Burning Topic: చైనా, పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చిన భారత్!

Burning Topic: భారతదేశ అణు సామర్థ్యం, రక్షణ రంగ వ్యూహం మరియు బడ్జెట్‌పై BAS మరియు SIPRI నివేదికల పూర్తి వివరాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Oct 2026 10:58 AM IST
Burning Topic
X

Burning Topic: చైనా, పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చిన భారత్!

Burning Topic: మీట నొక్కడమే ఆలస్యం.. ఇక లక్ష్యం వైపు దూసుకుపోతాయి.. అణ్వాయుధం కేవలం సైనిక శక్తి ప్రదర్శన కోసం కాకుండా, జాతీయ రక్షణ, సార్వభౌమాధికార రక్షణలో కీలకం. భారత్

శాంతిని కాంక్షించే దేశంగా ఉంటూనే, పొరుగు దేశాల నుండి ఎదురవుతున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మరింత సమర్ధంతంగా అణు సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్, చైనాతో మన దేశానికి ఘర్షణలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సుదూర లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల అధునాతన క్షిపణి వ్యవస్థలను నిరంతరం ఆధునీకరిస్తున్నాం.

ఇప్పుడు మన దేశం దగ్గర చెప్పుకోదగ్గ సంఖ్యలో అణ్వాయుధాలు సిద్దంగా ఉన్నాయి. భారత్ అణు శక్తి సామర్థ్యం, రక్షణ రంగంపై ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్' - BAS తాజాగా వెల్లడించిన నివేదిక చెప్పిన విషయం ఇదే.

భారత్ ఇప్పటి వరకూ ఆయుధ పోటీలో పాల్గొనడానికి కాకుండా, దురాక్రమణదారులను నిరోధించడానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో అణ్వాయుధాల ప్రయోగం విషయంలో "నో ఫస్ట్ యూజ్" విధానానికి కట్టుబడి ఉన్నాం.. అంటే మొదట దాడి చేయకూడదు. శత్రు దేశాలు అణు దాడికి పాల్పడితే ప్రతీకార చర్యగా మాత్రమే, తన అణు ఆయుధాలను ఉపయోగిస్తుంది.

దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఈ విధానాన్ని ఇప్పుడు పక్కన పెట్టింది మన దేశం. ఇందుకు కారణం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ప్రాంతీయ, భౌగోళిక ఉద్రిక్తతలే. ప్రతీ దేశం తన జాగ్రత్తలో తాను ఉండాల్సిందే. మన దేశం అణు ఆయుధ సంపత్తిని, క్షిపణి పరిధిని అధికారికంగా ఎప్పుడూ బహిర్గతం చేయదు. BAS తాజా నివేదిక ప్రకారం భారత్ దగ్గర దాదాపు 190 అణ్వాయుధాలు ఉండే అవకాశం ఉంది. శత్రువులు దాడికి పాల్పడితే కోలుకోలేని దెబ్బతీసే రీతిలో దెబ్బ తీసే సామర్థ్యం మన సొంతం.

ఇప్పటి వరకూ అణు వార్‌హెడ్‌లను, వాటిని ప్రయోగించే క్షిపణులను వేర్వేరు నిల్వ కేంద్రాలలో భద్రపరిచే విధానాన్ని ఉండేది. భారత అణు చరిత్రలో తొలిసారిగా ఈ వార్‌హెడ్‌లను కేవలం నిల్వ ఉంచడమే కాకుండా, ప్రయోగానికి సిద్ధంగా ఉంచుకుంది.అత్యంత కచ్చితత్వంతో లక్ష్యం దిశగా దూసుకెళ్లే అధునాతన క్షిపణి వ్యవస్థలతో భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో 'న్యూక్లియర్ ట్రయాడ్'ను భారత్ సిద్ధంగా ఉంచుకుంది.

ఇతర దేశాల సహాయం లేకుండా స్వదేశీ సాంకేతికతతో DRDO అభివృద్ధి చేసిన క్షిపణులు భారత్‌కు బలమైన రక్షణ కవచంగా మారాయని BAS నివేదిక తెలిసింది. ఆకాశ మార్గంలో అణు దాడులు చేయగల సామర్థ్యంలో మిరాజ్ 2000, జాగ్వార్ విమానాలు ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నాయి. జాగ్వార్ విమానాల స్థానంలో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఈ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

భారత అమ్ముల పొదిలో కీలకమైన అగ్ని క్షిపణులు సుదూర లక్ష్యాలను ఛేదిస్తాయి. అగ్ని-I నుంచి అగ్ని-IV క్షిపణులు 700 కిలోమీటర్ల నుంచి 3,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగి ఉన్నాయి. 6 వేల కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్న అగ్ని-5 పాకిస్థాన్, చైనా భూభాగంతో పాటు మధ్య ఆసియా, రష్యా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, యూరోప్ లోని ప్రధాన భాగాలను లక్ష్యంగా చేసుకోగలదు.

అగ్ని-5 ద్వారా ఒకేసారి వేర్వేరు లక్ష్యాలపై దాడి చేసే సాంకేతికతను భారత్ ఇప్పటికే విజవంతంగా పరీక్షించింది. భారత్ తన మూడో స్వదేశీ అణు జలాంతర్గామి 'INS అరిధమన్'ను నౌకాదళంలో చేర్చింది. ఇప్పటికే సేవలందిస్తున్న INS అరిహంత్, INS అరిఘాత్​లతో పాటు INS అరిధమన్ చేరికతో భారత్ సముద్ర అణు రక్షణ వ్యవస్థ అత్యంత శక్తివంతంగా మారింది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించే K-4 క్షిపణులు కూడా త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

ఈ ఏడాది జూన్ నెలలో ఆయుధ నియంత్రణ పరిశోధనా సంస్థ 'స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - సిప్రి' కీలక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ ‌దగ్గర ఉన్న అణ్యాయుధాలలో 12 మోహరింపు స్థితిలో ఉన్నాయి. మన దేశం దగ్గర 190 అణ్వాయుధాలు ఉన్నాయని ఈ నివేదిక చెప్పింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ మీద భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలకు దారితీసింది.

దీంతో ఇరు దేశాలు సైబర్ ఆపరేషన్లను కూడా ఏకకాలంలో ఉపయోగించాయని సిప్రి నివేదిక గుర్తుచేసింది.ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని భారత్ ఇప్పుడు తన అణు సంసిద్ధతను పెంచిందని చెబుతున్నారు. దక్షిణాసియాలో సైనిక పోటీ కేవలం సంప్రదాయ ఆయుధాలకే పరిమితం కాలేదని లాంగ్ రేంజ్ మిస్సైళ్లు, ఆర్మ్‌డ్ డ్రోన్లు, ఏఐ ఆధారిత వ్యవస్థలు, సైబర్ సామర్థ్యాల వైపు వేగంగా మళ్లుతోందని సిప్రి స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక అనిశ్చితులు, యుద్ధాల నేపథ్యంలో అనేక దేశాలు తమ అణు సామర్థ్యాలను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి దేశాలు కలిగిన దేశాలు తొమ్మిది. వాటి వద్ద మొత్తం 12,187 అణ్వాయుధాలు ఉన్నట్లు నివేదిక వివరించింది.

వీటిలో 4,012 వార్ హెడ్స్ మోహరించిన స్థితిలో ఉన్నాయి. రష్యా వద్ద 5,420, అమెరికా వద్ద 5,042 అణు వార్‌హెడ్లు ఉన్నాయి. చైనా 620, ఫ్రాన్స్‌ 370, యూకే 225, ఇజ్రాయెల్‌ 90, ఉత్తరకొరియా 60 అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి.భారత్ దగ్గర 190 అణ్వాయుధాలు ఉంటే, ఏడాది లోగా మరో 10 పెంచుకునే అవకాశం ఉందని సిప్రి నివేదిక చెప్పింది. ఇక పాకిస్థాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాల విషయంలో చైనాను భారత్‌ దృష్టిలో ఉంచుకున్నప్పటికీ పాకిస్థాన్‌ ద్వారా కలిగే ముప్పును తక్కువగా అంచనా వేయడం లేదు.

మరోవైపు ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఈ విషయంలో భారత్​కంటే ముందు అమెరికా, చైనా, రష్యా, జర్మనీ ఉన్నాయి. 2025లో భారత సైనిక వ్యయం 8.9 శాతం వృద్ధితో 92.1 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోని టాప్-15 సైనిక వ్యయ దేశాల్లో పాకిస్థాన్‌కు చోటు దక్కలేదు. 2021-25 మధ్య కాలంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ 8.2 శాతం వాటాతో నిలిచింది.

పాకిస్థాన్‌ 4.2శాతం వాటాతో ఐదో స్థానంలో ఉంది. పాక్‌తో పోలిస్తే భారత్ దాదాపు రెట్టింపు పరిమాణంలో ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు నివేదికలో సిప్రీ వివరించింది. 2021-25 కాలంలో ప్రధాన ఆయుధాలను పొందిన 162 దేశాలను కూడా SIPRI గుర్తించింది. ఇందులో ఉక్రెయిన్, భారత్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్ అతిపెద్ద దేశాలుగా ఉన్నాయి. ఈ కాలంలో జరిగిన మొత్తం ఆయుధ దిగుమతుల్లో వీటి వాటా 35 శాతంగా ఉందని పేర్కొంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్