Off The Record: తూతూ మంత్రంగా ఒంగోలు 150 ఏళ్ల ఉత్సవాలు!
Off The Record: ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల ఉత్సవాలు నిరాశజనకంగా ముగియడంపై నగరవాసుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అధికారుల ప్రణాళికా లోపాలపై ప్రత్యేక కథనం.
Off The Record: తూతూ మంత్రంగా ఒంగోలు 150 ఏళ్ల ఉత్సవాలు!
Off The Record: ప్రపంచ పటంలో ఒంగోలు పేరును చిరస్థాయిగా నిలబెట్టింది మన ‘ఒంగోలు జాతి పశువులు. బలం, ఓర్పు, సత్తాకు ప్రతీకగా నిలిచిన ఈ జాతి.. మన నేల ఖ్యాతిని దేశ సరిహద్దులు దాటి ప్రపంచానికి చాటిచెప్పింది. గతాన్ని గౌరవిస్తూ, వర్తమానాన్ని నడిపిస్తూ, భవిష్యత్తును నిర్మించుకుంటున్న ఒంగోలు ప్రయాణం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఒంగోలు.. మున్సిపాలిటీగా ఏర్పడి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తయ్యాయి.
ఒక నగరం గర్వంగా చెప్పుకునే ఈ శతాబ్దంన్నర సందర్భాన్ని ఒక మహోత్సవంగా, అద్భుతమైన పండుగలా జరుపుకోవాలని ఒంగోలు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ‘ఒంగోలు నాది’ అని గర్వంగా చెప్పుకునే ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ, నగర చరిత్రను నలుదిశలా చాటిచెప్పేలా, రాష్ట్రం మొత్తం ఒంగోలు వైపు చూసేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారని ప్రజలు భావించారు. గతంలో ప్రకాశం జిల్లాలో పనిచేసిన పలువురు కలెక్టర్లు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు వారి ప్రత్యేక ముద్రతో ఎప్పటికీ నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు.. 150 ఏళ్లకు ఒక్కసారి వచ్చిన ఈ అరుదైన చారిత్రక అవకాశాన్ని, ప్రస్తుత కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలోని అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుందా..? అన్నదే ఇప్పుడు నగరవాసుల్లో జరుగుతున్న ప్రధాన చర్చ.
నెల రోజుల ముందు నుంచే 150 సంవత్సరాల సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేశారు అధికారులు. కానీ చివరికి వచ్చేసరికి... కేవలం ఒక్క రోజుతో ఈ సంబరాలను ముగించెయ్యడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ చారిత్రక వేడుకలకు ముందు నగరంలో చెత్త సేకరణ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు, చెత్త సేకరణకు సంబంధం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నగరంలో ఒకే రోజు 150 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు గానీ, ఆ కార్యక్రమం కూడా ఏదో తూతూ మంత్రంగానే ముగిసిపోయింది. మొన్న నిర్వహించిన ‘హెరిటేజ్ రన్’ ఒక్కటే ప్రజల్లోకి కొద్దిగా వెళ్లింది. నగరంలోని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడంతో అది విజయవంతమైంది. ఇక ఒంగోలు ఉత్సవం పేరుతో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కార్యక్రమాన్ని నెట్టుకొచ్చారు. అయితే, ఈ వేడుకలకు ముగింపు టచ్‌గా ఏర్పాటు చేసిన ‘ఒంగోలు గిత్తల అందాల ప్రదర్శన’, గిత్తల ర్యాలీ మాత్రం ఎంతో ఆకట్టుకుని చెప్పుకోదగిందిగా నిలిచింది.
ఒంగోలు నగరం నుంచి దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్న ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. విద్య, వైద్య, నాటక, సినీ, పారిశ్రామిక, వ్యాపార, రచయితలు, రాజకీయ రంగాల ఇలా ప్రతి రంగంలోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు ఎందరో ఉన్నారు. కానీ, 150 ఏళ్ల చారిత్రక ఉత్సవాలకు కనీసం వారిని ఆహ్వానించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. నగరంలోని శర్మా కాలేజీలో చదువుకున్న మెగాస్టార్ చిరంజీవి, తన రాజకీయ సమావేశాల్లో ఒంగోలుతో అనుబంధాన్ని పలుమార్లు ప్రస్తావించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఒంగోలులో పెరిగిన స్టార్ డైరెక్టర్ టీ.కృష్ణ, సినీ నటుడు మాదాల రంగారావు, దర్శకుడు మల్లెల గోపీచంద్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేసి, ప్రజల గుండెల్లో నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ, రాజకీయ దిగ్గజాలు కరణం బలరాం, బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సిద్ధా రాఘవరావు తదితరులను సమన్వయం చేసుకోవడం మాట అటుంచితే, కనీసం ఆహ్వానం పంపకపోవడం, ఆహ్వాన పత్రికలో వారి పేర్లను కూడా ప్రస్తావించకపోవడం విస్మయానికి గురిచేస్తోందట. అసలు ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తు ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారిదే కదా..? అన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. మరి ఈ లోపాలు ఎందుకు జరిగాయి?
నగరంలో నిర్వహించిన ఈ ఒంగోలు ఉత్సవాలు.. నిజంగా ఒంగోలు నగరానికి సంబంధించిన అందరి పండుగనా..? లేక కూటమి పార్టీ నేతలకే పరిమితమైన కార్యక్రమంగా మారిపోయిందా..? అన్న మరో తీవ్రమైన ప్రశ్న కూడా ప్రజల నుంచి వస్తోంది. ఒక నగరం ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎంతోమంది నాయకులు, ప్రజలు చేసిన కృషి ఉంటుంది. అయితే, కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన ఆహ్వాన కమిటీలో కేవలం కూటమి పార్టీలకు చెందిన నేతలకే ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. ఇప్పుడు జరిగిన తీరు చూస్తే.. అప్పట్లో వ్యక్తమైన అనుమానాలే నిజమయ్యాయనే అభిప్రాయం బలపడిందంటున్నారు పరిశీలకులు. 150 ఏళ్ల చరిత్రను ప్రతిబింబించాల్సిన ఉత్సవాలు... అన్ని వర్గాల భాగస్వామ్యంతో నగర పండుగగా మారడంలో ఎందుకు విఫలమయ్యాయన్న ప్రశ్న అందరి మదిని తొలిచేస్తోందట.
150 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంతటి ఘనమైన ఉత్సవాన్ని దేశం నలుమూలలకు చాటిచెప్పే మీడియా ప్రచారం ఎక్కడ జరిగిందనే ప్రశ్న కూడా ఉంది. ఒక నగరానికి శతాబ్దంన్నర చరిత్ర ఉందని బయట ప్రపంచానికి తెలియాలంటే మీడియానే ప్రధాన వేదిక. రెండు ప్రెస్‌మీట్లు పెట్టడం, రెండు మూడు వీడియోలు రికార్డు చేసి వాట్సాప్ గ్రూపుల్లో పంపించడంతోనే ప్రచారం ముగిసిపోయిందా..? అని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. నిధుల కొరత ప్రధాన సమస్య అయితే... ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు సమీకరించే అవకాశం లేదా? అని కూడా గుర్తు చేస్తున్నారు. అన్నీ ఉన్నా ఒంగోలు చరిత్రను రాష్ట్ర, జాతీయ స్థాయిలో చాటిచెప్పే స్థాయిలో ప్రచారం జరగకపోవడం అధికారుల ప్రణాళికా లోపమా, సమన్వయ లోపమా, లేక నిర్లక్ష్యమా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మొత్తం మీద 150 ఏళ్ల ఒంగోలు చరిత్రను ఘనంగా చాటిచెప్పాల్సిన ఈ ఉత్సవం. నగరవాసులకు, ఒంగోలుతో అనుబంధం ఉన్నవారికీ ఆశించిన స్థాయి ఉత్సాహాన్ని అందించలేకపోయిందనే చెప్పాలి. అరుదైన అవకాశం చేతికొచ్చినా, చరిత్రలో చెరగని ముద్ర వేయడంలో యంత్రాంగం విఫలమైందన్న అసంతృప్తి నేడు బహిరంగంగానే వినిపిస్తోంది. ఒకవేళ అన్ని వర్గాలను కలుపుకుని, ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి ఉంటే... నగరానికే కాదు, అధికార యంత్రాంగానికి కూడా మరింత ప్రత్యేక గుర్తింపు వచ్చేదంటున్నారు పరిశీలకులు. అయితే నేడు ‘ఒంగోలు ఉత్సవం’ ముగిసిపోయింది.. కానీ, "ఇంతకంటే ఘనంగా ఉండాల్సింది!" అనే ఒకే ఒక్క నిరాశాపూరితమైన మాట మాత్రం ఒంగోలు నగరవాసుల మధ్య అలాగే మిగిలిపోయిందట.




