Off The Record: డంప్ యార్డ్‌పై ఈటెల పోరాటం!

Off The Record: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కాలుష్యంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జన సంకల్ప పాదయాత్ర చేపట్టింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Oct 2026 8:27 AM IST
Off The Record
X

Off The Record: డంప్ యార్డ్‌పై ఈటెల పోరాటం!

Off The Record: హైదరాబాద్ నగరం ఉత్పత్తి చేస్తున్న వేలాది టన్నుల చెత్త చివరికి చేరేది జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకే. అయితే ఈ వ్యర్థాల ప్రభావం అక్కడితో ఆగిపోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. చెత్త నుంచి వెలువడే దుర్వాసన, రసాయన వ్యర్థాలు, కలుషిత నీరు చుట్టుపక్కల గ్రామాల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయంటున్నారు. చెరువులు, బోర్లు, వ్యవసాయ భూములు ప్రభావితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎంపీ ఈటల రాజేందర్ నాలుగు రోజుల జన సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు 60 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ యాత్ర తొలి రోజు ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. పెద్ద చెరువును పరిశీలించిన ఈటల రాజేందర్‌కు స్థానిక మత్స్యకారులు తమ సమస్యలను వివరించారు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే వ్యర్థాలతో చెరువు నీరు కలుషితమై చేపలు తగ్గిపోతున్నాయని, జీవనోపాధి ప్రమాదంలో పడిందని వాపోయారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ఇదే సమస్యపై అప్పటి ఎంపీగా రేవంత్ రెడ్డి జాతీయ హరిత ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటినా శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపించారు.

రాజకీయంగా పోరాడిన అంశాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. ఇదే సమయంలో సమస్య పరిష్కారానికి ఒక స్పష్టమైన ప్రతిపాదనను కూడా ఈటల ముందుకు తెచ్చారు. మూడు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ నిధులు ఎలా వినియోగిస్తారు..? ప్రణాళిక ఏంటి..? అమలు ఎలా ఉంటుంది..? అనే అంశాలపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది.

డంపింగ్ యార్డు చుట్టూ ఉన్న గ్రామాల్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోని అనేక గ్రామాలపై కాలుష్య ప్రభావం పడుతోందని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని, భూగర్భ జలాలు నాణ్యత కోల్పోతున్నాయని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరుడు-వధువుల సంబంధాలపై కూడా ఈ కాలుష్య ప్రభావం పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు, క్యాన్సర్, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తొలి రోజు పాదయాత్ర ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద ప్రారంభమై మర్రిపల్లిగూడ, చందుపట్లగూడ, ఎన్‌ఎఫ్‌సీ నగర్, బొక్కనిగూడ, ఘనాపూర్ మీదుగా అన్నోజిగూడ వరకు కొనసాగింది. దాదాపు 14 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ప్రజల నుంచి ఫిర్యాదులు, సమస్యలు నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు.

మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కూడా ఈ అంశంపై స్పందించారు. డంపింగ్ యార్డు నుంచి ఉద్భవించే కాలుష్యం, దుర్వాసన విస్తృత ప్రాంతాలకు వ్యాపిస్తోందని, భూగర్భ జలాల కాలుష్యం భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది కేవలం జవహర్‌నగర్ లేదా పరిసర గ్రామాల సమస్య మాత్రమే కాదని, మొత్తం హైదరాబాద్‌కు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

ఇప్పుడు చర్చంతా సమస్య పరిష్కారంపైనే నడుస్తోంది. జవహర్‌నగర్‌లో భారీగా చెత్తను ఒకేచోట పోగు చేయడానికి బదులు, నగర శివార్లలో చిన్న చిన్న డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు సూచిస్తున్నారు. 20 నుంచి 30 చిన్న డంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహిస్తే సమస్య తీవ్రత తగ్గుతుందని వారు వాదిస్తున్నారు.

అయితే ఇక్కడే మరో ప్రశ్న ముందుకు వస్తోంది. కొత్త డంపింగ్ యార్డులు ఎక్కడ ఏర్పాటు చేస్తారు..? స్థానిక ప్రజల ఆమోదం ఎలా తీసుకుంటారు..? కాలుష్యం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారకుండా ఏ చర్యలు తీసుకుంటారు..? వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు ఎలా కల్పిస్తారు..? అనే అంశాలకు సమాధానాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చెత్తను తరలించడం ఒక పరిష్కారమైతే, కాలుష్యాన్ని నియంత్రించడం అసలైన సవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే సమస్యను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మార్చడం కాకుండా మూల కారణాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

ఇక బీజేపీ మాత్రం ఈ అంశంపై మరింత దూకుడుగా వెళ్లే సంకేతాలు ఇస్తోంది. ప్రభుత్వం స్పందించకపోతే లక్షలాది మందితో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈటల రాజేందర్ హెచ్చరిస్తున్నారు. దీంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య ఇక పర్యావరణ సమస్యగానే కాకుండా రాజకీయంగా కూడా కీలక అంశంగా మారుతోంది.

ఈటల రెండో రోజు పాదయాత్ర.. అన్నోజిగూడ, ఘట్‌కేసర్, రాంపల్లి మీదుగా కీసరలో ముగిసింది. మొత్తానికి జవహర్‌నగర్ చెత్త కుప్పల నుంచి ప్రారంభమైన ఈ పోరాటం ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాల దిశగా సాగుతోంది. ప్రజలు మాత్రం రాజకీయ విమర్శలు, ఆరోపణలు కాదు... స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన జీవితం కోరుకుంటున్నారు.

మూడు వేల కోట్ల రూపాయల ప్రతిపాదనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది..? డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందా..? ఈటల పాదయాత్ర రాజకీయ ఒత్తిడిని పెంచుతుందా..? లేక నిజంగానే ప్రజల సమస్యలకు ముగింపు పలుకుతుందా..? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం జవహర్‌నగర్ ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు.. చెత్త కుప్పల మధ్య సాగుతున్న తమ జీవితాలకు ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్