Burning Topic: ట్రంప్ సర్కార్‌కు చుక్కలు చూపించిన ఇండో అమెరికన్లు!
Burning Topic: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ సంతతి నేతలు ఘన విజయం సాధించారు.
Burning Topic: ట్రంప్ సర్కార్‌కు చుక్కలు చూపించిన ఇండో అమెరికన్లు!
Burning Topic: వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్స్ నుంచి న్యూఢిల్లీ సౌత్ బ్లాక్ వరకు... ఇప్పుడు ఒకటే చర్చ, అదే అమెరికా ఎన్నికల్లో ఇండో-అమెరికన్ల జైత్రయాత్ర. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ మూలాలున్న నేతలు సాధించిన అద్భుత విజయాలు, అగ్రరాజ్య రాజకీయాల్లో వారి ప్రాముఖ్యతను మరింత పెంచాయి.
భారతీయులు కేవలం వ్యాపార, సాంకేతిక రంగాలకే పరిమితం కాదని, అక్కడి రాజకీయాలను సైతం శాసించగలరని ఈ ఫలితాలు నిరూపించాయి. ఒక తరం క్రితం వరకు భారతీయ సంతతి ప్రజలు కేవలం వైద్యం, ఇంజనీరింగ్, ఐటీ, వ్యాపార రంగాలకే పరిమితం అమెరికా రాజకీయాల్లో ఏళ్లుగా ఉన్న వారిని కాసేపు పక్కనబెడితే తాజా ఎన్నికల్లో మరి కొందరు భారతీయ సంతతి నేతలు మొట్టమొదటిసారి చట్టసభల్లోకి ప్రవేశించారు.
వీరి గెలుపు అటు అమెరికా అంతర్గత విధానాల రూపకల్పనలోనూ, ఇటు భారత్‌తో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలోనూ ఎలాంటి కీలక పాత్ర పోషించబోతోందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఈ సారి కూడా భారత సంతతి నాయకులు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించారు. వర్జీనియాలోని 10వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి ప్రతినిధుల సభకు భారతీయ మూలాలు ఉన్న సుహాస్ సుబ్రమణ్యం మరోసారి ఎన్నికయ్యారు.
40 ఏళ్ల సుబ్రమణ్యం 61 శాతానికి పైగా ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్విత్కు 36 శాతం ఓట్లు వచ్చాయి. సుబ్రమణ్యం న్యూఓర్లీన్స్ లోని టులేన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో వైట్‌హౌజ్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేశారు. కర్ణాటక మూలాలు ఉన్న సుహాస్ సుబ్రహ్మణ్యం హైందవ సంస్కృతిని బలంగా గౌరవిస్తారు. యూఎస్ ప్రతినిధుల సభ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఆయన పవిత్ర భగవద్గీతపై ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించడం విశేషం.
కాలిఫోర్నియాలోని 3వ కాంగ్రెస్ నియోజకవర్గం నుండి డెమొక్రటిక్ పార్టీ తరపున అమీ బెరా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తన సమీప రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రాబ్ టక్కర్ పై స్పష్టమైన ఆధిక్యతతో గెలుపొందారు. అమీ బెరాకు 57.1% ఓట్లు రాగా, ప్రత్యర్థి రాబ్ టక్కర్‌కు 42.9% ఓట్లు లభించాయి.
ఈ విజయంతో అమీ బెరా అమెరికా ప్రతినిధుల సభకు ఎనిమిదోసారి ఎన్నికయ్యారు. యూఎస్ కాంగ్రెస్‌లో అత్యంత సుదీర్ఘకాలం సేవలు అందిస్తున్న భారతీయ సంతతి ప్రతినిధిగా సరికొత్త రికార్డు సృష్టించారు. అమీబెరాహౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. విదేశాంగ విధానాలు, ఇండో-పసిఫిక్ ప్రాంత వ్యవహారాలు, భారత్-అమెరికా సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
వాషింగ్టన్ స్టేట్‌లోని 7వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రమీలా జయపాల్ ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆమె వరుసగా ఆరోసారి యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2017 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమీలా జయపాల్, అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళగా గుర్తింపు పొందారు.
రాజకీయాల్లోకి రాకముందు ఆమె 'వన్ అమెరికా' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వలసదారుల హక్కుల కోసం ఒక దశాబ్దానికి పైగా ఉద్యమించారు.కేరళ పాలక్కాడ్‌కు చెందిన ప్రమీల ఇండోనేషియా, సింగపూర్లలో పాఠశాల విద్యను పూర్తి చేసి, తన 16వ ఏట ఉన్నత చదువుల కోసం ఒంటరిగా అమెరికాకు వెళ్లారు. జార్జ్‌టౌన్ యూనివర్సిటీ , నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు.
ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమోక్రాట్ అభ్యర్థి పియా దండియా విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కర్‌ను ఓడించి తొలిసారి కాంగ్రెస్‌లోకి ప్రవేశించనున్నారు. పియా దాండియాకు 51.9% ఓట్లు రాగా, ప్రత్యర్థి కేసీ అస్కర్కు 48.1% ఓట్లు లభించాయి. గతంలో ఉపాధ్యాయురాలిగా, ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసిన పియా దండియా పామ్ బీచ్ కౌంటీలోనే జన్మించి పెరిగారు.
హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. తన కళాశాల రోజుల్లో భారతదేశంలోని న్యూఢిల్లీలో వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ బోధించి సామాజిక సేవలో భాగమయ్యారు39 ఏళ్ల పియా దాండియా ఈ విజయంతో యూఎస్ కాంగ్రెస్‌లోని భారత సంతతి ప్రజాప్రతినిధుల సమూహమైన 'సమోసా కాకస్' లో సరికొత్త సభ్యురాలిగా చేరారు.
మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన తెలుగు మహిళ అరుణా మిల్లర్ మరోసారి విజయం సాధించారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన ఆమె గవర్నర్ వెస్ మూర్తో కలిసి పోటీ చేసి తిరిగి పదవిని నిలబెట్టుకున్నారు.
ఆమె 2022లో మొదటిసారి ఎన్నికైనప్పుడు అమెరికా చరిత్రలోనే లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని చేపట్టిన తొలి వలసదారురాలిగా, తొలి ఆసియా అమెరికన్ మహిళగా రికార్డు సృష్టించారు. అరుణ 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి కాట్రగడ్డ రావు గారు మెకానికల్ ఇంజనీర్.
ఆమెకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు వారి అమెరికాకు వలస వెళ్లి న్యూయార్క్‌లో స్థిరపడింది. అరుణా మిల్లర్ తొలిసారి లెఫ్టినెంట్ గవర్నర్‌గా భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేయడం ద్వారా హైందవ, భారతీయ మూలాలపై గౌరవాన్ని చాటుకున్నారు.
భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుండి ఘన విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి రితేష్ టండన్‌పై సుమారు 70 శాతానికి పైగా ఓట్లతో భారీ ఆధిక్యతతో గెలుపొందారు.
సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం నుండి రో ఖన్నా విజయం సాధించడం ఇది ఆరోసారి రోఖన్నా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే, అప్పట్లో పెద్దగా గుర్తింపు లేని బరాక్ ఒబామా ఇల్లినాయిస్ స్టేట్ సెనేట్ ఎన్నికల ప్రచారంలో రో ఖన్నా వాలంటీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ భాగస్వామి అయ్యారు.
లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో కేరళకు చెందిన నిత్యా రామన్ సంచలన విజయం సాధించారు. నగర చరిత్రలో తొలి ఆసియా-అమెరికన్ మేయర్‌గా రికార్డు సృష్టించారు. కేరళలో జన్మించి అమెరికాలో స్థిరపడిన నిత్యా రామన్ అరుదైన రాజకీయ ఘనత సాధించారు.
లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో 51.1 శాతం ఓట్లు సాధించి విజయం అందుకున్నారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌కు 48.33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆమె లాస్ ఏంజెలెస్‌కు 44వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవిని చేపట్టనున్న రెండో మహిళగానూ గుర్తింపు పొందనున్నారు. 2020లో తొలిసారిగా నిత్యారామన్ రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. అప్పటి సిట్టింగ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు డేవిడ్ ర్యూను ఓడించారు.
ఒక సర్వే ప్రకారం.. 62 శాతం మంది భారతీయ అమెరికన్లు తమ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో డెమోక్రటిక్ అభ్యర్థికే ఓటేస్తామని వెల్లడించారు. కేవలం 19 శాతం మంది మాత్రమే రిపబ్లికన్లకు మద్దతు ఇస్తామని తెలిపారు. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో 30 శాతం మంది రిపబ్లికన్లకు మద్దతు తెలపగా.. ఇప్పుడది 19 శాతానికి పడిపోయింది.
ట్రంప్ వలస విధానాలు, దేశ ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న తీరు, అమెరికా - భారత్ సంబంధాల పట్ల అత్యధిక మంది అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సర్వే పేర్కొంది. కాగా అమెరికా మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ మూలాలు ఉన్న నాయకుల్లో ఎక్కువగా డెమోక్రాట్లే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాల కారణంగా ఇటీవలి కాలంలో భారత్, అమెరికాల సంబంధాలు దెబ్బతిన్నాయి.
డొనాల్డ్ ట్రంప్ మన దేశ ఎగుమతులపై ఒక దశలో 50% వరకూ సుంకాలు విధించారు. తర్వాత 18%కు తగ్గించారు. ఈ భారాన్ని మరింత తగ్గించేలా డెమోక్రాట్లు ట్రంప్‌ను ఒత్తిడి చేయొచ్చు! సుంకాల విషయంలో ఆయన తీరుపై వారు విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ఇరు దేశాలకు కీలక పరీక్ష. హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు, ఫీజుల పెంపు వంటి ట్రంప్ నిర్ణయాలు భారతీయ ఐటీ నిపుణులు, కంపెనీలకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. ఆయన ఇమ్మిగ్రేషన్ విధానాలను డెమోక్రాట్లు గట్టిగా సవాలు చేస్తే.. భారతీయులకు కొంత ఉపశమనం దక్కొచ్చు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేవారిపై 100% సుంకాలు విధిస్తానని ట్రంప్ ఇన్నాళ్లూ బెదిరించారు. ఇప్పుడు ఆ విషయంలో కొంత వెనక్కి తగ్గొచ్చు. అదే జరిగితే.. భారత్‌కు చాలా ఊరట లభించినట్లే.




