Burning Topic: పాకిస్తాన్‌కు భారత్ దిమ్మతిరిగే షాక్!
Burning Topic: ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై అసత్య ఆరోపణలు. దీటుగా బదులిచ్చిన భారత బృందం, విదేశాంగ మంత్రి జైశంకర్.
Burning Topic: పాకిస్తాన్‌కు భారత్ దిమ్మతిరిగే షాక్!
Burning Topic: విద్వేష సూత్రం ఆధారంగా పుట్టిన పాకిస్థాన్ తన విధానాలను అలాగే కొనసాగిస్తుంది. భారత దేశం మీద ఏడవనిదే పాక్ నేతలకు పూట గడవదు. నిరంతరం భారత్ మీద విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. తమ దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిందేందుకు పొరుగు దేశాన్ని ఆడిపోసుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇందు కోసం నిరంతర అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకుంటారు. తాజాగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారు. ప్రపంచ దేశాలు సమతి సమావేశాల్లో ఆర్థికాభివృద్ధి, శాంతి భద్రతలు, సాంకేతికత అంశాలపై మాట్లాతుంటే, షెహబాజ్ మాత్రం ఎప్పటిలాగే కశ్మీ్ర్ పల్లవిని అందుకున్నారు. కశ్మీర్‌లో తీవ్రమైన మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతోందని అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి అంటూ మొసలి కన్నీరు కార్చారు
కశ్మీర్ ప్రజలు ఎనిమిది దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి హామీ కోసం ఎదురుచూస్తున్నారని షెహబాజ్ షరీఫ్ అన్నారు. తరతరాలుగా అక్కడి ప్రజల ఆక్రమణ, ఏకపక్ష నిర్బంధాలు, హత్యలు, అదృశ్యాలు, లైంగిక హింస, సామూహిక శిక్షలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వారి ఇళ్లు కర్ఫ్యూ నీడలో మగ్గిపోతున్నాయని, తమ వారి ఆచూకీ దొరక్క జీవితాలను గడుపుతున్నారని పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలకు వారి స్వీయ నిర్ణయాధికారం లభించే వరకు పాకిస్థాన్ తన పూర్తి స్థాయి దౌత్యపరమైన, రాజకీయ, నైతిక మద్దతును నిరంతరం అందిస్తుందని షరీఫ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ వైఖరి మారబోదని ఆయన చెప్పారు. 'కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్ జీవనాడి' లాంటిదని మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టారు. ఐక్యరాజ్య సమతి ఆధ్వర్యంలో నిష్పాక్షపాతమైన ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, అంతర్జాతీయ సమాజం న్యాయమైన, పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు సింధు జలాల ఒప్పందం అంశాన్ని కూడా షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేయడం చట్టబద్ధత లేనిదని ఆరోపించారు. సింధు నదీ వ్యవస్థకు చెందిన జలాలు పాకిస్తాన్‌తో పాటు మొత్తం ప్రాంతానికి జీవనాధారమని అన్నారు. పాకిస్థాన్‌కు రావలసిన నీటిని మళ్లించడానికి ఏ చిన్న ప్రయత్నం జరిగినా దానిని తీవ్రమైన యుద్ధ చర్య పరిగణిస్తామని ప్రేలాపనలు చేశారు. షరీఫ్ తన ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్థావించారు. పాక్ సైన్యం ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ నాయకత్వంలో భారత్ దాడిని తిప్పికొట్టిందని పేర్కొన్నారు. రెండు అణ్వాయుధ దేశాలు పూర్తిస్థాయి యుద్ధం అంచున ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకొని యుద్ధం ఆపారని ప్రశంసలతో ముంచెత్తారు.. కాగా షరీఫ్ తన పేరును సమితో ప్రస్థావించడాన్ని ట్రంప్ సోషల్ మీడియలో హైలైట్ చేసుకోవడం విశేషం.
పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది. జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు భారత్‌పై ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టారు సమితిలోని భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి పెటల్ గహ్లోత్. పదేపదే భారత్‌పై ఆరోపణలు చేసినంత మాత్రాన వాస్తవాలు మారవని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ చాలాకాలంగా ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని పెటల్ గహ్లోత్ స్పష్టం చేశారు. కశ్మీర్ గురించి మాట్లాడాలనుకుంటే ఆక్రమిత కశ్మీర్ ప్రజల పరిస్థితిని కూడా చర్చించాలని సూచించారు. ప్రత్యేకంగా రావలకోట్ ప్రజలను ఉద్దేశించి అక్కడి హింస, హక్కుల సమస్యలపై ప్రశ్నించాలని పేర్కొన్నారు.
ఉగ్రవాదులకు ఎక్కడా దాక్కునే అవకాశం ఉండదని అన్నారు. ఉగ్రవాదం, మోసం, ద్వంద్వ వైఖరి పాకిస్థాన్‌కు గానీ, ప్రపంచానికి గానీ ప్రయోజనం కలిగించవని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు భారత్ మీద అసత్య ఆరోపణలు చేస్తున్న పాకిస్థాన్‌ను ధీటైన సమాధానం ఇచ్చారు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భారత బృందానికి నాయకత్వం వహిస్తున్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. తన దౌత్యపరమైన వ్యూహాలతో, వాక్చాతుర్యంతో వార్తల్లో నిలిచారు. న్యూయార్క్‌లో విదేశాంగ మంత్రి సారా బైసోలోతో కలిసి 'నౌకాయానం, నావికుల భద్రత'పై సమావేశం తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించారు జైశంకర్. ఆ సమయంలో ఓ పాకిస్థానీ విలేకరి జైశంకర్‌ను ఉద్దేశిస్తూ- 'మీ ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఎప్పుడు ఆపుతుంది?' అని ప్రశ్నించారు. 'ఒక ఉగ్రవాద దేశమే నన్ను ఆ ప్రశ్న అడుగుతోంది' అని జైశంకర్ బదులిచ్చారు. తర్వాత ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని ఆ పాకిస్థానీ జర్నలిస్టుతో 'మీ సమాధానం మీరు స్పష్టంగా విన్నారు కదా' అని అన్నారు.
ఇక ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరో చేదు అనుభవం ఎదురైంది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంపై మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించడం ఎప్పుడు మానుకుంటుంది? ముంబయి ఉగ్రరూప దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌పై ఎప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు? అంటూ సంధించిన ప్రశ్నలకు షరీఫ్ సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడులతో పాటు, పహల్గాం ఘటనలో నిందితునిగా ఉన్నారు. అయితే ఆయన తమ దేశంలో లేడని, అఫ్గానిస్థాన్‌కు పారిపోయాడంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన 2026 మోస్ట్ వాంటెడ్ 'రెడ్ బుక్'లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ రివార్డును పెంచినట్లు ప్రకటించింది. పాకిస్థాన్ కపట నాటకాలు ప్రపంచానికి స్పష్టంగా అర్థమైపోతున్నాయి.




