Burning Topic: చైనా వలలో ఎన్విడియా బాస్! అమెరికా ఏఐ రహస్యాలపై కన్ను?
Burning Topic: ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌పై చైనా గూఢచర్య వలపు వల ఆరోపణలు. వివాహేతర సంబంధం అంగీకరిస్తూ ఉద్యోగులకు లేఖ. స్వతంత్ర విచారణకు ఎన్విడియా బోర్డు నిర్ణయం.
Burning Topic: చైనా వలలో ఎన్విడియా బాస్! అమెరికా ఏఐ రహస్యాలపై కన్ను?
Burning Topic: సూపర్ కంప్యూటర్లు, చాట్ జీపీటీల వెనుక ఉన్న అసలైన మైండ్ $4.5 ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్య సృష్టికర్త జెన్సన్ హువాంగ్ చుట్టూ ఇప్పుడు ఒక హాలీవుడ్ స్పై థ్రిల్లర్ సినిమాను తలపించే కథ నడుస్తోంది. ప్రపంచ సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఎన్విడియా సంస్థకు.. ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఈ కంపెనీ తయారుచేసే చిప్స్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. అలాంటి దిగ్గజ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఇది ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. అమెరికా జాతీయ భద్రత, బిలియన్ డాలర్ల వ్యాపార రహస్యాల లీకేజీ ఆరోపణలు ఆయనను చుట్టు ముట్టాయి. జెన్సన్ హువాంగ్ చైనా విసిరిన వలపు వలకు చిక్కుకొని, ఆ దేశానికి చిప్స్ చేరవేసే వ్యూహంలో బందీ అయ్యారు.
అమెరికాకు చెందిన ప్రముఖ దిన పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన ఓ వార్త తీవ్ర కలకలం రేపింది. ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచర్య ప్రయత్నాలు జరిగాయి. ఇందులో భాగంగా చైనా అంతర్గత భద్రతా మంత్రిత్వ అలైస్ హువాంగ్ అలియాస్ హువాంగ్ లీ అనే మహిళను రంగంలలోకి దింపింది. ఆమె సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ అనే డేటా సెంటర్ కంపెనీలో ఉన్నత స్థాయి అధికారిగా పని చేస్తు్న్నారు. ఆమె జెన్సన్ హువాంగ్‌తో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుని, ఆయన ద్వారా ఎన్విడియాకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా సంస్థ తయారుచేసే అత్యాధునిక ఏఐ చిప్స్, వాటి సాంకేతిక వివరాలు, ఇతర కీలక సమాచారం చైనాకు చేరవేసే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.. ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థలు కనిపెట్టేశాయి.
కృత్రిమ మేధ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో ప్రపంచాన్ని శాసిస్తున్న తమ దేశ అత్యాధునిక సెమీకండక్టర్ల సాంకేతికత మీద చైనా కన్నేసి ఏకంగా అతిపెద్ద టెక్ దిగ్గజం మీద వలపు వల విసరడాన్ని అమెరికా సీరియస్‌గా తీసుకుంది. ఇంది తమ జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరమని అక్కడి నిఘా సంస్థలు భావిస్తున్నాయి. ప్రపంచ ఏఐ చిప్ మార్కెట్లో దాదాపు 90 % వాటా కలిగిన ఎన్విడియా సీఈవో చైనా ఉచ్చులో పడినట్లు ఆరోపణలు రావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. చైనాకు గూఢచారిగా పని చేస్తున్న వ్యాపారవేత్తతో జెన్సన్ హువాంగ్ సంబంధాలపై తీవ్ర విమర్శలు, విచారణ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జెన్సెన్ హువాంగ్‌పై అమెరికా యంత్రాంగం రహస్యంగా దర్యాప్తు చేస్తోంది. చైనా విదేశీ, గూఢచార వ్యవహారాలను విశ్లేషించే హౌస్ కమిటీల ముందు జెన్సన్ హువాంగ్ రహస్యంగా హాజరు కావాలని రిపబ్లికన్ చట్టసభ్యులు ఆదేశించారు.
ఈ ఏడాది మేలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ వెళ్లి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయిన క్రమంలో ఈ వలపు వల బయటకు రావడం కలకలం రేపుతోంది. అప్పట్లో చైనాకు వెళ్లే బృందంలో ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ లేరని తెలిసి ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ఆయనను తన విమానంలో తీసుకెళ్లటం చర్చనీయాంశంగా మారింది. కాగా జెన్సన్హువాంగ్ గౌరవప్రదమైన వ్యక్తి అని, యన అమెరికాకు ఎంతో విలువైన సేవలు అందించారని ప్రశంసించారు ట్రంప్. అయితే ఏం జరుగుతోందో తనకు తెలియదని మీడియాతో తెలిపారు. ఈ వివాదంపై ఆయన వివరణ వినాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు. నిఘా సంస్థలు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ, ప్రతి ఒక్కరికీ తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని అన్నారు. హువాంగ్ ఎన్విడియా సీఈఓగా కొనసాగుతారా? అన్న ప్రశ్నకు అవునని తెలిపారు.
చైనాకు అధునాతన సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌ల ఎగుమతిపై ఉన్న ఆంక్షలను సడలించాలని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగాన్ని ఒప్పించేందుకు జెన్సన్ హువాంగ్ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఈ గూఢచర్య ఆరోపణలు తెరపైకి రావడం తీవ్ర దుమారం రేపింది. దీంతో అలైస్ హువాంగ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని జెన్సన్ హువాంగ్ అంగీకరించారు. ఈ మేరకు ఎన్విడియా సంస్థ ఉద్యోగులకు ఒక ఇ-మెయిల్ పంపించారు. ‘‘నేను చేసిన తప్పును సమర్థించుకోలేను. నా కుటుంబానికి, ఎన్విడియా సిబ్బందికి క్షమాపణలు చెబుతున్నా. సంస్థలో నాయకుడిగా ముందుడి నడిపించడం నా బాధ్యత. కానీ, నేను నా బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యాను. అయితే, సంస్థకు నేను కట్టుబడి ఉన్నా. మళ్లీ మీ అందరి విశ్వాసాన్ని పొందడానికి కృషి చేస్తా. మన సంస్థ అంతర్గత విచారణను ప్రారంభించింది. దానికి పూర్తిగా సహకరిస్తా’’అని జెన్సన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా హువాంగ్ విదేశీ గూఢచార కార్యకలాపాలకు లక్ష్యంగా చేసుకుందన్న ఆరోపణలపై ఎన్విడియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీ విచారణను పర్యవేక్షించననుంది. అందుకోసం బయటి న్యాయ నిపుణుల సహకారం తీసుకోనున్నారు. అమెరికా జాతీయ, ఆర్థిక భద్రత తమకు అత్యంత ముఖ్యమని సంస్థ పేర్కొంది. అయితే ప్రస్తుతం కంపెనీకి చెందిన సాంకేతిక రహస్యాలు లేదా రహస్య సమచారానికి ఎలాంటి నష్టం వాటిల్లినట్లు ఆధారాలు లేవని ఎన్విడియా స్పష్టం చేసింది. అయినప్పటికీ అందుబాటులో ఉన్న అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలిస్తామని తెలిపింది. హువాంగ్ తన పూర్తి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఆయన నాయకత్వంపై బోర్డుకు విశ్వాసం ఉందని కూడా స్పష్టం చేసింది.




