Off The Record: మొదలైన ఎన్నికల జాతర.. రసవత్తరంగా తెలంగాణ రాజకీయాలు!
Off The Record: ఖైరతాబాద్ ఉపఎన్నిక కోర్టు కేసుల వల్ల, జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటర్ల జాబితా సవరణ, పాలనా పరమైన కారణాల వల్ల ఆలస్యమవుతున్నాయి.
Off The Record: మొదలైన ఎన్నికల జాతర.. రసవత్తరంగా తెలంగాణ రాజకీయాలు!
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు ఎలక్షన్ల మీదే ఉంది. అవును.. రాష్ట్రంలో మరో ఎన్నికల సీజన్ ప్రారంభం కాబోతోంది. 2028 ప్రధాన అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తెలంగాణ రాజకీయాల్లో రకరకాల ఎన్నికల జాతర జరగనుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అలాగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు వరుసగా క్యూ కడుతున్నాయి.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైంది. మరోవైపు, ఖైరతాబాద్ బై-ఎలక్షన్ రాజ్యాంగబద్ధంగా ఆరు నెలలలోపు నిర్వహించాల్సి ఉంది. దీనికి ఎన్నికల సంఘం ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందా అని ఆశావాహులు, నేతలు ఎదురుచూస్తున్నారు. కానీ, ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది. అసలు ఈ ఆలస్యానికి కారణం ఏమిటి..? ఎందుకు నోటిఫికేషన్లు ఇప్పట్లో వచ్చేలా లేవు..? అన్నదే రాజకీయ విశ్లేషకల్లో వినిపిస్తున్న చర్చ.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక డ్రాఫ్ట్ విడుదలైంది. అయితే ఈ డ్రాఫ్ట్‌లో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం సంచలనంగా మారింది. పేరు గల్లంతైన వారందరికీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
నిజానికి, ఈ ప్రక్రియ జూన్ 15, 2026 నాడే ప్రారంభమై.. అక్టోబర్ 1వ తేదీ కల్లా తుది ఓటరు జాబితా ప్రచురించాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ చాలా మందకొడిగా సాగింది. దీంతో గడువును పొడిగించారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల మార్పు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 7వ తేదీ వరకు చివరి గడువు ఇచ్చారు. ఇప్పుడు తుది ఓటరు జాబితాను నవంబర్ 9వ తేదీన ప్రచురించబోతున్నారు.
అయితే ఇక్కడే మరో అనుమానం వ్యక్తమవుతోంది. నవంబర్ 9న వచ్చే ఫైనల్ లిస్ట్‌లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా..? లేదా ఈ గడువును మళ్లీ పొడిగిస్తారా..? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ గడువు మళ్లీ పెంచితే, ఈ ఎలక్షన్ల ప్రక్రియ మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే, నిబంధనల ప్రకారం..
సర్ ప్రక్రియ పూర్తిగా ముగిసి, ఫైనల్ ఓటర్ లిస్ట్ వెలువడిన తర్వాతే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంత మేర ఓట్లు ఉన్నాయి, ఎంత మంది ఓట్లు తొలగించారు అనే కచ్చితమైన స్పష్టత వస్తేనే ఈసీ అడుగు ముందుకు వేస్తుంది. అంతేకాదు, ఈ తుది ఓటర్ లిస్ట్ పై ఏవైనా వివాదాలు తలెత్తి.. అభ్యర్థులు హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మాత్రం.. ఈ జాప్యం మరింత ఎక్కువయ్యే ఛాన్స్ లేకపోలేదు.
రాజకీయ లెక్కల ప్రకారం చూస్తే.. ఖైరతాబాద్ ఉపఎన్నికను మార్చి లోపు నిర్వహించాల్సి ఉంది. అయితే దీనికి నోటిఫికేషన్ రావాలంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ చేతికి రావాలి. ఒకవేళ నవంబర్ మొదటి లేదా రెండో వారంలో ఓటర్ లిస్ట్ వస్తే, ఆ తర్వాత నోటిఫికేషన్ వెలువడి ఎన్నికలు జరగడానికి కనీసం 30 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. దీన్నిబట్టి చూస్తే, జనవరి రెండు లేదా మూడో వారంలో ఖైరతాబాద్ ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక దీని వెంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు, ఆ తర్వాతే GHMC కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే.. రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయం వేడెక్కడం ఖాయం. కానీ అభ్యర్థులు, ఆశావాహులు మాత్రం ఎన్నికల నోటివఫికేషన్ ఎప్పుడు వస్తుంది..? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.
ఇలా తెలంగాణ రాజకీయ రణరంగంలో ప్రధాన పార్టీల వ్యూహాలు రంజుగా మారాయి. గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్తోంది. ప్రభుత్వ పట్ల సానుకూలతను పెంచుకుంటూ, ప్రతిపక్షాలకు మళ్లీ అవకాశం ఇవ్వకూడదని పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది.
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గత పాలనలోని సంక్షేమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర పోరాటం చేస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో పూర్వవైభవాన్ని దక్కించుకోవడానికి, కేడర్‌లో జోష్ నింపడానికి ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఇక దూకుడు పెంచిన భారతీయ జనతా పార్టీ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతూ, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత, ఇంకోవైపు దూకుడు రాజకీయాలు.. ఈ త్రిముఖ పోరులో ఎవరి వ్యూహం ఫలిస్తుంది? ఓటర్ దేవుడు ఎవరికి పట్టం కడతాడు? వేచి చూడాల్సిందే.




