Burning Topic: ఇజ్రాయెల్‌లో అధికారం ఎవరిది?.. నెతన్యాహు వర్సెస్ ఐసెన్‌కాట్!

Burning Topic: ఇజ్రాయెల్‌లో ముగియనున్న నెతన్యాహు శకం? 28 రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్‌కాట్‌కు పిలుపు. సంకీర్ణ సర్కారుపై కొనసాగుతున్న సందిగ్ధత.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Nov 2026 7:22 AM IST
Burning Topic
X

Burning Topic: ఇజ్రాయెల్‌లో అధికారం ఎవరిది?.. నెతన్యాహు వర్సెస్ ఐసెన్‌కాట్! 

Burning Topic: ఇజ్రాయెల్ సుదీర్ఘకాలంగా దేశ ప్రధానిగా కొనసాగుతున్న బెంజమిన్ నెతన్యాహు శకం' ముగిసినట్లేనా? తాజా ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో ఆయన సుదీర్ఘ పాలనకు ముగింపు పలికే అవకాశాలు ఏర్పడ్డాయి. తీవ్ర రాజకీయ ప్రతిష్టంభన, దౌత్యపరమైన సంక్షోభాల నడుమ ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఒక అగ్నిపరీక్షలా మారింది. ఎన్నికల్లో ఏ ఒక్కరికీ మెజారిటీ దక్కకపోవడంతో, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ప్రతిపక్ష నేత జషర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న 66 ఏళ్ల గాడి ఐసెన్‌కాట్ భుజాలపై పెట్టారు అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనకు 28 రోజుల గడువు ఇచ్చారు. ఈ సమయంలో విఫలమైతే మరో 14 రోజుల పొడిగింపు కోరవచ్చు. ‘‘ఇప్పుడు జాతీయ అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన సమయం. దానికి మేం అర్హులమని నిరూపించేందుకు నా వంతు కృషి చేస్తాను’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ పార్లమెంటు నెసెట్‌లో మొత్తం 120 స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత ప్రధానమంత్రి నెతన్యాహునాయకత్వంలో లికుడ్ పార్టీ కూటమికి 53 స్థానాలకే పరిమితమైంది. ఐసెన్‌కాట్‌కు చెందిన జషర్ పార్టీకి 21 స్థానాలు ఉన్నాయి. యాయిర్ గోలన్ నేతృత్వంలోని డెమోక్రాట్స్, నఫ్తాలీ బెన్నెట్‌కు చెందిన టుగెదర్ పార్టీ, అవిగ్డోర్ లీబర్‌మన్ నేతృత్వంలోని ఇజ్రాయెల్ అవర్ హోమ్ పార్టీలు కలిపి ప్రతిపక్ష కూటమికి మొత్తం 48 స్థానాలు ఉన్నాయి. మరోవైపు అరబ్ పార్టీలైన రాఆమ్ , జాయింట్ లిస్ట్‌కు కలిపి 19 స్థానాలున్నాయి. ఈ పార్టీలు ఐసెన్‌కాట్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. వీటి మద్దతు లభిస్తే నెతన్యాహు వ్యతిరేక శిబిరం బలం 67 స్థానాలకు చేరుతుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ కన్నా ఎక్కుక మద్దతు లభించినట్లే.

కాగా అరబ్ పార్టీలను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేర్చుకునేందుకు గాడీ ఐసెన్‌కాట్ నిరాకరించారు. ఇజ్రాయెల్‌ను యూదు ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా గుర్తించాలని, పాలస్తీనా సాయుధ సంస్థ అయిన హమాస్‌ను స్పష్టంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలనే షరతులు విధించడంతో దీన్ని అంగీకరించడం అరబ్ పార్టీకు కష్టతరంగా మారింది. అయితే అరబ్ పార్టీల బయటి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఐసెన్‌కాట్ ముందున్న ఒక మార్గం. ఈ విధానంలో అరబ్ పార్టీలు మంత్రివర్గంలో చేరాల్సిన అవసరం లేదు. ఐషెన్‌కోట్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ప్రతిఫలంగా అరబ్ పార్టీలు కొన్ని డిమాండ్లు పెట్టే అవకాశం ఉంది. 2021లో నఫ్తాలీ బెన్నెట్ ప్రభుత్వంలో రామ్ పార్టీ చేరింది. ఇజ్రాయెల్ ప్రభుత్వ కూటమిలో స్వతంత్ర అరబ్ పార్టీ భాగస్వామి కావడం అదే తొలిసారి. అయితే ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో అక్రమ స్థిర నివాసాలు, పాలస్తీనా దేశ ఏర్పాటు అంశాలపై విభేదాలతో ఆ ప్రభుత్వం 18 నెలల్లోనే కూలిపోయింది.

అరబ్ పార్టీల మద్దతుపై ఆధారపడే మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికీ లీబర్‌మన్ వ్యతిరేకిస్తున్నారు. గోలన్ మాత్రం అరబ్ పార్టీలతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. యూదుల ఓట్లు, అరబ్బుల ఓట్ల మధ్య నెతన్యాహు సృష్టించిన జాత్యహంకార విభజనను ఇకపై అంగీకరించకూడదని ఆయన ఎన్నికల అనంతరం వ్యాఖ్యానించారు. దీంతో మరో మార్గంగా అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీలైన షాస్, యునైటెడ్ తోరా జుడాయిజంలను తన కూటమిలో చేర్చుకోవచ్చు. వీటికి కలిపి 13 స్థానాలున్నాయి. దీంతో ఐసెన్‌కాట్ కూటమి బలం 61కి చేరుతుంది. అయితే మత విద్యార్థులకు సైనిక సేవ నుంచి మినహాయింపుల విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. మరోవైపు నెతన్యాహు లికుడ్ పార్టీతో కలిసి ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ ఉంది. అలా చేస్తే 67 స్థానాల మద్దతు లభిస్తుంది. కానీ నెతన్యాహును అధికారంలో నుంచి తొలగిస్తామన్న ఎన్నికల హామీని ఐసెన్‌కాట్ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది.

మరోవైపు ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీల మద్దతు లభించకుండా నెతన్యాహు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో అరబ్ పార్టీలు అక్రమంగా గెలుపొందాయంటూ ఆయన ఆరోపణలు చేసినప్పటికీ అందుకు ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తెలిపింది. అధ్యక్షుడి ప్రకటనకు కొద్దిసేపటి ముందు నెతన్యాహు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశంలో జాతీయ ఐక్యత ప్రభుత్వం ఏర్పాటు కావాలని అందులో పిలుపునిచ్చారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే పార్టీలతో తొందరపడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సరికాదని హెచ్చరించారు. అరబ్ పార్టీలను దేశ భద్రతకు ముప్పుగా నెతన్యాహు, ఆయన మద్దతుదారులు పలుమార్లు అభివర్ణించారు. కాగా మెజారిటీ నిరూపించుకోవడంలో ఐసెన్‌కోట్ విఫమైతే ఐసెన్‌కాట్ విఫలమైతే నెతన్యాహుకు మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వవచ్చు. ఇద్దరూ విఫలమైతే పార్లమెంటు మరో అభ్యర్థిని ఎంపిక చేయవచ్చు. 100 రోజుల ప్రక్రియ ముగిసినా ప్రభుత్వం ఏర్పడకపోతే ఇజ్రాయెల్‌లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో కేవలం 48 స్థానాల ప్రధాన బలంతో 61 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడానికి ఐసెన్‌కాట్‌కు లభించిన 28 రోజుల సమయం ఒక 'టైమ్ బాంబ్' లాంటిదే. భిన్న ధృవాల వంటి పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం కత్తిమీద సామే. అరబ్ పార్టీల మద్దతుపై సందిగ్ధత, అల్ట్రా-ఆర్థడాక్స్ పార్టీల డిమాండ్లు ఐసెన్‌కోట్ ముందున్న అతిపెద్ద సవాళ్లు. అరబ్ పార్టీల బయటి మద్దతు లభిస్తే ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా పట్టణాలకు నిధులు కేటాయించడం, నిర్లక్ష్యానికి గురైన మౌలిక సదుపాయాలు, పాఠశాలల అభివృద్ధి, నేరాల నియంత్రణకు పోలీసు వ్యవస్థపై ఖర్చు పెంచడం వంటి చర్యలు ఉండవచ్చని భావిస్తు్న్నారు. అయితే గాజా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనియన్ల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అటు అమెరికా రాజకీయ పరిణామాలు, ఇటు దేశీయ సంక్షోభాల మధ్య ఐసెన్‌కాట్ ఇజ్రాయెల్‌ను గట్టెక్కిస్తారా, లేక దేశాన్ని మరో ముందస్తు ఎన్నికల వైపు నెట్టేస్తారా అనే ఆసక్తికర కథనం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్