Burning Topic: ఫ్రాన్స్‌ను తగలబెట్టేస్తున్న వలసవాదులు!
Burning Topic: విద్యార్థుల నిరసనలతో ఫ్రాన్స్‌లో తీవ్ర సామాజిక, రాజకీయ సంక్షోభం తలెత్తింది. వేలాది మంది వీధుల్లోకి రావడం, హింసాత్మక ఘటనలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది.
Burning Topic: ఫ్రాన్స్‌ను తగలబెట్టేస్తున్న వలసవాదులు!
Burning Topic: యూరప్‌లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఫ్రాన్స్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాఠశాలల్లో సౌకర్యాల కొరతపై విద్యార్థులు ప్రారంభించిన ఒక చిన్న నిరసన.. ఇవాళ ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన సామాజిక, రాజకీయ సంక్షోభంగా రూపాంతరం చెందింది. మెరుగైన విద్య, జీవన ప్రమాణాలు కావాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. పెరుగుతున్న అప్పులు, మందగించిన ఆర్థిక వృద్ధి, యువతలో నిరుద్యోగం, ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయి.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఐదు లక్షల మందికి పైగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతుండగా.. అనధికార అంచనాలు ఈ సంఖ్య ఎనిమిది లక్షల వరకు ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఒక్క పారిస్‌లోనే ఏకంగా 1.10 లక్షల మంది ర్యాలీలో పాల్గొన్నారు. స్ట్రాస్‌బర్గ్, రెన్నెస్ తదితర నగరాల్లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య భారీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు, ఇతర వస్తువులను విసిరారు.
శాంతియుతంగా ప్రారంభమైన ర్యాలీలు హింస చెలరేగడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు, జలఫిరంగులను ప్రయోగించారు. ఈ ఘటనల్లో మైనర్లతో సహా సుమారు వెయ్యి మందిని పోలీసులు అరెస్టు చేశారు వారం రోజుల క్రితం జరిగిన ఆందోళనల్లో దోపిడీలు చోటుచేసుకోవడంతో అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా సుమారు 70 వేల మంది పోలీసులను మోహరించారు.
హెలికాప్టర్లు, సాయుధ వాహనాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.ఫ్రాన్స్‌లో వీధి నిరసనలు కొత్తేమీ కాకపోయినా.. ఈసారి ఆందోళనల తీవ్రత అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అసలు ఫ్రాన్స్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దశాబ్దాలుగా ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తున్న సంక్షేమ రాజ్య విధానమే ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా మారుతోందా? సంక్షేమ పథకాలే దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారాయా? అనే అనుమానాలూ ఉన్నాయి.
ప్రజల సమస్యలతోపాటు ప్రభుత్వం కూడా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఫ్రాన్స్‌లో దశాబ్దాలుగా అమలవుతున్న సంక్షేమ విధానాలు ప్రజలకు ఆరోగ్య సంరక్షణ, పింఛన్లు, సామాజిక భద్రత వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే, ఈ పథకాల వ్యయాన్ని భరించేందుకు అవసరమైన స్థాయిలో ఆర్థిక వృద్ధి లేకపోవడం సమస్యగా మారింది. దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో పింఛన్లు, వైద్య సేవలపై ప్రభుత్వ వ్యయం పెరుగుతోంది.
మరోవైపు, పనిచేసే యువత సంఖ్యతో పోలిస్తే వారిపై ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. పింఛన్ల భారం తగ్గించేందుకు పదవీ విరమణ వయసును పెంచాలని ప్రభుత్వం గతంలో ప్రయత్నించినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఖర్చులను తగ్గించాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు రాజకీయంగా, సామాజికంగా ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రజల సంక్షేమాన్ని కాపాడుతూనే ప్రభుత్వ ఆర్థిక భారాన్ని ఎలా తగ్గించాలన్నది కీలక ప్రశ్నగా మారింది.
ఫ్రాన్స్ ప్రజల అసంతృప్తికి ప్రధాన కారణం జీవన వ్యయం పెరగడం. ఉద్యోగాల కొరత, వేతనాల్లో ఆశించిన పెరుగుదల లేకపోవడం, ప్రభుత్వ సహాయం సరిపోవడం ప్రజలను నిరసనల వైపు నడిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిరుద్యోగం సుమారు 8 శాతం ఉండగా.. యువతలో దాదాపు 20 శాతానికి చేరింది. వేతనాల విషయంలోనూ ఫ్రాన్స్ ఇతర దేశాలతో పోలిస్తే వెనుకబడుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఉన్నత విద్యలో అదనంగా 2.5 లక్షల సీట్లు కల్పించాలని విద్యార్థి సంఘాల డిమాండ్.
అలాగే పాఠశాలల్లో సిబ్బంది కొరతను పరిష్కరించాలని, విద్యార్థులకు అందించే నెలవారీ గ్రాంటును 200 యూరోలకు పెంచాలని కోరుతున్నారు. హాస్టళ్ల అద్దెలను నియంత్రించాలని కూడా ప్రభుత్వాన్ని కోరాయి. పెరుగుతున్న ఖర్చుల కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంతోపాటు, విద్యా అవకాశాలను పెంచాలని ఆందోళనకారులు పట్టుబడుతున్నారు.
ఫ్రాన్స్ ప్రస్తుత పరిస్థితిని సకాలంలో చక్కదిద్దకపోతే ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. మొదటిది, ఆర్థిక సంస్కరణల ద్వారా వృద్ధిని వేగవంతం చేయడం. రెండోది, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించి పింఛన్లు, ఆరోగ్య సంరక్షణ సహా సంక్షేమ ఖర్చులను దీర్ఘకాలంలో భరించగలిగే స్థాయిలో ఉంచడం. అయితే, ఈ చర్యలను అమలు చేయడం అంత సులభం కాదు.
సంక్షేమ ప్రయోజనాలను తగ్గిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చు. సంస్కరణలు ఆలస్యమైతే అప్పుల భారం మరింత పెరగవచ్చు. అందువల్ల ఆర్థిక వృద్ధిని పెంచడం, ప్రభుత్వ ఆదాయాన్ని మెరుగుపరచడం, అప్పుల నియంత్రణకు చర్యలు తీసుకోవడం ఫ్రాన్స్‌కు కీలకం. ఈ పరిణామాలు ఒక ముఖ్యమైన ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. మరోవైపు, ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా మరింత సహాయం కోరుతున్నారు.
మరో ఆరు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దేశ రాజకీయాలు రెండు శిబిరాలుగా చీలిపోవడంతో హింసాత్మక ఘటనలు మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ శాంతికి పిలుపునిచ్చి, హింసను తీవ్రంగా ఖండించారు.
ఫ్రాన్స్‌ను వణికిస్తున్న తాజా హింసాత్మక అల్లర్ల వెనుక ఎవరున్నారు? ఈ ప్రజాగ్రహం వెనుక కేవలం సామాన్యులే ఉన్నారా లేక అంతర్జాతీ శక్తుల ప్రమేయం ఉందా? విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను అడ్డం పెట్టుకుని దేశాన్ని అశాంతి వైపు నెడుతున్న శక్తులు ఏవి? అనే చర్చ జరుగుతోంది. ఫ్రాన్స్ అంతర్గత రాజకీయాల్లో పట్టు కోసం చూస్తున్న తీవ్ర వామపక్ష పార్టీలతో పాటు కొన్ని అంతర్జాతీయ శక్తులు, గ్లోబల్ నెట్‌వర్క్‌లు ఈ నిరసనలకు ఆజ్యం పోస్తున్నాయని ఫ్రెంచ్ ప్రభుత్వం అంతర్జాతీయ నివేదికలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి.




