Burning Topic: స్పెయిన్‌ ప్రజలను వణికిస్తున్న ఇంటి అద్దెల సంక్షోభం!

Burning Topic: ఇజ్రాయెల్‌పై ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్ కుట్ర. కెప్టెన్ స్మిత్ సాహసంతో ప్రయాణికులను కాపాడిన సంచలన ఘటన వివరాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Oct 2026 8:11 AM IST
Burning Topic
X

Burning Topic: స్పెయిన్‌ ప్రజలను వణికిస్తున్న ఇంటి అద్దెల సంక్షోభం!

Burning Topic: సొంతింటిలో నివాసం సామాన్యులకు ఓ కల.. అది సాకారం అయ్యే వరకూ నీడ నిచ్చేవి అద్దె ఇండ్లే.. మనిషి సంపాదనలో సగానికి పైగా భాగం అద్దె రూపంలోనే కరిగిపోతుంటే ఇక బతుకు బండి లాగడం ఎలా? మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లోనూ ఇది అతిపెద్ద సమస్యగా మారిపోయింది.

తాజాలో యూరోప్ లోని స్పెయిన్‌లో పెరిగిపోతున్న ఇంటి అద్దెలకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు తీవ్రమయ్యాయి. రాజధాని మాడ్రిడ్‌ సహా ప్రధాన నగరాలు బార్సిలోనా, వలెంషియాల్లో వేలాదిగా ప్రజలు రోడ్డెక్కారు.

ఇళ్ల అద్దెలను నియంత్రించాలంటూ ఉద్యమించిన ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు పేల్చాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

చాలా చోట్ల నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది.స్పెయిన్‌లో గృహ నివాస సంక్షోభం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. గత పదేళ్లలో ఇళ్ల అద్దెలు దాదాపు రెట్టింపయ్యాయి.

2015 నుండి అద్దెలు 57% పెరగ్గా, ప్రజల సగటు ఆదాయం కేవలం 33% మాత్రమే పెరిగింది. రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్ ఐడియలిస్టా గణాంకాల ప్రకారం.. చదరపు మీటరు సగటు అద్దె ధర 2016లో 8.20 యూరోలుగా ఉండగా, ఈ ఏడాది 15.1 యూరోలకు పెరిగింది.

మాడ్రిడ్, బార్సిలోనా వంటి నగరాల్లో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంది.బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ నివేదిక ప్రకారం దాదాపు సగం అద్దెదారులు తమ సంపాదనలో 40% కేవలం ఇళ్ల అద్దెలు, కరెంట్ బిల్లులకే ఖర్చు చేయాల్సి వస్తోంది.

బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం సుమారు 7 లక్షల ఇళ్ల కొరత ఉంది. ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోవడం, ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటడటంతో పేదలు, మధ్యతరగతి, వర్గాలకు సొంతిల్లు కలగానే ఉండిపోయింది.

మరోవైపు స్పెయిన్‌లో మితిమీరిన పర్యాటకం కూడా గృహ సంక్షోభానికి దారి తీసింది. దేశీయ అద్దెదారుల కంటే పర్యాటకులకు స్వల్పకాలికంగా ఇళ్లను అద్దెకు ఇవ్వడానికే యజమానులు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల స్థానిక సాధారణ ప్రజలకు ఇళ్లు దొరకడం గగనమైపోయింది.

కొన్ని నగరాల్లో జనాభా కంటే పర్యాటకుల సంఖ్య పది రెట్లు ఎక్కువగా ఉంటోంది. దీంతో పర్యాటకులకు తమ దేశానికి రావద్దంటూ గతేడాది స్పెయిల్ ప్రజలు నిరసనలకు దిగారు. మీ సెలవులు - మా దౌర్భాగ్యం వంటి ప్లకార్డులతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్సిలోనా వంటి నగరాల్లో పర్యాటకుల హోటల్లు, వాహనాలపై దాడులు కూడా చేశారు.

మరోవైపు పొరుగున ఉన్న మొరాకోలాంటి దేశాల నుంచి స్పెయిల్ లోకి అక్రమ వలసలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశారు. వీరిని నివాస వసతి కల్పించడం స్పెయిన్ ప్రభుత్వానికి అదనపు భారంగా మారింది.

ఇక ఇటీవలి ఘటన పుండు మీద కారం చల్లినట్లయింది. మాడ్రిడ్ నగరంలోని ప్యూర్టా డెల్‌ సోల్‌ ప్లాజాలో మారికార్మెన్ అబాస్కల్ అనే 87 ఏళ్ల వృద్ధురాలు గత 70 ఏళ్లుగా ఉంటున్నారు.ఇటీవల కొత్తగా ఈ భవనాన్ని కొనుగోలు చేసిన ఓ సంస్థ ఆమె అద్దెను ఒకేసారి 400% పైగా పెంచింది.

మరికార్మెన్ ఈ అద్దె పెంపును భరించలేదంటూ కోర్టు ఉత్తర్వుల సాయంతో బలవంతంగా ఖాళీ చేయించారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను స్ట్రెచర్‌పై పోలీసులు బలవంతంగా తరలించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలంతా భగ్గుమన్నారు. దేశంలో ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరించాలంటూ గళమెత్తారు.

దీంతో వెంటనే స్పెయిన్ ప్రభుత్వం స్పందించింది. ప్రజల ఆగ్రహాన్ని గమనించిన భవనాన్ని కొనుగోలు చేసిన సంస్థ మారికార్మెన్ అబాస్కల్ గతంలో చెల్లిస్తున్న మాదిరే 500 యూరోలు చెల్లించేలా ఒప్పందం కుదర్చుకుంది.

స్పెయిన్‌ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌ ఇంకో ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఇళ్ల సమస్యపై దేశ ప్రజల ఆందోళన కారణంగా కొన్ని దిద్దుబాటు చర్యలను చేపట్టారు. ఇంటి అద్దె దారులకు రక్షణ కల్పించే డిక్రీ గడువును 2030 వరకూ ప్రభుత్వం పొడిగించింది.

సీజనల్‌గా అద్దెకిచ్చే వారిపై పన్ను విధించింది. రియల్‌ ఎస్టేట్‌లో కృత్రిమంగా రేట్లను పెంచి కొనుగోలు చేయడాన్ని 2028 వరకూ నిషేధించింది. తక్కువ ఆదాయం కలిగిన వారికి ఇళ్లను అద్దెకిచ్చే యజమానులకు పన్ను మినహాయింపులను ప్రకటించింది.

తొలిసారిగా ఇళ్లను కొనుగోలు చేసేవారికి వడ్డీ రహిత రుణాలను ఇస్తామని వెల్లడించింది.అయితే ఈ చర్యలను పార్లమెంటులో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.

ప్రతిపక్షాలైన పాపులర్ పార్టీ, వోక్స్, జంట్స్ పార్టీలు వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదనలు వీగిపోయాయి. దీంతో స్పెయిన్ ప్రజలు ఆందోళలను మరింత తీవ్రం చేశారు.

మారికార్మెన్ అబాస్కల్ ఇప్పుడు స్పెయిన్‌లో ఇళ్ల అద్దెలు తగ్గించాలనే ఉద్యమానికి ప్రతీకగా మారారు. మాడ్రిడ్‌లో సుమారు 70 వేల మంది ప్రదర్శనకారులు వీధుల్లోకి వచ్చారు. బార్సిలోనా, వలెంషియాలతోపాటు దాదాపు 50 నగరాల్లో ఆందోళనలు కొనసాగేతున్నాయి.

అద్దెలు తగ్గించాలని, ఇళ్లు ఖాళీ చేయించకుండా బలమైన చట్టపరమైన రక్షణ కల్పించాలని, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లు నివాస గృహాలను కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు దేశవ్యాప్త సమ్మెకు కూడా పిలుపునిచ్చారు.

వివిధ వర్గాల ప్రజలు ఈ ఆందోళనలో భాగమయ్యారు. అద్దెల విషయంలో తగిన చర్యలు తీసుకునేంతవరకూ ఆందోళన కొనసాగుతుందని వీరు చెబుతున్నారు.

రాబందుల నిధుల సంస్థలే పార్లమెంటును నడుపుతున్నాయి అంటూ నినాదాలు చేశారు. తాజా రాజకీయ పరిణామాలతో స్పెయిన్‌లో ముందస్తు ఎన్నికలు రావొచ్చనే ఊహాగానాలు బలపడ్డాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్