Off The Record: గుంటూరు మేయర్ పీఠం ఎవరిది!

Off The Record: గుంటూరు మేయర్ పీఠం కోసం కూటమిలో తీవ్ర పోటీ. కాపు వర్గానికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్. రేసులో పలువురు టీడీపీ, జనసేన నాయకులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Oct 2026 8:01 AM IST
Off The Record
X

Off The Record: గుంటూరు మేయర్ పీఠం ఎవరిది!

Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత పరిధిలోని గుంటూరు నగరం తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరుంది. తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి పట్టు ఉండగా, పశ్చిమ నియోజకవర్గంలో మొదటి నుంచీ టీడీపీనే జెండా ఎగురవేస్తూ వస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయడంతో ఇక్కడ స్పష్టమైన సానుకూల సంకేతాలు కనిపించాయి. గెలుపుపై భారీగా ఆశలు పెరిగాయి. ప్రత్యర్థి వైసీపీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం కూటమిదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో టీడీపీతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీల నుంచి కూడా మేయర్ సీటు కోసం పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సారి మేయర్ ఎన్నికల విధానంలో మార్పు చేసి, ప్రత్యక్ష విధానంలో ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో అభ్యర్థి వ్యక్తిగత బలాలు, బలహీనతలు అత్యంత కీలకంగా మారాయి.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు దక్కిన కీలక పదవులన్నీ దాదాపు 'కమ్మ' వర్గానికే దక్కాయనే వాదన బలంగా వినిపిస్తోంది. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రి, చీఫ్ విప్, మిర్చి యార్డు చైర్మన్, మాజీ మేయర్ వంటి పదవులన్నీ ఒకే వర్గానికి వెళ్లడంతో.. ఈసారి మేయర్ పదవి కాపు వర్గానికి కేటాయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో కేవలం సత్తెనపల్లి నుంచి మాత్రమే కాపు వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ, టీడీపీ నుంచి పలువురు కాపు వర్గం నేతలు తీవ్ర ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర.. తాను కేవలం ఏడాది కాలమే మేయర్‌గా వ్యవహరించానని, తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్ కార్పొరేటర్లు వేములపల్లి బుజ్జి, శ్రీరాం ప్రసాద్, మన్నెం శివనాగమల్లీశ్వరరావు, మాదల చైతన్య తదితరులు కూడా మేయర్ అభ్యర్థి రేసులో ఉన్నారు. కాపు కోటా నుంచి డేగల ప్రభాకర్, ఉగ్గిరాల సీతారామయ్య కూడా ప్రయత్నాలు చేస్తుండగా, బీసీ కోటా నుంచి మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

కేవలం టీడీపీ మాత్రమే కాకుండా కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీలు కూడా గుంటూరు మేయర్ పీఠంపై కన్నేశాయి. జనసేన తరఫున సీనియర్ నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ లేదా ఆయన కుమారుడు కౌశిక్ కృష్ణ మేయర్ పదవిని ఆశిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అయితే గుంటూరు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, టీడీపీ గతంలోనూ తటస్థుల కోటా ప్రయోగాలు చేసింది. రాజకీయాలతో సంబంధం లేని వైద్య వృత్తిలో ఉన్న కొల్లి శారదను తీసుకువచ్చి మేయర్ చేయడం, మరో వైద్యురాలు శనక్కాయల అరుణకు ఎమ్మెల్యే పదవినిచ్చి మంత్రిని చేయడం లాంటి ప్రయోగాలు జరిగాయి. అలాగే 2000 సంవత్సరంలో లెక్చరర్‌గా పనిచేస్తున్న చొక్కా ఏసురత్నాన్ని బరిలోకి దింపి గెలుచుకుంది. ఈసారి కూడా అలాంటి తటస్థ అభ్యర్థుల ప్రయోగం ఉంటుందా లేక రాజకీయ నేతలకే అవకాశం దక్కుతుందా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

వైసీపీ హయాంలో 2021లో జరిగిన ఎన్నికల్లో కావటి మనోహర్ నాయుడు మేయర్ అయ్యారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విజయవాడలో సీటు ఖరారు అంశం గుంటూరుతో ముడిపడి ఉంది. సామాజిక సమీకరణాలు, మూడు పార్టీల సమన్వయం, రాజధాని జిల్లా కేంద్రం అనే ప్రతిష్టాత్మక అంశం నేపథ్యంలో గుంటూరు మేయర్ సీటు విషయంలో టీడీపీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల పైన అధికారికంగా స్పష్టత వచ్చిన తర్వాతే తెలుగు తమ్ముళ్ల రేసులో అసలు విజేత ఎవరో తేలనుంది. అప్పటివరకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉంటారు, రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉంటాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్