Off The Record: ఖైరతాబాద్‌లో మాస్ లీడర్ల పోరు!

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ ఉప ఎన్నిక వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై నగర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Oct 2026 11:23 AM IST
Off The Record
X

Off The Record: ఖైరతాబాద్‌లో మాస్ లీడర్ల పోరు!

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఆ రెండు చోట్ల బీఆర్ఎస్ ఓటమిని చవిచూసింది. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక మాత్రం గులాబీ పార్టీకి సామాన్య ఎన్నిక కాదు.. 2028 ఎన్నికలకు ముందు జరిగే రాజకీయ సెమీఫైనల్‌గా చూస్తోంది.

దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసులో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ఉప ఎన్నిక రావడానికే కారణమైన న్యాయ పోరాటాన్ని బీఆర్ఎస్ విజయంగా ప్రచారం చేస్తోంది. పార్టీ ఫిరాయింపుల అంశంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించామని, ఇప్పుడు అదే ప్రజా తీర్పుగా మారబోతోందని గులాబీ నేతలు చెబుతున్నారు.

అయితే ఖైరతాబాద్‌లో ఈసారి రాజకీయ పోటీ సాధారణంగా ఉండదని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకటించకముందే మాటల యుద్ధం మొదలైంది. "ఖైరతాబాద్ నా అడ్డా.. గెలిచి తీరుతా" అని దానం నాగేందర్ ధీమాగా చెబుతున్నారు. మరోవైపు "ఖైరతాబాద్ మరోసారి బీఆర్ఎస్ కంచుకోటేనని నిరూపిస్తాం" అంటూ గులాబీ నేతలు సవాల్ విసురుతున్నారు.

ఇక్కడే రాజకీయ కథ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఈ పోరు కేవలం రెండు పార్టీల మధ్య కాకుండా.. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు సిటీ మాస్ నేతల మధ్య ప్రతిష్టాత్మక సమరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దానం నాగేందర్.. హైదరాబాద్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు. బస్తీల్లో బలమైన పట్టుతోపాటు వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉందనే అభిప్రాయం ఉంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా కూడా పనిచేశారు. రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న ఆయనకు ఖైరతాబాద్‌పై మంచి పట్టుందని కాంగ్రెస్ భావిస్తోంది.

అయితే దానం ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అదే స్థాయి నాయకుడు అవసరమని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలపై మంచి పట్టు ఉన్న తలసాని.. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణలోనూ మంత్రిగా పనిచేశారు. నగర రాజకీయాలపై లోతైన అవగాహన కలిగిన ఆయనకు ప్రత్యేక ఇమేజ్ ఉంది.

ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా తలసాని చుట్టూనే బీఆర్ఎస్ కార్యకలాపాలు తిరుగుతున్నాయనే అభిప్రాయం ఉంది. అందుకే ఖైరతాబాద్ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాజకీయంగా చూసినా దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ 1994లో మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరూ ఆరు సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇద్దరూ మంత్రులుగా పనిచేశారు. ఇద్దరికీ నగర రాజకీయాల్లో మాస్ కనెక్ట్ ఉంది. అందుకే ఈ పోరు జరిగితే అది సాధారణ ఎన్నిక కాకుండా హైఓల్టేజ్ వార్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు తలసాని స్వయంగా బరిలో దిగకపోయినా, ఆయన కుమారుడు సాయికిరణ్‌ను రంగంలోకి దించే అవకాశాలపై కూడా గులాబీ పెద్దల్లో చర్చ జరుగుతోంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ, తలసాని కుటుంబ బలాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా బీఆర్ఎస్‌లో ఉన్నట్లు సమాచారం.

బీఆర్ఎస్‌కు మరో ఆందోళన కూడా లేకపోలేదు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థి లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉందంటున్నారు. అందుకే ఖైరతాబాద్‌లో అలాంటి పొరపాటు పునరావృతం కాకూడదని కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రత్యేకంగా బస్తీలు, మధ్యతరగతి కాలనీలు, ఆంధ్ర సెటిలర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఓట్ల సమీకరణ కీలకంగా మారనుంది. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన అనుభవం తలసానికి ఉండటంతో టీడీపీ సానుభూతిపరులు, సెటిలర్ల ఓట్లు కూడా తమకు కలిసివస్తాయని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ మాత్రం దానం నాగేందర్ వ్యక్తిగత ఇమేజ్, స్థానిక పరిచయాలు, అభివృద్ధి అంశాలే తమకు ప్రధాన బలం అని చెబుతోంది. ఖైరతాబాద్ ప్రజలు వ్యక్తిని చూసి ఓటు వేస్తారని, పార్టీ మార్పు అంశం పెద్దగా ప్రభావం చూపదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తానికి ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కంటే.. దానం వర్సెస్ తలసాని అనే వ్యక్తిగత రాజకీయ సమరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరి వ్యూహం ఫలిస్తుంది..? ఎవరి మాస్ ఫాలోయింగ్ పైచేయి సాధిస్తుంది..? ఖైరతాబాద్ తీర్పు 2028 ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తుందా..? అనే ప్రశ్నలకు సమాధానం కోసం తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్