుర్కొన్న విచారణల లాగే ఈ విచారణ కూడా చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టుగా ఉంటుందనే ధోరణిలో ఉందట గులాబీ పార్టీ. పైగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలకు సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతోంది బీఆర్ఎస్ అధిష్టానం. సీఎం ఆరోపణలు చేయగానే గులాబీ పార్టీ అంతే స్పీడుగా విచారణకు మేం భయపడేది లేదనీ స్పష్టం చేస్తోంది. అంతటిఆగని కేసీఆర్‌, కేటీఆర్.. తన భూములపైనా, ధరణి వ్యవహారంపైనా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు ప్రభుత్వం సిద్ధమా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డికే సవాల్‌ విసిరారు. ప్రభుత్వం దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని కేటీఆర్, హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపైనా విచారణకు సిద్ధమా అంటూ రాజకీయంగా రేవంత్‌ను ఇరకాటంలో పెట్టారనే చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్‌ ఈ వ్యవహారాన్ని ఎందుకు లైట్‌గా తీసుకుంటోందన్న చర్చకు మరో కారణం కూడా ఉందంటున్నాయి గులాబీ వర్గాలు. గత కొంతకాలంగా బీఆర్ఎస్‌ నేతలు పదేపదే చెబుతున్న మాట ఒక్కటే విచారణలు కొత్త కాదని. కాళేశ్వరం కమిషన్, ఫోన్‌ట్యాపింగ్‌ సిట్ వ్యవహారం, ఈ-కార్‌ రేస్‌ ఏసీబీ కేసు, విద్యుత్‌ కమిషన్‌.. ఇలా గతంలో కూడా బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై విచారణలు జరిగాయి. కేసులు నమోదయ్యాయి. రాజకీయ ఆరోపణలు జరిగాయి. చివరికి విచారణలో తేలింది మాత్రం శూన్యం అని అంటోంది గులాబీ పార్టీ. ఇప్పుడు భూముల విచారణ అంశంలో కూడా భయపడాల్సిన అవసరం లేదన్న ధీమాతో గులాబీ పార్టీ ముందుకు వెళ్తోందట.

ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం అంటే ధరణి, 22A ,అసైన్డ్‌ ల్యాండ్స్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ ఇలాంటి అంశాల చుట్టూనే తిరిగింది. కానీ ఇప్పుడు.. కథ నేరుగా కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ గేటు దాకా వచ్చింది. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు రావాలంటూ సవాల్‌ చేసింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది..? ప్రభుత్వ విచారణనే ముందుకు తీసుకెళ్తుందా..? బీఆర్ఎస్‌ డిమాండ్‌ చేసినట్టుగా మరింత సిట్టింగ్ జడ్జ్‌తో విచారణకు వెళ్తుందా అనేది ఆసక్తి గా మారింది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ చుట్టూ మొదలైన భూముల రాజకీయం.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు.. ప్రభుత్వ భూములుంటే స్వాధీనం చేసుకుంటామని సీఎం రేవంత్ అంటున్నారు. మరోవైపు.. ఆరోపణలు కాదు, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపండి అని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్‌. ఈ రెండు సవాళ్ల మధ్య.. ఎర్రవల్లి భూముల అసలు రికార్డులు ఏం చెబుతాయి.. విచారణ మొదలైతే సీఎం ఆరోపణలకు బలం చేకూరుతుందా.. లేక.. బీఆర్ఎస్‌ చెబుతున్నట్టుగా ఆరోపణల్లో నిజం లేదన్న విషయం బయటపడుతుందా..? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ వద్ద రెవెన్యూ అధికారులు సర్వేను ప్రారంభించారట. ఈ వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్