Burning Topic: భారత్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
Burning Topic: భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశాన్ని కొందరు అడ్డుకుంటున్నారంటూ ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు. టెలికాం శాఖ ఖండన, స్పందించిన రాహుల్ గాంధీ.
Burning Topic: భారత్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
Burning Topic: ఎలాన్ మస్క్ పేరు వినని వారు ఉండరనడం అతిశయోక్తి కాదు. అమెరికాకు చెందిన ఈ వన్ ట్రిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక, పారిశ్రామిక దిగ్గజాలలో ఒకరు. ఒకే రంగానికి పరిమితం కాకుండా ఆటోమొబైల్స్, అంతరిక్ష పరిశోధనలు, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ వంటి విభిన్న రంగాలలో విప్లవాత్మక వ్యాపారాలను నడుపుతున్నారు. ఎలాన్ మస్క్ వ్యాపారాల్లోని స్పేస్‌ఎక్స్ సంస్థ అందిస్తున్న శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ ఒకటి. కేబుల్స్, మొబైల్ టవర్లతో సంబంధం లేకుండా, అంతరిక్షంలోని ఉపగ్రహాల ద్వారా ఇది నేరుగా ఇంటర్నెట్‌ను అందిస్తుంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ సహా ప్రపంచవ్యాప్తంగా 160 కి పైగా దేశాలు, భూభాగాల్లో అధికారికంగా అందుబాటులో ఉన్నాయి.
ఎలాన్ మస్క్ తాజాగా మన దేశం మీద చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. స్టార్‌లింక్ భారత్‌లో అడుగుపెట్టకుండా టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. భారత టెలికాం మార్కెట్‌పై తమకున్న గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకే వారు ఈ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇది భారత ప్రజలపై చేస్తున్న నేరమని ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీని వెనుక ఉన్నది ఎవరో ఇప్పటికే మీరు ఊహించుకోవచ్చంటూ ఎక్స్ వేదికగా మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ టెలికామ్ కంపెనీ అధినేత పేరును నేరుగా ప్రస్థావిస్తూ ఆయనే నిజమైన బాసా? అని ప్రశ్నించారు. ఈ వ్యక్తులు రష్యాకు చెందిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపగల ఒలిగార్క్‌లతో పోల్చారు. మస్క్ నేరుగా భారత్ మీద దాడికి దిగడం సంచలనం రేపింది. ఎలాన్ మస్క్ తన ఆరోపణలకు ఆధారంగా డాగ్జ్ డిజైనర్ ఎక్స్ పేజీని ట్యాగ్ చేశారు.
మణిపూర్‌లో జరిగిన భద్రతా దళాల సోదాల్లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ పరికరాలు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. చురచంద్‌పూర్, చందేల్, కాంగ్పోక్పి జిల్లాల్లో ఆర్మీ, అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో 29 ఆయుధాలతో పాటు స్టార్‌లింక్ డిష్, రౌటర్ లభించాయి. అయితే భారత్‌లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులో లేవని, ఇక్కడ శాటిలైట్ సిగ్నల్స్ ఆఫ్‌లో ఉన్నాయని ఎలాన్ మస్క్ తెలిపారు. ఉగ్రవాదులు స్టార్‌లింక్ ఉపయోగిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. కాగా మయన్మార్, భూటాన్ ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులో ఉండటంతో, అక్కడి నుంచి ఈ పరికరాలు అక్రమంగా మణిపూర్‌లోకి వచ్చి ఉండొచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. భారత్‌లో స్టార్‌లింక్ ఉపగ్రహ సంకేతాలు అందుబాటులో అక్కడ ఈ పరికరాలు అనుసంధానమయ్యే అవకాశం లేదని డాడ్జ్‌డిజైనర్ తెలిపింది. ఉగ్రవాదులు స్టార్‌లింక్‌ను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు అర్థరహితమని పేర్కొంది.
మే 2026 నాటికి భారత్‌లోని 11,256 గ్రామాలకు 4జీ కవరేజీ లేదని డాగ్జ్ డిజైనర్ పోస్టు తెలిపింది. మన దేశంలో 1.093 బిలియన్ ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్లు ఉండగా, వాటిలో 440.87 మిలియన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 మందికి 123.80 ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 48.31గా ఉందని ఆ పేర్కొన్నారు. దేశంలోని మొత్తం ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్లలో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ వాటా 4.26 % అని వివరించారు. ఫైబర్ నెట్‌వర్క్, మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడం కష్టంగా ఉండే మారుమూల గ్రామాలు, పర్వత ప్రాంతాలు, ద్వీపాలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా వేగవంతమైన కనెక్టివిటీ అందించవచ్చని పేర్కొంది. దీంతో ఆన్‌లైన్ విద్యకు, దూరవైద్య సేవలకు, చిన్న వ్యాపారాలు ఎంతో ప్రయోజనం కలుగుతుందని డాడ్జ్‌డిజైనర్ పోస్టు తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో చేసిన ప్రసంగం నేపథ్యంలో ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో సాంకేతికత కొద్దిమంది సంపన్నులకే పరిమితమై ఉండేదని, డిజిటల్ ఇండియా ఉద్యమం ద్వారా సాంకేతికతను సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చి ప్రజాస్వామీకరించామని ప్రధాని గుర్తుచేశారు. భారత్‌లోనే మొబైల్స్, టెలికాం పరికరాల తయారీని విస్తరించి విదేశీ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించామని వివరించారు. భారత్ వస్తువులను వినియోగించే స్థాయి నుంచి సరికొత్త ఆవిష్కరణలు చేసే స్థాయికి ఎదుగుతోందని, దేశీయంగా మొబైల్స్, టెలికాం పరికరాల తయారీ విస్తరిస్తోందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. మన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక శక్తివంతమైన సాధనంగా మారుతోందని పేర్కొన్నారు.
కాగా ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను భారత టెలికాం మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. స్టార్‌లింక్‌తో పాటు జియో, వన్‌వెబ్ వంటి అన్ని కంపెనీలకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. స్పెక్ట్రమ్ కేటాయింపు, సెక్యూరిటీ క్లియరెన్స్‌లకు సంబంధించిన ప్రక్రియ అందరికీ ఒకే విధంగా నిష్పక్షపాతంగా జరుగుతోందని తేల్చిచెప్పింది. మస్క్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. కాగా ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ భారత్‌లో తన సేవలను ప్రారంభించేందుకు 2019-2020 ప్రాంతం నుంచీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం 2021లో భారత్‌లో ‘స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో అనుబంధ సంస్థను రిజిస్టర్ చేశారు. అయితే ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే కనెక్షన్ల కోసం ముందస్తు బుకింగ్‌లు స్వీకరించడంతో టెలికాం శాఖ అభ్యంతరం తెలిపింది.
2022-2023 మధ్య కాలంలో భారత ప్రభుత్వ కొత్త శాటిలైట్ కమ్యూనికేషన్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారం దేశంలోనే భద్రపరిచే డేటా లోకలైజేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్‌లపై చర్చలు జరిగాయి. విదేశీ పెట్టుబడులు, భద్రతా నిబంధనల కారణంగా లైసెన్స్ ప్రక్రియ ఆలస్యమైంది. 2024లో స్పేస్ సెక్టార్‌లో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేయడంతో, స్పెక్ట్రమ్ కేటాయింపు, లైసెన్సింగ్ ప్రక్రియ కోసం స్టార్‌లింక్ తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. 2025లో టెలికాం శాఖ నుంచి అధికారికంగా జీఎంపీసీఎస్ లైసెన్స్, అలాగే అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్ స్పేస్ నుంచి తుది ఆమోదం లభించింది. డిసెంబర్ నాటికి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. భారత్‌లో లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే 20 గేట్‌వే సైట్లను స్టార్‌లింక్ నిర్మించింది.
భారత్‌లో అనేక నియంత్రణ సవాళ్లు, భద్రతా నిబంధనలు, వివాదాలను దాటుకుంటూ స్టార్ లింక్ ప్రాజెక్ట్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. డేటా సెక్యూరిటీ నిబంధనలను పూర్తి చేసి, ప్రస్తుతం స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించిన తుది ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అయినప్పటికీ తన సంస్థను భారత్‌లో అడుగు పెట్టడం లేదని మస్క్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్ ద్వారా తక్షణమే స్పందించారు. ఇండియాకు స్వాగతం ఎలాన్.. మీరు ఆ రెండో వ్యక్తి గురించి తెలుసుకునే వరకు ఆగండి అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నేరుగా ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ అవి ఇద్దరు వ్యాపార ప్రముఖుల గురించేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ స్పందనకు ఎలాన్ మస్క్ తిరిగి సమాధానమిస్తూ, "థాంక్యూ రాహుల్. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయమే" అని పేర్కొన్నారు.




