Off The Record: 2028 ఎన్నికల పై పొన్నంకు సవాల్ .. కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి ?
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాబోయే ఎన్నికలు కీలకం. ఖైరతాబాద్ ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదుర్కొంటున్న సవాళ్లు.
Off The Record: 2028 ఎన్నికల పై పొన్నంకు సవాల్ .. కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి ?
Off The Record: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు పొన్నం ప్రభాకర్. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ పటిష్టత కోసం అంకితభావంతో పనిచేస్తున్న నేత ఆయన. NSUI విద్యార్థి సంఘం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పొన్నం.. అంచెలంచెలుగా పార్టీలో వివిధ కీలక హోదాల్లో పనిచేశారు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా ఘనవిజయం సాధించి జాతీయ స్థాయిలో తన ముద్ర వేశారు.
ఆ తర్వాత కాలంలోనూ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న ప్రభాకర్.. 2023 శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు ముఖ్యమైన రవాణా శాఖ మంత్రి బాధ్యతలతో పాటు, అత్యంత వ్యూహాత్మకమైన హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాధ్యతలు కూడా అప్పగించారు. అప్పటి నుంచి ఆయన తన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు.
ఇన్నాళ్లు ఒక పద్ధతిలో సాగిన రాజకీయ ప్రయాణం ఒక ఎత్తైతే.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అసలైన అగ్నిపరీక్ష ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో జరిగిన కొన్ని ఉపఎన్నికలను విజయవంతంగా నడిపించడంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు రాబోయే ఖైరతాబాద్ ఉపఎన్నిక ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన టాస్క్‌గా మారింది.
ఈ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సత్తాను రాష్ట్రవ్యాప్తంగా చాటాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2028లో జరగబోయే సాధారణ ఎన్నికలకు దీనిని ఒక బలమైన పునాదిగా మలుచుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. తనదైన శైలిలో పక్కా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో, దాన్ని అనుకూలంగా మార్చుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు అదే సామాజికవర్గానికి చెందిన నేతగా పొన్నం ప్రభాకర్. అంతేకాకుండా.. మైనారిటీ వర్గాలతో ఆయనకు ఉన్న మంచి సత్సంబంధాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత కలిసివచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పైగా బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలచుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారట మంత్రి పొన్నం.
ఖైరతాబాద్ ఉపఎన్నిక ముగిసేలోపే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మజ్లిస్ పార్టీకి బలమైన పట్టు ఉండటంతోపాటు, కొన్ని ప్రాంతాల్లో వారు ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం కూడా లేకపోలేదు.
అలాంటి చోట్ల అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచి ప్రచారం వరకు ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సి ఉంటుంది. కేవలం పాతబస్తీ మాత్రమే కాకుండా, మిగతా వార్డుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేయడం పొన్నం ప్రభాకర్‌కు పెద్ద టాస్కే అని చెప్పాలి. దీనికితోడు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పాలనా విధివిధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు, గత కొన్ని నెలల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపించి తన టీమ్‌ను గెలిపించే బాధ్యత ప్రభాకర్‌పై ఉంది.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చి, ఎక్కువ కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకోవడమే పొన్నంకు అసలైన టార్గెట్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ యుద్ధానికి సెమీఫైనల్స్ లాంటివని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
కార్పొరేషన్ ఎన్నికల హడావుడి ముగిసేలోపు, వచ్చే మార్చిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. ఇది కూడా ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఘట్టమే. ఈ మూడు జిల్లాల పరిధిలో పెద్ద సంఖ్యలో విద్యాధికులు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓటర్లుగా ఉండే ఈ స్థానం ప్రస్తుతం బీఆర్ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థి చేతిలో ఉంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకుని, తమ ఖాతాలో వేసుకోవడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడే తెరవెనుక కసరత్తులు ప్రారంభించారని టాక్.
అయితే.. మూడు జిల్లాల పరిధి కావడంతో.. మిగతా రెండు జిల్లాల మంత్రులతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారట. ఇలా ఉండగా.. హైదరాబాద్ పరిధిలో ఎక్కువ ఓట్లు సాధించేలా ఇప్పటి నుంచే పొన్నం ప్రణాళికలు రచిస్తున్నారు. అందరికంటే ముందుగానే గ్రాడ్యుయేట్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట.
2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాబోయే ఈ మూడు ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. హైదరాబాద్‌ను కైవసం చేసుకోవడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. పార్టీ అధిష్టానం దృష్టిలో ఇప్పటికే మంచి పేరున్న పొన్నం..
ఈ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేరిస్తే ఆ పేరు మరింత రెట్టింపు అవుతుందని ఆయన అనుచరులు బలంగా లెక్కలు వేసుకుంటున్నారట. ఏదేమైనా, గ్రేటర్ హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్‌కు ఈ ఆరు నెలల కాలం కేవలం సాధారణ బాధ్యత కాదు.. ఆయన రాజకీయ వ్యూహ చతురతకు అసలు సిసలైన అగ్నిపరీక్ష అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి.. పొన్నం ప్రభాకర్ ఈ అగ్నిపరీక్షను ఎదుర్కొని.. కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా విజయతీరాలకు చేరుస్తారో చూడాలి.




