Burning Topic: లద్దాక్ పేర్ల వివాదంపై భారత్ సీరియస్!
Burning Topic: లద్దాఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు భారత్ అధికారికంగా పేర్లు ఖరారు చేసింది. 'సర్వే ఆఫ్ ఇండియా' మ్యాప్‌తో చైనా విస్తరణ వాదానికి కేంద్రం గట్టి చెక్ పెట్టింది.
Burning Topic: లద్దాక్ పేర్ల వివాదంపై భారత్ సీరియస్!
Burning Topic: ఇరుగు-పొరుగు వారితో సఖ్యతగా, సామరస్యంగా ఉండాలి అని మన పెద్దలు చెబుతుంటారు. కానీ డ్రాగన్‌కు ఇలాంటి సుద్దులు ఏవీ నచ్చవు. తన విస్తరణ వాదంతో తన సరిహద్దుల్లో ఉన్న అన్ని దేశాలతోనూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. పొరుగు దేశాల భూభాగాలపై ఆధిపత్యం, సముద్ర మార్గాలపై నియంత్రణ కోసం చైనా అనుసరిస్తున్న దూకుడు విధానాలు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో నిరంతరం ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి.
ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో నిరంతరం కుట్రలు, వ్యూహాత్మక కదలికలను కొనసాగిస్తోంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ భూభాగాల ఆక్రమణతో పాటు గాల్వాన్, డోక్లాం వరకూ కుట్రలను కొనసాగించింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన చర్చలు జరిగి కొన్ని ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ, సరిహద్దుల్లో చైనా తన దురాక్రమణ ధోరణిని, వ్యూహాత్మక ఎత్తుగడలను మార్చుకోలేదు.
పొరుగు దేశాల్లోని సరిహద్దు ప్రాంతాలపై కన్నేసి వివాదాస్పద ప్రాంతాలుగా చిత్రీకరించడం, ఆ తర్వాత వాటికి చైనీస్ పేర్లు పెట్టి, అవి చారిత్రికంగా తమవేనని వాదించడం డ్రాగన్‌కు కొత్త కాదు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌ల మీద ఇలాంటి కుట్రలను అమలు చేసింది. భారత్ అభ్యంతరం వ్యక్తం చేసి పెట్టినా పట్టించుకోలేదు.
ఈ క్రమంలో మన దేశం కూడా చైనాకు ప్రతి చర్యలు మొదలు పెట్టింది.చైనా అమలు చేస్తున్న మ్యాప్‌ల మార్పులు, ప్రాంతాల పునః నామకరణ వ్యూహాలకు ధీటుగా భారత్ కూడా ఈ నెల 2న లద్దాఖ్‌లోని వ్యూహాత్మక భౌగోళిక ప్రదేశాలకు అధికారికంగా పేర్లను ఖరారు చేస్తూ తన సార్వభౌమాధికారాన్ని గట్టిగా చాటుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని 28 ప్రదేశాలకు కొత్త పేర్లతో గుర్తిస్తూ 'సర్వే ఆఫ్ ఇండియా' ద్వారా అధికారిక మ్యాప్ రూపొందింది. దీన్ని ఇటీవల కేంద్ర హోం శాఖ విడుదల చేసింది.
లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని అనేక శిఖరాలు, పర్వత శ్రేణులు, కనుమలు, హిమానీనదాలు, లోయలు, నదులు, సరస్సులు, భూభాగాలకు కొత్త పేర్లను నిర్ణయించారు. ఇందులోఅలీషా గిరి, బ్రాంగ్సా, చాప్చింగల్ పాస్, కనిష్క పీక్, కరుణ్ పీర్ పర్వతం, కుక్సెల్, మార్తాండ్ గిరి, పార్పిక్ హిమానీనదం, స్కామ్రి హిమానీనదం, షాచ్మిరిక్ పాస్, ష్కోర్గా లోయ, జొరావర్ పీక్ ఉన్నాయి.
దీంతోపాటు డెహ్రా కంపాస్, డ్రాక్ కార్పో, జోల్మోరి, కుమారాయణ పాయింట్, పాంగ్లంగ్, రించెన్ జాంగ్పో, సాక్యశ్రీ గిరి, గురు రిన్పోచే, షామల్ లుంగ్పా, యాంగ్పా నది, మార్పా లోత్సావా రి, మిలారేపా కాంగ్రి, శివ రి, మహేశ్వర రి పేర్లను కూడా భారత్ గుర్తించింది. భారత ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేసింది. వీటిలో షామల్ లుంగ్పాకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 1950వ దశకంలో ఈ ప్రాంతాన్ని సైనిక గస్తీ, బలగాల కదలికలకు ఉపయోగించే మార్గంగా పేర్కొన్నారు.
లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం యంత్రాంగంతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిని అధికారిక మ్యాప్‌లో గుర్తించడం ద్వారా కచ్చితమైన గుర్తింపుతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం సాధ్యమవుతుందని తెలిపింది. కొత్త పేర్లు నిర్ణయించిన ప్రాంతాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గోగ్రా, హాట్ స్ప్రింగ్ వంటి కీలకమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి.
ఇక్కడే 2020 మే 5న భారత, చైనా బలగాల ఘర్షణ జరిగిన గాల్వాన్ ప్రాంతం, పాంగాంగ్ సరస్సు ఉంది. ఈ ఘటన తర్వాత చాలా కాలం పాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరు దేశాలు చర్చల తర్వాత 2022లో కొన్ని ప్రాంతాల్లో సైనిక బలగాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలైంది. సరిహద్దులో ఎక్కడెక్కడ కీలక ప్రాంతాలు ఉన్నాయో స్పష్టంగా గుర్తించడం భారత సైనిక గస్తీకి, అధికారిక రికార్డుల నిర్వహణకు ఉపయోగపడుతుంది.
భారత్ తీసుకున్న చర్యలు చైనాలో మంట పుట్టించాయి. లద్దాఖ్ లోని 28 కీలక ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలకు భారత్ పేర్లు ఖరారు చేయడంపై అభ్యంతరం తెలిపింది. లద్దాఖ్‌ను తాము కేంద్రపాలిత ప్రాంతంగా భారత్ పరిగణించడాన్ని గుర్తించడం లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఆ నిర్ణయం చట్టవిరుద్ధమని, దీనివల్ల సరిహద్దు ప్రాంతాలపై తమ వైఖరి మారదని అన్నారు. భారత్, చైనా సరిహద్దులోని పశ్చిమ ప్రాంతాలు ఎప్పటి నుంచో తమకు చెందినవేనని వాదించారు.
భారత్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారుచైనా వాదనకు భారత విదేశాంగశాఖ ధీటుగా బదులిచ్చింది. లడఖ్ భారత్‌లో విడదీయలేని భాగమని, చైనా ఎంతగా నిరాకరించినా ఈ వాస్తవం మారదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ చేసిన ప్రకటన కూడా స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
భారత్ నిర్ణయంపై చైనా అభ్యంతరం తెలపడం వెనుక మరో అంశం కూడా ఉంది. 2023 నుంచీ అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెడుతూ వస్తోంది. ఆ రాష్ట్రాన్ని జాంగ్నాన్ లేదా దక్షిణ టిబెట్‌గా పేర్కొనగా భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అరుణాచల్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవ పరిస్థితులు మారవని తేల్చిచెప్పింది. చైనాకు మన దేశంతోనే కాదు, భూటాన్, నేపాల్, జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియాతో కూడా సరిహద్దు వివాదాలు ఉన్నాయి.
తైవాన్ను తమ భూభాగంగా భావించే చైనా, దాన్ని ఎలాగైనా విలీనం చేసుకుంటామని ప్రకటిస్తోంది. ఒకేసారి యుద్ధానికి వెళ్లకుండా, పొరుగు దేశాల భూభాగాలను కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ, ఆ తర్వాత తమవేనని మ్యాప్‌లు విడుదల చేయడం చైనాకు అలవాటు. చైనా చర్యలను తిప్పికొట్టేందుకే భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలతో కూడిన 'క్వాడ్' కూటమి తెర మీదకు వచ్చింది.
చైనా ఇప్పటికే కొన్ని భారత భూభాగాలను ఆక్రమించింది. పశ్చిమ సెక్టార్లో లడఖ్ సరిహద్దు ఉన్న దాదాపు 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని 1962 యుద్ధం సమయంలో అక్రమంగా ఆక్రమించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోని 5,180 చదరపు కిలోమీటర్ల షక్స్గమ్ వ్యాలీలో తిష్టేసింది. ఈ భూభాగాన్ని 1963లో పాకిస్తాన్ అక్రమంగా చైనాకు అప్పగించింది. ఇటీవల ఈ ప్రాంతంలో భారీగా సైనిక మౌలిక వసతులను నిర్మిస్తోంది. అంతే కాకుండా అరుణాచల్ తమదేనని ఎప్పటి నుంచో వాదిస్తోంది.
వ్యూహాత్మకంగా బౌద్ధ మతపరంగా అత్యంత కీలకమైన తవాంగ్ మీద ఎప్పటి నుంచో డ్రాగన్ కన్నుంది. అప్పర్ సుబన్సిరి జిల్లాలోని వివాదాస్పద ప్రాంతాల్లో రోడ్లు, సైనిక నిర్మాణాలు చేపడుతూ చొరబాట్లకు ప్రయత్నిస్తోంది. అంజావ్ సరిహద్దులో చైనా సైన్యం తాత్కాలిక టెంట్లు వేస్తూ నిఘా పెంచుతోంది. చైనా దురాక్రమణలను భారత్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది.




