Off The Record: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!

Off The Record: కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఉపసంహరించుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Nov 2026 7:14 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!

Off The Record: రెండు తెలుగు రాష్ట్రాల్లో కొండా సురేఖ పేరు తెలియని రాజకీయ కార్యకర్త ఉండరంటే అతిశయోక్తి కాదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆమె రాజకీయ ప్రస్థానం ఒక సంచలనమే. వరంగల్ రాజకీయాల్లో ఆమెకు ఉన్న పట్టు, వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు.. అన్నీ కలిపి కొండా సురేఖను ప్రత్యేక నాయకురాలిగా నిలబెట్టాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తొలి రోజుల్లోనే జగన్‌కు మద్దతుగా నిలిచి ఆంధ్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. కాంగ్రెస్‌లో చేరి మళ్లీ అధికార రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

మంత్రి హోదా దక్కించుకున్నారు. కానీ అదే మంత్రి పదవి వివాదాల కారణంగా ఆమె చేతులారా జారిపోయిందన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. ఇప్పుడు అదే కొండా సురేఖ మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రబిందువయ్యారు.కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో కొండా సురేఖ చేసిన పోస్టు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు బాధ కలిగించి ఉంటే దానికి చింతిస్తున్నానని.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆమె ప్రకటించారు. "రాజకీయ వాతావరణం కారణంగా ఆ వ్యాఖ్యలు చేశాను తప్ప ఎవరి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఉద్దేశం లేదు" అంటూ చేసిన కామెంట్స్ రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రత్యక్షంగా కేటీఆర్‌ కుటుంబాన్ని, సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన నాయకురాలు.. ఇప్పుడు అదే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం వెనుక ఏదో పెద్ద రాజకీయ లెక్క ఉందా అన్న ప్రశ్న మొదలైంది.

మంత్రి హోదాలో ఉన్న సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకున్నారని.. తెలంగాణ సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని కీలక పరిణామాలకు కేటీఆర్ బాధ్యత వహించాలని కూడా ఆమె ఆరోపించారు.

సినీ జంట నాగచైతన్య, సమంత విడాకుల అంశాన్ని కూడా రాజకీయ విమర్శలలోకి తీసుకురావడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.

కేవలం రాజకీయ నేతలే కాదు.. సినీ ప్రముఖులు.. అక్కినేని కుటుంబ సభ్యులు.. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు కూడా ఆమె వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో వివాదం రాజకీయ పరిధిని దాటి న్యాయపరమైన పోరాటానికి దారి తీసింది. కేటీఆర్ స్వయంగా లీగల్ నోటీసులు పంపించారు.

ఆ తర్వాత పరువు నష్టం కేసు కూడా వేశారు. అంత భారీ వివాదానికి కారణమైన వ్యాఖ్యలను ఇప్పుడు కొండా సురేఖ స్వయంగా వెనక్కి తీసుకోవడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడే మరో ఆసక్తికర విషయం కనిపిస్తోంది. కొంతకాలంగా కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదన్న చర్చ సాగుతోంది.

ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై స్పందన, ఇలా తన ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా పార్టీ నిర్వహిస్తున్న అనేక రాజకీయ కార్యక్రమాల్లో మాత్రం ఆమె చురుకుదనం తగ్గిందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తోంది.

దీంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. సెప్టెంబర్‌లో మంత్రి పదవి కోల్పోయిన అనంతరం కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా అప్పట్లో సంచలనంగా మారాయి.

"కేసీఆర్ చాలా మంచి వ్యక్తి" అని, "ఎప్పుడూ తమ పట్ల గౌరవంగా వ్యవహరించారని", "వెళ్లిన ప్రతిసారి ఆప్యాయంగా మాట్లాడేవారని" చెప్పడం రాజకీయంగా మరింత ఆసక్తి రేపింది. ఒకవైపు కాంగ్రెస్ నేతగా ఉంటూనే.. మరోవైపు కేసీఆర్ నాయకత్వంపై పాజిటివ్ కామెంట్లు చేయడం చూసి.. "కొండా సురేఖ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా?" అన్న ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది.

అయితే అప్పట్లో ఆ ప్రచారాన్ని ఆమె ఖండించారు. కానీ ఇప్పుడు తాజా ట్వీట్‌తో మళ్లీ అదే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇక రాజకీయంగా అందరినీ ఆలోచింపజేసిన అంశం ఏంటంటే.. ఈ ట్వీట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ దిగ్గజాలు ఇద్దరూ స్పందించడం.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. "క్షమాపణలు చెప్పినందుకు స్వాగతం, ఇలాగే క్షమాపణలు చెప్పాల్సిన వారు ఇంకా చాలామంది ఉన్నారు" అంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. "ఇంకా చాలా విషయాలు ముందుకురావాల్సి ఉంది" అంటూ చేసిన కామెంట్లు కొత్త చర్చలకు కారణమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొండా సురేఖకు బలంగా అండగా నిలిచారు.

"ఆమె మా సోదరి లాంటివారు" అని వ్యాఖ్యానించిన ఆయన.. "ఒక మహిళగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం చిన్న విషయం కాదు" అంటూ ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రశంసించారు. ఇందులో రాజకీయ కోణం చూడాల్సిన అవసరం లేదని..

కేసులు, వివాదాలకు చట్టపరంగా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అయితే రాజకీయాల్లో ప్రశ్నలు సమాధానాల కంటే వేగంగా పుడతాయి.

కొండా సురేఖ ట్వీట్ నిజంగా రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నమా...? లేక భవిష్యత్ రాజకీయ వ్యూహానికి తొలి సంకేతమా..?

బీఆర్ఎస్‌తో సంబంధాలు మెరుగుపరచుకునే అడుగా..? లేక కాంగ్రెస్‌లోనే కొత్త రాజకీయ స్థానం కోసం వేస్తున్న ఎత్తుగడా..? అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్