Off The Record: జైలు నుంచి జడ్పీటీసీ దాకా..!

Off The Record: నెల్లూరు జిల్లా పెళ్ళకూరు జడ్పీటీసీ ఎన్నికల్లో జైలు నుంచే నామినేషన్ వేసి గెలిచిన వైసిపి అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి. భార్య ప్రచారంతో విజయం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Nov 2026 7:44 AM IST
Off The Record
X

Off The Record: జైలు నుంచి జడ్పీటీసీ దాకా..!

Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్ళకూరు జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఇటు నెల్లూరు అటు తిరుపతి జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అక్కడి జడ్పిటిసి స్థానం నుంచి ప్రతిపక్ష వైసిపి అభ్యర్థిగా జైలు నుంచి నామినేషన్ వేసిన తాజా మాజీ ఎన్ డి సి సి బి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, అధికార పక్షం అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ సత్యనారాయణ రెడ్డి విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విజయం వెనుక జరిగిన రాజకీయ నాటకీయ పరిణామాలు, అచ్చు సినిమాను తలపించాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు నాయుడుపేటలో జరిగిన రాజకీయ వివాదంలో సత్యనారాయణ రెడ్డిని అరెస్టు చేసి, జైలుకు పంపారు అక్కడి పోలీసులు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో సత్యనారాయణ రెడ్డి జైలు గోడల మధ్య నుంచే నామినేషన్ పత్రాలను పూర్తి చేసి, తన భార్య ప్రభావతమ్మ ద్వారా ఎన్నికల అధికారి వద్ద దాఖలు చేశారు.

జైలు నుంచి జడ్పిటిసి ఎన్నిక కోసం అభ్యర్థిగా సత్యనారాయణ రెడ్డి పోటీ చేసిన మరుక్షణం అసలు సినిమా కథ మొదలైంది. సత్యనారాయణ రెడ్డి జైలులో ఉండగా ఆయన భార్యతోపాటు కూతురు కూడా ప్రజాస్వామ్య ప్రజాక్షేత్రంలో ఎన్నికల పోరాటం చేశారు. అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురైనా.. ఏమాత్రం వెరవక, బెదరక ఎదురొడ్డి నిలిచి ప్రచారం చేశారు. చివరకు విజయమే వరించింది! పెళ్లకూరు జడ్పీటీసీ సభ్యులుగా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అధికార టిడిపికి చెందిన అభ్యర్థిపై 1719 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. ఈ విజయం వెనుక ఆయన జీవిత భాగస్వామి ప్రభావతమ్మ కీలక పాత్ర పోషించడం రాజకీయంగా ప్రత్యేక చర్చకు దారితీసింది. కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి జైలులో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను ఆయన భార్య స్వయంగా భుజాన వేసుకున్నారు.

కుటుంబ పరిస్థితులు ఒకవైపు, రాజకీయ ప్రత్యర్థుల సవాళ్లు మరోవైపు ఉన్నప్పటికీ.. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లారు. భర్తకు బదులుగా తానే ప్రచార రంగంలోకి దిగి, ప్రతి ఒక్కరినీ కలుస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలో ప్రతిపక్ష వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అండగా నిలిచారు. అన్నింటికీ మించి ప్రజలు ఇచ్చిన మద్దతు విజయానికి బాటలు వేసింది. ఆ కుటుంబానికి కష్టకాలం ఎదురైనప్పుడు ఎవరు అండగా నిలుస్తారో అన్న సందేహాలకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ మద్దతుతో సమాధానం ఇచ్చారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ, తిరుపతి జిల్లా పెళ్లకూరు జడ్పిటిసి అభ్యర్థిగా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి జైలు గోడల మధ్య.. అందునా.. ప్రతిపక్ష పార్టీ నుంచి విజయం సాధించడం పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది. సుదీర్ఘకాలం రాజకీయాలలో కొనసాగుతున్న సత్యనారాయణ రెడ్డి మొదట కాంగ్రెస్, ఆపై వైసీపీలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రధాన, ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్నారు. ఒక దఫా ఆయన ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన జడ్పిటిసి సభ్యులుగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. వైసీపీ అధికారంలో ఉండగా, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా పదవి పొంది పని చేశారు. జైలు గోడల మధ్య నామినేషన్ పత్రాలు భర్తీ చేసి సత్యనారాయణ రెడ్డి విజయం సాధించడం ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలలో ప్రధాన చర్చినీయాంశయమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్