Off The Record: శ్రీకాకుళం మేయర్ పదవికి గుండా లక్ష్మిదేవి పోటీ చేస్తారా ?
Off The Record: శ్రీకాకుళం రాజకీయాల్లో గుండ కుటుంబం చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. మేయర్ పదవి కంటే కుమారుడిని అసెంబ్లీకి పంపడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పావులు కదుపుతున్నారు.
Off The Record: శ్రీకాకుళం మేయర్ పదవికి గుండా లక్ష్మిదేవి పోటీ చేస్తారా ?
Off The Record: శ్రీకాకుళం రాజకీయాల్లో ప్రస్తుతం గుండ కుటుంబం చుట్టూనే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్న శ్రీకాకుళంను మున్సిపల్ కార్పొరేషన్గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి. ఆమె భర్త, దివంగత మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పేరు ఇప్పటికీ జిల్లాలో ప్రభావవంతంగానే వినిపిస్తుంది. అయితే రాజకీయంగా ఈ కుటుంబానికి విజయాల కంటే ఎదురుదెబ్బలే ఎక్కువగా తగిలాయన్న అభిప్రాయం వారి అనుచరుల్లో ఉంది.
2014 ఎన్నికల సమయంలో కూడా తనకు టికెట్ రాకపోయిందన్న విషయం మీడియా ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిన పరిస్థితులు ఎదురయ్యాయని అప్పట్లో రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి. పార్టీ కోసం శ్రమించినా సరైన గుర్తింపు దక్కలేదన్న భావన ఆ కుటుంబంలో ఇప్పటికీ ఉందని అనుచరులు చెబుతున్నారు.
ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలపై కసరత్తు ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి మేయర్ ఎవరన్న చర్చ జోరందుకుంది. టీడీపీ అధిష్ఠానం గుండ కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచనలో ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అందుకే మేయర్ పదవి గుండ లక్ష్మీదేవికి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మేయర్ కుర్చీ కోసం లక్ష్మీదేవి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. తనను "అధ్యక్షా" అని పిలవడం కంటే.. రేపు అసెంబ్లీలో తన కుమారుడు గుండ విశ్వనాధ్ ఎమ్మెల్యేగా నిలబడి "అధ్యక్షా" అని సభను ఉద్దేశించి మాట్లాడితే చూడాలని కలగంటున్నారట. ఇదే విషయాన్ని ఆమె తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు రాజకీయ చర్చ జరుగుతోంది.
అందుకే గత రెండున్నరేళ్లుగా ఆమె సహనంతో ఎదురు చూస్తున్నారట. అధిష్ఠానం నుంచి కూడా "నేను ఉన్నాను.. వారసుడిని తీసుకురా.. నేను చూస్తాను" అనే భరోసా లభించిందని, అందుకే అమెరికాలో ఉద్యోగ జీవితం సాగిస్తున్న కుమారుడు విశ్వనాధ్ను ప్రత్యేకంగా శ్రీకాకుళం తీసుకొచ్చారని అనుచరులు చెబుతున్నారు.
ఇప్పటికే విశ్వనాధ్ అమెరికా నుంచి స్వస్థలానికి చేరుకొని పార్టీ పెద్దలను కలిసినట్లు సమాచారం. అయితే జిల్లాకు చెందిన కొందరు కీలక నాయకులను ఆయన కలవలేదనే కారణంతో రాజకీయంగా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ప్రచారం కూడా పాత కేడర్లో వినిపిస్తోంది. మేయర్ పదవి గానీ, భవిష్యత్తులో ఎమ్మెల్యే సీటు గానీ దక్కకుండా తెరవెనుక రాజకీయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అనుచరుల నుంచి వినిపిస్తున్నాయి.
ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. జిల్లా స్థాయి పార్టీ కార్యక్రమాలకు గుండ కుటుంబానికి సరైన ఆహ్వానం కూడా అందడం లేదని, ఒకప్పుడు వారితో కలిసి పనిచేసిన కార్యకర్తలకు కూడా పదవులు దక్కడం లేదని లక్ష్మీదేవి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కానీ ఇవన్నీ జరుగుతున్నా ఆమె మాత్రం ఎవరి మీదా నేరుగా విమర్శలు చేయకుండా మౌనం పాటిస్తుండటం స్థానిక రాజకీయాల్లో మరింత చర్చకు దారి తీస్తోంది.
గత ఎన్నికల సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలపై కూడా పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టిందనే ప్రచారం నడుస్తోంది. గుండ కుటుంబానికి తగిన గుర్తింపు ఇవ్వాలని ఉన్నత స్థాయిలో చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అలాగే దివంగత అప్పలసూర్యనారాయణ విగ్రహావిష్కరణ విషయంలోనూ ఆటంకాలు ఎదురవుతున్నాయని పార్టీ పెద్దలకు లక్ష్మీదేవి వివరించినట్లు సమాచారం.
ఇదే సమయంలో మరో రాజకీయ లెక్క కూడా తెరపైకి వస్తోంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే శ్రీకాకుళం అర్బన్, రూరల్ నియోజకవర్గాలుగా విడిపోయే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అదే జరిగితే ప్రస్తుత ఎమ్మెల్యే స్థానం కూడా సురక్షితంగానే ఉండడమే కాకుండా గుండ కుటుంబానికి కూడా ఒక నియోజకవర్గంలో అవకాశాలు కల్పించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అందుకే లక్ష్మీదేవి మేయర్ పదవిని తుది లక్ష్యంగా చూడడం లేదని తెలుస్తోంది. ఆమె రాజకీయ ఆలోచన మొత్తం తన కుమారుడిని రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో నిలబెట్టడంపైనే కేంద్రీకృతమైందని అనుచరులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు ఇతర పార్టీల నుంచీ కూడా గుండ కుటుంబానికి ఆహ్వానాలు వెళ్లాయన్న ప్రచారం సాగుతోంది. రాజకీయంగా బలమైన కుటుంబంగా, ప్రజల్లో సానుభూతి ఉన్న నేతలుగా వారిని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు జరిగాయని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలపై గుండ కుటుంబం ఎలాంటి స్పందన ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీపైనే విశ్వాసం ఉంచిందని వారి అనుచరులు చెబుతున్నారు.
ఇంకా ఒక రాజకీయ ఆసక్తికర అంశం ఏమిటంటే.. గుండ లక్ష్మీదేవి లేదా గుండ విశ్వనాధ్ మేయర్గా పోటీ చేస్తే విజయం పెద్ద సవాల్ కాదనే అభిప్రాయం అనేక వర్గాల్లో వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, గుండ కుటుంబానికి ఉన్న ప్రజాదరణ, సానుభూతి కలిసి వస్తే విజయావకాశాలు మరింత పెరుగుతాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అయితే లక్ష్మీదేవి మనసులో మాత్రం మరో లెక్క నడుస్తోందట. మేయర్ కుర్చీ కంటే ఎమ్మెల్యే సీటు పెద్దది. కార్పొరేషన్ అధ్యక్షుడిగా కాకుండా అసెంబ్లీలో ప్రజాప్రతినిధిగా తన కుమారుడిని చూడాలన్నదే ఆమె కలగా మారిందని సన్నిహితులు చెబుతున్నారు.
మొత్తానికి.. శ్రీకాకుళం రాజకీయాల్లో ఇప్పుడు మేయర్ ఎన్నికల కంటే పెద్ద చర్చ గుండ కుటుంబ రాజకీయ భవిష్యత్తుపైనే సాగుతోంది. మేయర్ పదవి స్వయంగా వచ్చి తలుపు తడుతున్నా.. లక్ష్మీదేవి దానిపై ఆసక్తి చూపట్లేదనే ప్రచారం నిజమేనా..? కుమారుడు విశ్వనాధ్ కోసమే ఆమె అన్ని అవకాశాలను వదులుకుంటున్నారా..?
అధిష్ఠానం నిజంగా గుండ కుటుంబానికి పెద్ద రాజకీయ బాధ్యత అప్పగించబోతుందా..? 2029 ఎన్నికల నాటికి శ్రీకాకుళం రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి..? అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. గుండ లక్ష్మీదేవి లక్ష్యం "మేయర్" కాదు... "వారసుడి రాజకీయ భవిష్యత్తు" అనే మాట శ్రీకాకుళం రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.




