Off The Record: అనకాపల్లిలో స్థానిక ఎన్నికల్లో వందల్లో ఆశావహులు!

Off The Record: గ్రేటర్ విశాఖ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్‌లో మున్సిపల్ ఎన్నికల వేడి. 6 వార్డులకు గాను 150 మందికి పైగా ఆశావహుల నుంచి కార్పొరేటర్ టికెట్ల కోసం దరఖాస్తులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Oct 2026 11:40 AM IST
Off The Record
X

Off The Record: అనకాపల్లిలో స్థానిక ఎన్నికల్లో వందల్లో ఆశావహులు!

Off The Record: గ్రేటర్ విశాఖలో విలీనమైన అనకాపల్లి జోన్ 10లో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల వద్ద కార్పొరేటర్ టికెట్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసినట్లు సమాచారం. అందుతున్న అంచనాల ప్రకారం జనసేన నుంచి దాదాపు 50 మంది వరకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా టీడీపీ నుంచి 30 మంది, వైసీపీ నుంచి మరో 30 మంది, బీజేపీ నుంచి 10 మంది వరకు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీల నుంచి కూడా పలువురు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులను కలిపితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంటే ఆరు వార్డులకు సుమారు 150 మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారన్న మాట. ఈ లెక్కలు చూస్తేనే జోన్-10లో రాజకీయ పోరు ఎంత తీవ్రంగా సాగుతోందో అర్థమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పరిస్థితి ఇలా ఉంటే షెడ్యూల్ విడుదలైన తర్వాత పోటీ మరింత హీటెక్కడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక కోసం అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. దరఖాస్తులు స్వీకరించడం ఒకవైపు జరుగుతుండగా... మరోవైపు అభ్యర్థుల బలాబలాలపై నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి వార్డులో ఎవరి ప్రభావం ఎంత? స్థానికంగా ఎవరికి ప్రజల మద్దతు ఎక్కువ? పార్టీ కోసం ఎవరెంత కష్టపడ్డారు? వంటి అంశాలపై అధ్యయనం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక టికెట్ ఆశిస్తున్న నాయకులైతే తమ రాజకీయ భవిష్యత్తు ఈ నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నట్టుగా రంగంలోకి దిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు పార్టీ కార్యాలయాలు, స్థానిక నేతల ఇళ్లు, ముఖ్య నాయకుల వద్ద సందడి కనిపిస్తోంది. టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ సామాజిక వర్గ బలం, గత ఎన్నికల అనుభవం, పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక ప్రజల్లో ఉన్న గుర్తింపు వంటి అంశాలను పార్టీ పెద్దల ముందు ప్రస్తావిస్తున్నట్లు సమాచారం.

కొంతమంది ఆశావహులు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ప్రచారం కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు. వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించడం, స్థానిక సమస్యలను ప్రస్తావించడం, ప్రజల్లోకి వెళ్లడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. "టికెట్ వస్తే గెలుపు నాదే" అనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. అయితే ఆశావహులు ఎంతమంది ఉన్నా చివరికి పార్టీ బీఫారం మాత్రం ఒక్కరికే దక్కనుంది.

అదే ఇప్పుడు అసలు ఉత్కంఠకు కారణమవుతోంది. పార్టీలో కొనసాగుతున్న అంతర్గత పోటీ వల్ల కొందరికి టికెట్ లభిస్తే మరికొందరికి భారీ నిరాశ తప్పదని స్పష్టమవుతోంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎవరి పేరు ఖరారవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆశావహులంతా చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక బలం, సామాజిక సమీకరణాలు, పార్టీ కేడర్ మద్దతు, ఆర్థిక సామర్థ్యం, ప్రజల్లో గుర్తింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశమున్నట్లు చర్చ సాగుతోంది. దీంతో ప్రతి వార్డులోనూ సమీకరణాలు రోజుకోలా మారుతున్నాయి.

మరోవైపు కూటమి రాజకీయాలు కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య స్థానిక స్థాయిలో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందన్న అంశంపైనా ఆసక్తి నెలకొంది. దాంతో కొందరు ఆశావహుల రాజకీయ భవిష్యత్తు కూటమి నిర్ణయాలపై ఆధారపడే అవకాశం ఉంది. సీట్ల పంపకాల్లో మార్పులు జరిగితే ఇప్పటికే టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలకు షాక్ తగిలే అవకాశమూ లేకపోలేదు.

ప్రస్తుతం జోన్-10లో వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే. ఆరు వార్డులు ఉంటే... 150 మంది ఆశావహుల్లో ఎవరికి టికెట్ రానుంది..? ఎవరిని పార్టీ నాయకత్వం నమ్ముతుంది..? ఎవరికి బీఫారం దక్కుతుంది..? ఎవరికి చివరి నిమిషంలో ఎవరెవరికి చేదు అనుభవం ఎదురవుతుంది..? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ వచ్చిన వెంటనే అనకాపల్లి జోన్-10 రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ప్రస్తుతం టికెట్ కోసం సాగుతున్న ఈ అంతర్గత పోరు రేపు ఎన్నికల బరిలో కొత్త రాజకీయ కూటములు, కొత్త విభేదాలు, కొత్త సమీకరణాలకు దారితీస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి అనకాపల్లి జోన్-10లో ఇప్పుడు మొదలైన టికెట్ ఫైట్ ఎన్నికల వేళ రాజకీయ రణరంగంగా మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్