OFF THE RECORD: ఉత్తమ్ పై బాంబు పేల్చిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ లో అలజడి!

OFF THE RECORD: సొంత ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన విమర్శలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Nov 2026 8:29 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: ఉత్తమ్ పై బాంబు పేల్చిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ లో అలజడి!

OFF THE RECORD: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం వేదికగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన బహిరంగంగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. నిధులన్నీ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలకే మళ్లిస్తున్నారని, ఉత్తమ్ తెలంగాణకు మంత్రా..? లేక తన సొంత నియోజకవర్గానికే మంత్రా..? అంటూ ప్రశ్నించారు. తాను సీఎం లేదా మంత్రి కాకపోవచ్చు కానీ, వారి కంటే ఎక్కువ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడినని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మునుగోడు అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యే తరహాలోనే నిధులు అడుక్కోవాల్సి రావడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

రాజగోపాల్ రెడ్డి విమర్శల వెనుక నియోజకవర్గ అభివృద్ధి క్రెడిట్‌తో పాటు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల రాజకీయం దాగి ఉందనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా డిండి ఎత్తిపోతల పథకం, శివన్నగూడెం ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యం, వాటి క్రెడిబిలిటీపై ఆయన స్పష్టమైన పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం వంద కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉంటే, ఏడాది కాలంలో కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరత వల్ల నియోజకవర్గం వెనుకబడిపోతోందని, రాజగోపాల్ రెడ్డి గెలిస్తే అభివృద్ధి కాదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకే ఆయన ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాజగోపాల్ రెడ్డి ఆశించిన మంత్రి పదవి దక్కకపోవడం కూడా ఈ అసంతృప్తికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఒకవైపు బాధను వ్యక్తం చేస్తూనే, మరోవైపు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, ఇతర మంత్రులపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత చర్చ జోరుగా సాగుతోంది. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిజంగానే గొంతు ఎత్తుతున్నారా? లేక ఈ సమస్యలను అడ్డుపెట్టుకుని అధిష్టానాన్ని బెదిరించి మంత్రి పదవి సాధించుకోవాలని చూస్తున్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తన ఘాటు వ్యాఖ్యలే రాజగోపాల్‌కు మంత్రి పదవి దూరమవడానికి కారణమవుతున్నాయా అన్న చర్చ కూడా నడుస్తోంది.

సొంత పార్టీపైనే రాజగోపాల్ సంధిస్తున్న వాగ్బాణాలు.. ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపిలకు పెద్ద ఆయుధంగా మారుతున్నాయట. అధికార పార్టీలోని లోపాలను ఎత్తిచూపేందుకు ప్రతిపక్షాలు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను అస్త్రంగా మలచుకుంటున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయనపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం రాజకీయ వర్గాలను తీవ్ర విస్మయానికి గురిచేస్తోందట. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తున్నా అధిష్టానం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కాక శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. కాంగ్రెస్ పెద్దలు ఆయన వ్యాఖ్యలను పూర్తిగా లైట్ తీసుకుంటున్నారా..? లేక నల్లగొండ జిల్లా రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డికి ఉన్న బలాన్ని బేరీజు వేసుకుని వెనకడుగు వేస్తున్నారా..? అనేది ఉత్కంఠగా మారింది.

అధిష్టానం పాటిస్తున్న ఈ సైలెన్స్ వెనుక వేరే ఏదైనా వ్యూహం ఉందా..? అనే కోణంలోనూ విశ్లేషణలు సాగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల ప్రభావం బలంగా ఉండడం, పార్టీ మారితే కలిగే నష్టాలను అంచనా వేస్తూ అధిష్టానం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం మౌనాన్ని ఆసరాగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి రాబోయే రోజుల్లో మరింత దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన డిమాండ్లు నెరవేరకపోతే లేదా నిధుల కేటాయింపులు జరగకపోతే ఆయన ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు..? ఈ అంతర్గత విభేదాలు రానున్న రోజుల్లో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.

మొత్తానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద కుదుపునే సృష్టిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి నెపంతో సొంత సర్కార్‌పైనే ఆయన చేస్తున్న విమర్శలు పార్టీకి మింగుడు పడడం లేదట. అధిష్టానం అనుసరిస్తున్న మౌన వైఖరి ఆయనకు మరింత స్వేచ్ఛను ఇచ్చినట్లయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలతో మంత్రి పదవిని సాధించుకుంటారో..? లేక పార్టీతో మరింత దూరం పెంచుకుని కొత్త రాజకీయ దారి వెతుక్కుంటారో..? కాలమే నిర్ణయించాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్