BURNING TOPIC: మనుషుల ప్రాణాలు తీస్తున్న గజరాజు.. రంగంలోకి కుంకీ ఏనుగులు!
BURNING TOPIC: కేరళ ఇడుక్కి జిల్లా చిన్నకనాల్లో బీభత్సం సృష్టిస్తున్న అడవి ఏనుగు చక్కకొంబన్కు మత్తుమందు ఇచ్చి రేడియో కాలర్ అమర్చేందుకు అటవీశాఖ ఆపరేషన్ ప్రారంభించింది.
BURNING TOPIC: మనుషుల ప్రాణాలు తీస్తున్న గజరాజు.. రంగంలోకి కుంకీ ఏనుగులు!
BURNING TOPIC: ప్రపంచంలో అత్యధిక ఆసియా జాతి ఏనుగుల జనాభా ఉన్నది భారత దేశమే.. ఇది మన జాతీయ వారసత్వ జంతువు. దేశ వ్యాప్తంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వశాఖ ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 30,711 ఏనుగులు ఉన్నాయి. కేరళంలో 3,054 వరకూ ఉంటాయి.
ఈ రాష్ట్రం ఏనుగుల సంఖ్యలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ అక్కడి ఆలయాల్లో, ప్రైవేట్ వ్యక్తుల సంరక్షణలో ప్రధాన ఆకర్శనగా కనిపిస్తాయి. అసలు ఏనుగులు పేరు చెబితే గుర్తుకు వచ్చేది కేరళం అంటే అతిశయోక్తి లేదు. కేరళంలో ఏనుగులు ఎక్కువగా అడవుల్లోనే ఉంటాయి.
పశ్చిమ కనుమల్లో విస్తరించిన పెరియార్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఇవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఇవి ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా నిరంతరం ఆహారం, నీరు లభించే ప్రాంతాల కోసం సంచరిస్తుంటాయి. అయితే జనావాసాల విస్తరణ వాటి మనుగడకు కష్టాలు తెచ్చిపెట్టింది.
పచ్చని తేయాకు తోటలు, ప్రశాంతమైన కొండ ప్రాంతాలకు నెలవైన కేరళంలోని ఇడుక్కి జిల్లా ఇప్పుడు గజరాజు పేరు చెబితే వణికిపోతోంది. ఇక్కడి చిన్నకనాల్, శాంతంపార, దేవికుళం, మరయూర్, మున్నార్ ప్రాంతాల్లో సుమారు 18 అడవి ఏనుగులు నివసిస్తున్నాయి. అయితే అక్కడ జనసాంద్రత పెరగడంతో అటవీ భూమి కేవలం 3 ఎకరాలకు పరిమితమైంది. దీంతో ఏనుగులు ఆహారం, నీటి కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి.
అవి జనావాసాల్లోకి చొరబడి పనస, గుమ్మడి, క్యాబేజీ, జామ, ఏలకులు వంటి లక్షల రూపాయల విలువైన పంటలను నాశనం చేస్తున్నాయి. తరచూ ఇళ్లు, రేషన్ దుకాణాలు, అటవీ శాఖ వాహనాలను ధ్వంసం చేయడం ద్వారా గజరాజులు సమస్యగా మారిపోయాయి. గత కొన్నేళ్లుగా ఏనుగుల దాడుల వల్ల పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. దీనివల్ల తోటల కార్మికులు, గిరిజనులు నిత్యం భయంతో బతుకుతున్నారు.
తాజాగా చిన్నకనాల్, శాంతన్పారా గ్రామాల ప్రజలు కంటి నిండా నిద్ర కరువై ఆందోళనతో జీవిస్తున్నారు. ఇందుకు కారణం అడవి ఏనుగులే. 2023లో ఈ ప్రాంతం మీద ఓ గజరాజు ఆధిపత్యం చెలాయించింది. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన తర్వాత స్థానిక జనావాసాల్లోకి రావడం ప్రారంభించింది. ఇది ఆకలి తీర్చుకోవడానికి తరచూ రేషన్ దుకాణాలు, కిరాణా కొట్లు, ఇళ్ల వంటగదులను ధ్వంసం చేసి బియ్యాన్ని తినేసేది.
దీంతో ఈ ఏనుగుకు 'అరికొంబన్' అనే పేరు పెట్టారు. అరి అంటే బియ్యం. కొంబన్ అంటే దంతాలు అని అర్థం. స్థానికుల ఫిర్యాదు మేరకు 2023 ఏప్రిల్లో కేరళ అటవీ శాఖ దీనికి మత్తుమందు ఇచ్చి బంధించి, పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులోకి వదిలిపెట్టింది. అప్పట్లో అరికొంబన్ అరాచకాల మీద ఓ సినిమా కూడా వచ్చింది. అరికొంబన్ను మరచిపోక ముందే ఇప్పుడు ఈ ప్రాంతానికి కొత్త సమస్య వచ్చిపడింది.
అరికొంబన్ వదిలిపెట్టిన ఆధిపత్య స్థానాన్ని ఇప్పుడు 'చక్కకొంబన్' స్వీకరించింది. మలయాళంలో చక్క అంటే పనస. పనసపండ్లను ఇష్టంగా తినే 'చక్కకొంబన్' చిన్నకనాల్, శంకరపాండియన్మెట్టు, పంతడిక్కలం, 301 కాలనీ వంటి జనావాస ప్రాంతాల్లో తన ఉనికిని చాటడం మొదలు పెట్టింది.
చురుకుగా వేగంగా కదిలే ఈ ఏనుగు పంట పొలాలను, సోలార్ ఫెన్సింగ్లను ధ్వంసం చేయడమే కాకుండా, మనుషుల ప్రాణాలకు కూడా ఇది తీవ్ర ముప్పుగా మారింది. సెప్టెంబర్ 23న 47 ఏళ్ల విజయన్ అనే వ్యక్తిని చక్కకొంబన్ పొట్టనబెట్టుకోవడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఈ ప్రాంతంలో అడవి ఏనుగుల దాడిలో ఇప్పటి వరకూ 34 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ పరిస్థితిపై తక్షణమే దృష్టి సారిస్తున్నామని అటవీ శాఖ మంత్రి శిబు బేబీ జాన్ తెలిపారు. స్థానికులు ఆందోళన మేరకు కేరళ అటవీ శాఖ ఇప్పుడు ఈ ఏనుగులను బంధించేందుకు మిషన్ చక్కకొంబన్ మొదలు పెట్టింది.
చక్కకొంబన్ను బంధించేందుకు కోసంవయనాడ్లోని ముత్తంగ ఎలిఫెంట్ క్యాంప్ నుండి ప్రత్యేక శిక్షణ పొందిన విక్రమ్, భరత్ అనే రెండు కుంకీ ఏనుగులను చిన్నకనాల్కు తీసుకువచ్చారు.మిషన్ చక్కకంబన్ ఆపరేషన్ సజావుగా సాగించేందుకు చిన్నకనాల్ పంచాయతీ పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు. పర్యాటక కార్యకలాపాలను, డ్రోన్ల ఎగురవేతను పూర్తిగా నిలిపివేశారు.
గతంలో అరికొంబన్ తరహాలోనే చక్కకొంబన్ను కూడా బంధించి వేరే అడవిలోకి తరలించాలని అటవీశాఖ తొలుత భావించింది. అయితే, వన్యప్రాణి సంరక్షణ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో వ్యూహం మార్చుకోవాల్సి వచ్చింది. ముందుగా చక్కకొంబన్కు మత్తుమందు ఇచ్చి బంధిస్తారు. దాని కదలికలను 24 గంటలూ శాటిలైట్ ద్వారా పర్యవేక్షించేందుకు మెడకు 'రేడియో కాలర్' అమరుస్తారు.
అనంతరం దాన్ని తిరిగి అదే అటవీ ప్రాంతంలో వదిలిపెడతారు. దీనివల్ల ఏనుగు జనావాసాల వైపు వస్తున్నప్పుడే ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
అయితే అటవీశాఖ నిర్ణయంపై స్థానికులు, రాజకీయ పార్టీల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చొక్క కొంబన్కు రేడియో కాలర్ అమర్చి మళ్లీ ఇక్కడే వదిలేస్తే తమ ప్రాణాలకు రక్షణ ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నిస్తున్నారు.
'అరికొంబన్' ఏనుగును తరలించినట్లే దీనిని కూడా వేరే అడవికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏనుగును వేరే చోటికి తరలించాలంటే కేరళ హైకోర్టు, పర్యవేక్షణ కమిటీ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి రేడియో కాలర్ ద్వారా ఏనుగు కదలికలను నిశితంగా గమనిస్తామని, అప్పటికీ దాడులు ఆగకపోతే కోర్టు అనుమతితో తరలింపుపై ఆలోచిస్తామని అధికారులు తెలిపారు.
కాగా చిన్నకనాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాలు, ఆనయిరంగల్ డ్యామ్ పరిసరాలు, దట్టమైన గడ్డి భూముల మధ్య చక్కకొంబన్కు మత్తుమందు ఇవ్వడం అటవీశాఖ సిబ్బందికి కత్తి మీద సాములా మారింది.
మరోవైపు కేరళం ప్రభుత్వ అటవీ శాఖ మనుషులు, ఏనుగుల మధ్య ఏర్పడుతున్న ఘర్షణను తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా పనస పండ్ల వనాలను పెంచాలని నిర్ణయించింది. వ్యవసాయ శాఖ సహకారంతో ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈ నవంబర్ నెలలో ఎంపిక చేసిన పంచాయతీలలో ప్రారంభమై, పనస పండ్ల సీజన్ జూన్ నుండి జూలై వరకు అంతా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు..
దీంతో ఏనుగులు ఆహారం కోసం జనావాసాలకు రాకుండా అడవుల్లోనే ఉండే అవకాశం ఉంది. పనస పండ్లను సేకరించడం ద్వారా ఏనుగులను మానవ నివాసాలకు దూరంగా ఉంచవచ్చో లేదో ఈ పైలట్ ప్రాజెక్ట్ అంచనా వేస్తుంది.దీని ఫలితాల ఆధారంగా, అటవీ శాఖ ఈ కార్యక్రమాన్ని కేరళంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడాన్ని పరిశీలిస్తుంది.
ఏదేమైనా, మానవ-వన్యప్రాణి సంఘర్షణకు అడ్డుకట్ట వేస్తూ, అటు గజరాజు ప్రాణాలకు, ఇటు ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఈ మిషన్ విజయవంతం కావాలని అందరూ కోరుకుంటున్నారు.




