Burning Topic: ఫ్లై దుబాయ్ కేసులో సంచలన విషయాలు!
Burning Topic: ఇజ్రాయెల్‌పై ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్ హమామ్ కుట్ర. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ సాహసంతో ప్రయాణికులను కాపాడిన సంచలన ఘటన వివరాలు.
Burning Topic: ఫ్లై దుబాయ్ కేసులో సంచలన విషయాలు!
Burning Topic: ఫ్లై దుబాయ్ కేసులో సంచలన విషయాలు! ఫ్లై దుబయ్ విమానం పేల్చివేతకు జరిగిన కుట్రపై ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ విమానయాన భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్న ఈ వ్యవహానంపై దర్యాప్తులో యూఏఈ, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు పాల్పంచుకుంటున్నాయి.
కాగా 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లో జరిగిన భయానక ఘటన తరహాలో ఇజ్రాయెల్ మీద విమాన దాడికి కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఫ్లై దుబయ్ విమానాన్ని టెల్ అవీవ్ గగనతలంలోకి తీసుకెళ్లి.. ఎత్తైన భవనాన్ని ఢీకొట్టి కూల్చివేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఇది సాధ్యం కాకపోతే బెన్‌గురియన్ విమానాశ్రయంపై కూల్చాలని ప్లాన్ చేశాడని చెబుతున్నారు.
అయితే పైలట్ స్మిత్ మచ్చర్ ప్రాణాలకు తెగించి పోరాడటంతో విఫలమైంది. దాంతో అతడు విమానాన్ని ఎడారిలో కూల్చేసేందుకు ఇంజిన్లు నిలిపివేసి ఉండొచ్చని చెబుతున్నారు. కాగా విమానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించే వరకు వేచి ఉండాలని అల్ హమామీ భావించాడు.
అక్కడ దాడి చేస్తే.. తన ప్రయత్నాన్ని గుర్తించి అడ్డుకునేందుకు ఇతరులకు తక్కువ సమయం ఉంటుందని అతడు అనుకున్నాడట. తన ప్రణాళిక సాధ్యం కాకపోవడంతో హమామీ మరో ఎత్తు వేశాడు. కాక్‌పిట్‌లో జరిగిన పెనుగులాట తర్వాత.. ఆటోపైలట్, ఇంజిన్ స్విచ్చ్‌లు ఆప్ చేశాడు. దీంతో విమానం కేవలం రెండు నిమిషాల్లో సుమారు 36 వేల అడుగుల నుంచి 17 వేల అడుగులకు పడిపోయింది. విమానంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి.
అప్పటికే హమామీ చేతిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగాడు. దీంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి వెళ్లి హమామీని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు ఆఫ్–డ్యూటీ పైలట్లు బాధ్యతలు చేపట్టి సౌదీ అరేబియాలోని తబూక్‌లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
కో-పైలట్ అల్-హమ్మామీ ఈ కుట్రను చాలా కాలం కిందే పన్నినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా పలు మార్లు బెన్‌గురియన్ వెళ్లి రెక్కీ నిర్వహించాడు. ఈ ఏడాది జులైలోనే విమానం కూల్చాలనుకున్న సిబ్బందిలో తన మిత్రుడు ఉండటంతో వెనక్కి తగ్గాడని చెబుతున్నారు. తనకు చావంటే ఎలాంటి భయం లేదని, విమానాన్ని ఎలాగైనా కూల్చాలనే అనుకున్నానని అల్-హమ్మామీ దర్యాప్తులో వెల్లడించాడు.
తానొక్కడే కుట్రలో పాల్పంచుకున్నానని అంటున్నాడు. ఒమన్‌కు చెందిన అల్-హమ్మామీకి ఉగ్రవాద భావజాలం ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. అంతకు ముందు పని చేసిన ఒమన్ ఎయిర్ సంస్థ ఈ కారణంగానే పక్కన పెట్టింది. అలాంటి వ్యక్తి ఫ్లైదుబాయ్ కో–పైలట్‌గా ఎలా కొనసాగాడు? ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాన్ని నడిపే అవకాశమెలా దక్కింది? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
ఘటనకు ముందు ప్రయాణికులు, సిబ్బంది వివరాలను యూఏఈ అధికారులు ఇజ్రాయెల్‌తో పంచుకున్నట్లు సమాచారం. అల్-హమ్మామీ ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు అతడు ఒమన్, సిరియా, మొరాకోలతో పాటు ఆస్ట్రేలియాలో రెండేళ్లు ఉన్నాడు. 2015లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి 2017 వరకు అక్కడే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
2019లో ఏ కోర్సులోనూ లేకపోవడంతో విద్యార్థి వీసా రద్దయింది. అతడిని విచారిస్తున్న అధికారులు.. సోషల్ మీడియాలో అతని పోస్టులు, కామెంట్లను పరిశీలిస్తూ మరింత సమాచారం రాబడుతున్నారు. ఇందులో ఒసామా బిన్ లాడెన్, అయమాన్ అల్ జవహరీ వంటి ఆల్‌ఖైదా అగ్రనేతలకు సంబంధించిన కంటెంట్ లభించింది. అల్-హమ్మామీ తన ఎక్స్ ఖాతాను తొలగించినా 3వేల పోస్టులను తిరిగి రాబట్టగలిగారు.
మహిళలు ఉద్యోగాలు చేయకూడదని, ముఖానికి ముసుగు ధరించే మహిళలకు పెద్దపీట వేయాలని అల్ హమ్మామీ తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.. విమానాలు నడపడమంటే తనకెంతో మక్కువని అరబిక్ భాషలో రాసుకొచ్చాడు. కాగా ఫ్లై దుబయ్ విమానం కూల్చివేత కుట్ర విఫలమైన నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా ఇచ్చిన పిలుపు అలజడి రేపుతోంది.
కో పైలట్ అల్-హమ్మామీని ప్రశంసిస్తూ అల్ ఖైదా మద్దతుదారులు నడుపుతున్న 'అల్-బయాన్' ఈ సందేశాన్ని విడుదల చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు గతంలో కంటే ఈ రోజు చాలా ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు. బహుశా దేవుడిపై నమ్మకం లేని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటాడు. అతడి చర్య చివరికి ఇస్లాంకు ప్రయోజనం చేకూరుస్తుంది.
అమెరికా అనే దుష్ట సామ్రాజ్యం అంతమయ్యే రోజు దగ్గరలోనే ఉందని అందులో పేర్కొన్నారు. "యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. ఇజ్రాయెల్, అమెరికన్లు, ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న అవిశ్వాసులందరినీ మోసుకెళ్తున్న విమానాలు ఇప్పటికీ ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. సెప్టెంబర్ 11, 30 తేదీల్లో జరిగినట్లుగా వాటిని లక్ష్యంగా చేసుకోవచ్చు అని అందులో పేర్కొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన విమానాలే లక్ష్యంగా దాడులకు తెగబడాలంటూ అల్ ఖైదా ఈ వార్తా కథనంలో పిలుపునిచ్చింది. ఆ వ్యాసంలో 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌లోకి ఒక విమానం కూలిపోతున్న చిత్రంతో పాటు, ఫ్లైదుబాయ్ విమానంపై జరిగిన దాడి చిత్రాన్ని కూడా ప్రచురించారు. ఈ కథనాన్ని టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా ప్రచారం చేసినప్పటికీ, కొద్దిసేపటికే తొలగించారు.
2001 నాడు అల్‌ఖైదాకు చెందిన 19 మంది ఉగ్రవాదులు 4 ప్రయాణీకుల విమానాలను హైజాక్ చేసి ఈ కుట్రను అమలు చేయడం తెలిసిందే. రెండు విమానాలు ట్వీన్ టవర్స్‌ను ఢీకొనగా, మూడో విమానం అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ను ఢీకొట్టింది. నాలుగో విమానంలో ప్రయాణీకులు ఎదురు తిరగడంతో మధ్యలో కూలిపోయింది. ఆనాటి ఘటనలో మొత్తం 2,977 మంది మరణించారు. నాటి ఘోర ఘటనను ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేదు.
మరోవైపు ఫ్లై దుబాయ్ ఘటనలో 180 మందిని కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ తనపై కోపైలట్ అల్-హమ్మామీ దారుణ దాడి ఘటనను వివరించారు. అబూదాబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్ఛార్‌తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. స్మిత్ మచ్చార్ ప్రపంచ మొత్తానికి ఒక నిజమైన హీరో అని ప్రశంసించారు.
కాక్‌పిట్‌లో ఉన్న అల్-హమ్మామీ ప్రార్థన చేసుకుంటానని తన వెనకవైపు వెళ్లాడని నెతన్యాహూకు వివరించారు స్మిత్. నాలుగైదు నిమిషాల తర్వాత హఠాత్తుగా తన తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగలడంతో కింద పడిపోయానని గుర్తు చేసుకున్నారు.
వెంటనే ఏదో జరుగుతోందని గ్రహించి కోపైలట్‌ను అడ్డుకోడానికి ప్రయత్నించానని తెలిపారు.అప్పటికే విమానం కిందకు జారిపోతుండగా కాక్ పిట్ తలుపు తెరవగా, అతడు మూసేశాడు. అయినా శక్తిని కూడ దీసుకొని తలుపు తెరవగానే అప్రమత్తమైన ప్రయాణీకులు వచ్చి రక్షించారని స్మిత్ మచ్చార్ గుర్తు చేసుకున్నారు.




